Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్‌!

12 Nov, 2021 11:44 IST|Sakshi

కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ ప్రస్తుతం కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాజువల్‌ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో ఒక స్టైల్, డెనిమ్‌ షర్ట్‌తో మరో స్టైల్‌.. పెప్లమ్‌ టాప్‌తో ఒక స్టైల్, లాంగ్‌ జాకెట్‌తో మరో స్టైల్‌... ఇలా ఒక చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు. కాలానికి తగిన విధంగా లుక్‌లో మార్పులు తీసుకురావచ్చు. 

పెళ్లికి వెళ్లాలంటే ఎప్పుడూ ఒకేవిధంగా ఉండనక్కర్లేదు. బెనారస్‌ లాంగ్‌ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చలికాలానికి తగినట్టుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

క్యాజువల్‌ లుక్‌లో కొంచెం భిన్నంగా ఉండటంతోపాటు స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్‌ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు. ఎక్కువ ఆభరణాలు అవసరం లేకుండా వర్క్‌వేర్‌గా అందంగా కనిపిస్తుంది. 

కాటన్‌ చీరలు ధరించేవారు ప్లెయిన్‌ లేదా శారీ కలర్‌ బ్లౌజ్‌ ధరించడం చూస్తుంటాం. దీంట్లోనే కొంత భిన్నమైన లుక్‌ను తీసుకురావచ్చు. టర్టిల్‌ నెక్, లాంగ్‌ స్లీవ్స్‌ ఉన్న ప్లెయిన్‌ కలర్‌ బ్లౌజ్‌లను ఈ శారీ స్టైల్‌కు వాడొచ్చు. ఈ కాటన్‌ శారీస్‌కు టర్టిల్‌ నెక్‌ ఉన్న స్వెట్‌ షర్ట్‌ కూడా ధరించవచ్చు. ప్రయాణాలు, సింపుల్‌ గెట్‌ టు గెదర్‌ వంటి వాటికి ఈ స్టైల్‌ బాగా నప్పుతుంది.

కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరను ఎంచుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీకి సరిపోలే ఓపెన్‌ ఫ్రంట్‌ పెప్లమ్‌ జాకెట్‌ను తీసుకోవాలి. దీంతో పార్టీవేర్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఒక్క పెప్లమ్‌ ఓపెన్‌ టాప్‌తో మీదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు.

పెళ్లికి వెళ్లేవారు పట్టు చీర కట్టుకుంటారు. దీనికి బ్లాక్‌ కలర్‌ లంగా జాకెట్, సంప్రదాయ ఆభరణాలు ధరించి చూడండి. ఇండో వెస్ట్రన్‌ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. 

పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్‌ జాకెట్‌తో ఉన్న ద్రెసింగ్‌ రెడీమేడ్‌ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపించడంతోపాటు కాలానుగుణంగా డ్రెస్‌ ధరించడంలోనూ మార్కులు కొట్టేస్తారు. 

పెళ్లికి స్వెటర్‌ ధరిస్తే బాగుండదు అనుకునేవారు ఇలా పట్టుచీరకు లాంగ్‌ స్లీవ్స్‌ ఉన్న వైట్‌ షర్ట్‌ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్‌ బెల్ట్‌తో తయారవ్వచ్చు. సంప్రదాయ ముత్యాల హారాలు ఈ స్టైల్‌కు మరింత వన్నె తెస్తాయి.  

చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..

మరిన్ని వార్తలు