Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్‌ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..

2 Feb, 2023 11:25 IST|Sakshi

డాక్టర్‌ సలహా

మెనోపాజ్‌ వల్ల హార్మోన్స్‌ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్‌ చేయవచ్చా? సీహెచ్‌. వెంకటలక్ష్మి, సామర్లకోట

మెనోపాజ్‌ తరువాత హార్మోన్స్‌ డెఫిషియెన్సీ వల్ల సైడ్‌ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్‌ఆర్‌టీ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్‌ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్‌ఆర్‌టీ అందరికీ సరిపడకపోవచ్చు.

మెనోసాజ్‌ వచ్చిన కొన్ని నెలల తర్వాత
ఈ హార్మోన్స్‌ థెరపీతో ముఖ్యంగా హాట్‌ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్‌ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్‌ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్‌ఆర్‌టీ. ఈ సింప్టమ్స్‌ అన్నీ మెనోసాజ్‌ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.

వారికి హెచ్‌ఆర్‌టీ సురక్షితం కాదు
ఒకవైళ ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్‌ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్‌ క్యాన్సర్, ఒవేరియన్‌ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్‌ క్లాట్స్‌ ఉన్నా, హై బీపీ, లివర్‌ ప్రాబ్లమ్‌ ఉన్నవారిలో హెచ్‌ఆర్‌టీ సురక్షితం కాదు. హెచ్‌ఆర్‌టీలో హార్మోన్స్‌ను సింగిల్‌ డోస్‌గా కానీ.. కంబైన్డ్‌ డోస్‌ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్స్‌తో  ఉంటాయి.

స్కిన్‌ పాచెస్, జెల్స్, పెసరీస్‌ కూడా ఉంటాయి. హెచ్‌ఆర్‌టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్‌ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్‌ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్‌ సింప్టమ్స్‌ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.  
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్‌ హెయిర్‌.. పీసీఓఎస్‌ వల్లేనా? పరిష్కారం?
పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...

మరిన్ని వార్తలు