Janhavi Nilekani: నార్మల్‌ డెలివరీలు ‘నార్మల్‌’ కావాలి

14 Oct, 2023 00:27 IST|Sakshi

డాక్టర్‌ జాన్హవి నిలేకని

గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్‌ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్‌ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్‌ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది.

ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్‌ డాక్టర్‌ జాన్హవి నిలేకని మెటర్నల్‌ హెల్త్‌కేర్‌ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్‌వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే..

‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్‌ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్‌ చేస్తున్నాను.

ఆ సమయంలో నార్మల్‌ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్‌ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్‌ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి.

జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్‌ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్‌ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్‌ డెలివరీ అయ్యింది.

దేశమంతటా..
మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌లు, జీఎన్‌ఎమ్‌లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్‌ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు.

ప్రసవ సమయంలో అగౌరవం
ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్‌ సెక్టార్‌ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను.

ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్‌ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్‌లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది.

ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్‌ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్‌లో ప్లేస్‌ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్‌ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్‌ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్‌ డెలివరీ సురక్షితమైంది.

కౌన్సెలింగ్‌తో నార్మల్‌...
నా సంస్థ కర్ణాటక వాణివిలాస్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్‌ బోర్డ్‌ మెంబర్‌ డ్రైవర్‌ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్‌ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది.
మా సెంటర్‌లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్‌ ఇస్తాం.

గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్‌ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్‌ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి.

ఆస్ట్రికా మిడ్‌వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్‌ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్‌ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్‌ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి.            

మా సెంటర్‌లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్‌ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్‌ డెలివరీకి భయపడకుండా ఉంటారు.
– డాక్టర్‌ జాహ్నవి నిలేకని

మరిన్ని వార్తలు