సర్వర్‌ డ్రోన్‌ సుందరం

25 Feb, 2024 06:32 IST|Sakshi

వైరల్‌

కాఫీ హోటల్‌ ఏదైనా సర్వర్‌ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్‌ హోటల్స్‌ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్‌ గారి అడ్రస్‌ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్‌తో మేనేజ్‌ చేయొచ్చని కోల్‌కతా రెస్టరెంట్‌ డిసైడ్‌ అయ్యింది.

వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్‌కతా సాల్ట్‌లేక్‌ సిటీ ఏరియాలోని ‘కోల్‌కతా 64’ అనే రెస్టరెంట్‌ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్‌ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్‌ సుందరం గారే కాఫీని అందిస్తారు.

ఈ వీడియో ఇన్‌స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు.

కె.బాలచందర్‌ తీసిన ‘సర్వర్‌ సుందరం’లో నగేశ్‌ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్‌’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ టిఫిన్‌ సెంటర్‌ నేపథ్యంలో ఓనర్‌ కమ్‌ సర్వర్‌గా హీరో చేసే స్ట్రగుల్‌ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్‌ ఏజ్‌లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు.

whatsapp channel

మరిన్ని వార్తలు