రూ. 5 వేలతో పొలంలో కూలీలకు పెద్ద గొడుగు! సూపర్‌ ఐడియా..

18 Apr, 2023 14:02 IST|Sakshi
పెద్ద గొడుగు నీడన మిరప కాయలు కోస్తున్న దృశ్యం

పది మంది కూలీలకు నీడనిచ్చే ‘సామూహిక గొడుగు’ను రూపొందించిన గ్రామీణ ఆవిష్కర్త 

రూ. 5 వేల ఖర్చుతో ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు

పొలాల్లో లేదా ఆరుబయట పనులు చేసుకునే వారికి మండే ఎండ పెద్ద ఇబ్బంది కలిస్తుంటుంది. ముఖ్యంగా మిరప, పత్తి, కూరగాయలు తదితర ఆరుతడి పంటల్లో వ్యవసాయ పనులు చేసే కూలీలకు, రైతులకు ఎండ పెద్ద సమస్యగా ఉంటుంది.

వేసవి వచ్చిందంటే రైతులు, వ్యవసాయ కూలీల పాట్లు, ముఖ్యంగా మహిళా కూలీల పాట్లు వర్ణించనలవి కాదు. మిట్ట మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక 2–3 గంటల సేపు పనులకు విరామం ఇచ్చి చెట్లు, షెడ్ల కింద సేదదీరాల్సిన పరిస్థితులు వచ్చాయి. కూలీల అవసరం ఎక్కువగా ఉండే మిరప, పత్తి, కూరగాయ తోటల్లో ఎండాకాలంలో సకాలంలో పనులు పూర్తికావటం లేదు. 

రైతులు, రైతు కూలీల ఎండ కష్టాలను తీర్చడానికి ఓ గ్రామీణ మోటారు మెకానిక్‌ చక్కటి ఆలోచన చేసి శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను అందించిన సృజనశీలి పేరు రేపల్లె షణ్ముగరావు. ఊరు కంబాలపల్లి. జిల్లా మహబూబాబాద్‌. 

పొలంలో పక్కపక్కన సాళ్లలో పది మంది పనులు చేసుకోవడానికి సరిపోయేంత నీడనిచ్చే చక్రాలతో కూడిన ‘సామూహిక గొడుగు’ను రూపొందించారు. 20 అడుగుల వెడల్పున 6 అడుగుల మేరకు నీడనిస్తుంది. 7 అడుగుల ఎత్తు ఉంటుంది. అవసరం మేరకు ముందుకు జరుపుకోవడానికి 4 చక్రాలను అమర్చారు.

ఖరీదు రూ. 5–6 వేలు
6 అడుగులు నీడ పడే స్థలంలో పని పూర్తి చేసుకున్న తర్వాత ముందుకు తోస్తే గొడుగు సులభంగా ముందుకు జరుగుతుంది. ఆ విధంగా నీడలోనే వ్యవసాయ పనులు చేసుకోవచ్చని షణ్ముఖరావు తెలిపారు. ఇనుప పైపులతో చేసే దీని ఖరీదు రూ. 5–6 వేలు. బరువు 15–18 కిలోలు మాత్రమే. విడి భాగాలను 10 నిమిషాల్లో ఒకచోట చేర్చి గొడుగును నిలబెట్టుకోవచ్చు.

పని పూర్తయ్యాక వేటికవి విడదీసి మడిచి ఇంటికి తీసుకెళ్లొచ్చు. చక్రాల దగ్గర, పైకప్పు దగ్గర రెండు చోట్ల మాత్రమే వెల్డింగ్‌ ఉంటుంది. మిగతా అన్ని చోట్టా నట్లు, బోల్టులే. తయారీ ఖర్చు రూ. 5–6 వేలు. ఖాళీ సంచులను కుట్టి పై కప్పుగా వేసుకుంటే ఖర్చుతగ్గుతుంది. 

దగ్గర్లో ఉండే వారికి షణ్ముఖరావు తయారు చేసి ఇస్తున్నారు. అయితే, దూరప్రాంతాలకు దీన్ని పంపాలంటే (పొడవు 20 అడుగులు ఉంటుంది కాబట్టి) రవాణా చార్జీ తయారీ ఖర్చంత అవుతోంది. దీన్ని గమనించిన షణ్ముఖరావు రైతులు ఎవరికి వారు తయారు చేసుకోవటం మేలని సూచిస్తున్నారు. ఏయే కొలతల్లో ఎలా ఈ పెద్ద గొడుగును తయారు చేసుకోవాలో చెబుతూ డిజైన్‌ను బహిరంగ పరిచారు.

ఈ వివరాలు చూపిస్తే గ్రామాల్లో స్థానికంగా ఉండే వెల్డర్‌ ఎవరైనా సులభంగా దీన్ని తయారు చేసేయగలుగుతారు. ఇప్పటికే పలువురు రైతులు తయారు చేయించుకొని వాడుతున్నారని షణ్ముఖరావు సంతోషంగా చెప్పారు. ఎర్రని ఎండ కాచే మిట్ట మధ్యాహ్న వేళల్లో కూడా నిశ్చింతగా వ్యవసాయ పనులను సులువుగా, భద్రంగా పూర్తి చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని దీన్ని వాడుతున్న రైతులు తెలిపారు.   

కలుపు లేదా పత్తి తీయటమో, మిరపకాయలు కోయటమో, కల్లాల్లో తాలు ఏరటమో, కూరగాయలు కోయటమో ఏ పనులైనా ఈ ‘సామూహిక గొడుగు’ నీడన చేసుకోవచ్చు. కరోనా అనంతర కాలంలో ఎండను పెద్దగా తట్టుకోలేకపోతున్నామని కొందరు రైతులు వాపోతున్నారు. ఎండ తీవ్రత ప్రతి ఏటా పెరుగుతున్న నేపథ్యంలో షణ్ముఖరావు ఆవిష్కరణ ప్రజలకు ఉపయోగకరంగా మారటం సంతోషదాయకం.

ఎవరైనా తయారు చేసుకోవచ్చు
30 ఏళ్లుగా మోటారు మెకానెక్‌గా రైతులు, కూలీలు ముఖ్యంగా మహిళల బాధలను దగ్గరి నుంచి చూస్తున్నాను. ఎండ తీవ్రత పెరుగుతున్నందు వల్ల తట్టుకోలేకపోతున్నారు. వారి బాధను కొంతైనా తగ్గించాలని ఈ ఆవిష్కరణ చేశా.

ఇటు 20 అడుగులు, అటు 6 అడుగుల మేరకు నీడనిస్తుంది. ఎత్తు 7 అడుగులు ఉంటుంది. కొలతలు పొలంలో సాళ్లను బట్టి మార్చుకోవచ్చు. బొమ్మలో చూపిన విధంగా కొలతల ప్రకారం ఎవరైనా గ్రామాలు, పట్టణాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు.

వెల్డింగ్‌ చేసే వ్యక్తికి సందేహాలుంటే నాతో ఫోన్‌లో మాట్లాడిస్తే వివరంగా చెబుతాను. నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. రైతులు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇప్పటికే అనేక మంది రైతులు తయారు చేయించుకొని వాడుతున్నారు. గత ఐదేళ్లలో 8 ఆవిష్కరణలు చేశాను. వరుసగా 4 ఏళ్లు ఉత్తమ ఆవిష్కర్తగా కలెక్టర్‌ నుంచి అవార్డులు తీసుకున్నాను. 
–  రేపల్లె షణ్ముఖరావు (94921 13609), పెద్ద గొడుగు ఆవిష్కర్త, కంబాలపల్లి. మహబూబాబాద్‌ జిల్లా 

మూడేళ్ల నుంచి వాడుతున్నాం.. చాలా సంతోషంగా ఉంది..
పత్తి, మిరప, వేరుశనగ పంటలు పండిస్తున్నాం. మూడేళ్ల క్రితం షణ్ముఖరావు చెప్పినట్లు మా ఊళ్లోనే 15“7“7 అడుగుల కొలతతో తయారు చేయించుకున్నాం. ఎండ బాధ లేకుండా సంతోషంగా పనులు చేసుకుంటున్నాం.

మా పనులకు కూలీలు పిలిస్తే చాలు వస్తున్నారు. మధ్యాహ్నం కూడా పని ఆపకుండా కొనసాగిస్తున్నాం. 2 గంటలు పని కలిసి వస్తోంది. ఈ పెద్ద గొడుగును పది నిమిషాల్లో బిగించుకొంటున్నాం. పని పూర్తి చేసుకున్నాక పది నిమిషాల్లో మడిచి ఇంటికి తెచ్చుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం.
– గడ్డం జైపాల్‌రెడ్డి (97019 26657) రైతు, మణుగూరు
 

మరిన్ని వార్తలు