స్ఫూర్తిదాయకం.. యువ మహిళా రైతు రజిత సేద్యం 

5 Apr, 2021 08:30 IST|Sakshi

ఎకరం భూమిలో ఎనిమిదేళ్లుగా ప్రకృతి సేద్యం

20 క్వింటాళ్ల ఎండు మిర్చితో పాటు అనేక అంతర పంటల సాగు

ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షల నిరాదాయం

ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది? అని ఎవరైనా అనుకుంటూ ఉంటేæవారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లేనంటున్నారు యువ మహిళా రైతు రజిత! రసాయనాలు వాడకుండా, ఒకటికి పది–పదిహేను పంటలు పండిస్తే.. చిన్న కుటుంబం ఆనందంగా జీవించడానికి ఎకరం భూమి ఉన్నా చాలని రుజువు చేస్తున్నారామె. 8 ఏళ్లుగా ఆదర్శ సేద్యం చేస్తూ తోటి రైతులకు వెలుగు బాట చూపుతున్నారు.

ప్రకృతి వ్యవసాయంతో పాటు ఏడాది పొడవునా పలు పంటల విధానాన్ని అనుసరిస్తూ సేద్యాన్ని సంతోషదాయకంగా మార్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన కె.రజిత(27). 19 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత పెళ్లవడంతో చదువు ఆగిపోయింది. ఆ దశలో డ్రాక్రా గ్రూపులో చేరిన రజిత విష రసాయనాల్లేని వ్యవసాయం (నాన్‌ పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌)లో శిక్షణ పొంది తమ కున్న ఎకరం నల్లరేగడి భూమిలో విభిన్నంగా పంటలు పండించడం ప్రారంభించారు.

2012లో ఎన్‌పిఎం వ్యవసాయంలో విలేజ్‌ యాక్టివిస్టుగా చేరి.. తాను వ్యవసాయం చేసుకుంటూ తమ గ్రామంలో ఇతర రైతులకూ ఈ సేద్యాన్ని నేర్పించేందుకు కృషి చేశారు. తదనంతర కాలంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏపీసీఎన్‌ఎఫ్‌ కార్యక్రమంలో క్లస్టర్‌ యాక్టివిస్టుగా బాధ్యతలు తీసుకొని ఐదుగురు సిబ్బంది తోడ్పాటుతో మూడు గ్రామాల్లో ప్రకృతి సేద్య విస్తరణకు కృషి చేస్తున్నారు. తమ ఎకరం పొలంలో ఆదర్శవంతంగా ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. 

ఎన్‌పిఎం సాగుతో ప్రారంభం
మెట్ట ప్రాంతమైన నాగులుప్పలపాడు రబీ మండలం కావడంతో రైతులు ఎక్కువగా రసాయనిక వ్యవసాయంలో పుల్ల శనగను పండిస్తూ ఉంటారు. రజిత ఎన్‌పిఎం సేద్యం చేపట్టినప్పుడు పురుగుమందులు వాడకుండా వ్యవసాయం ఎట్లా అవుతుందని రైతులు ఎద్దేవా చేసేవారు. కానీ, క్రమంగా ఆమె మెళకువలను అలవరచుకొని ముందుకు సాగడంతో వారే ముక్కున వేలేసుకున్నారు. మూడేళ్లుగా కూరగాయ పంటలను సైతం అంతరపంటలుగా సాగు చేసుకుంటున్నారు రజిత. గత నాలుగైదేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ప్రధాన పంటతోపాటు అనేక అంతర పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారామె.

ఎన్ని రకాల పంటలు సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు  పండించటమే ప్రధాన ధ్యేయం. జీవామృతం, పంచగవ్య, కషాయాలను పంటలపై పిచికారీ చేస్తారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం తయారు చేసుకొని పంటలకు సకల పోషకాలను అందిస్తున్నారు. మిత్ర పురుగులు వృద్ధి చెంది చీడపీడల బెడద నష్టదాయకంగా పరిణమించకుండా కాపాడుతున్నాయి.

10 రకాల అంతరపంటలు
ప్రధాన పంట మిరపలో అంతర పంటలుగా 10 రకాలు సాగు చేసి మంచి ఫలితాలు సాధించింది. మిరప పంట ఆరు నెలల కాల వ్యవధిలో కాపు ముగుస్తుంది. ఈ లోగా మూడు నెలలు, రెండు నెలలు, నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే పంట రకాలను ఎంచుకొని సాగు చేపట్టింది. మిరప పంటకు చుట్టూ బెల్టుగా కంది పంటను సాగు చేసింది. కందితో పాటు ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, ఎర పంటలుగా బంతి, ఆముదం కూడా సాగు చేపట్టింది.

ఏడాది పొడవునా పంటలు
2017 ఏప్రిల్‌ నుంచి ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ పద్ధతిలో నవధాన్యాలను ఎండాకాలంలోనే వెదజల్లి పచ్చి రొట్ట పంటలు సాగు చేసి కలియదున్ని.. తదనంతరం పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా పొలాన్ని ఖాళీగా ఎండబెట్టకుండా ఏదో ఒక పంట లేదా పచ్చిరొట్ట పంటలు సాగులో ఉంటాయి. 
దీంతో భూమి గుల్లబారి భూసారం మరింత పెరగడంతోపాటు.. మిర్చి ప్రధాన పంటగా సాగు చేస్తుండగా ఇతర రైతులతో పోల్చితే చీడపీడల బెడద తమ పొలంలో చాలా తక్కువగా ఉందని, దిగుబడుల పరిమాణం, నాణ్యత కూడా బాగా పెరిగాయని రజిత తెలిపారు. మిర్చితోపాటు కొందరు రైతులు ఉల్లిని అంతర పంటగా వేశారని, తాను మిర్చితోపాటు వేసిన ఉల్లిపాయ ఒక్కొక్కటి పావు కిలో తూగితే, రసాయనిక వ్యవసాయం చేసే ఇతరుల పొలాల్లో ఉల్లి మధ్యస్థంగా పెరిగిందన్నారు.

సాగు వ్యయం సగమే
ప్రకృతి వ్యవసాయంలో ఎకరం పొలంలో ఎండు మిర్చితోపాటు పలు అంతర పంటలు సాగు చేయడానికి రజిత ఇప్పటి వరకు అన్ని ఖర్చులూ కలిపి రూ. 62,550 ఖర్చు పెట్టారు. మిర్చి సాగు చేసే ఇతర రైతులకు కనీసం రూ. 1,10,000 అయ్యిందని రజిత తెలిపారు. మిర్చి తొలి కోతలో ఎకరానికి 4.5 క్వింటాళ్లకు పైగా ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. ధర క్వింటాకు రూ. 14,500 ఉండగా తమ పంటను రూ. 16,000కు అడిగారని, అయినా ధర పెరుగుతుందన్న భావనతో కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టానని రజిత వివరించారు. మొత్తంగా 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతరపంటల అమ్మకం ద్వారా రూ. 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని రజిత లెక్కగడుతున్నారు.
 
ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా కుటుంబానికి రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని అందించడంతోపాటు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్న రజిత.. మరో వైపు చదువును సైతం కొనసాగిస్తున్నారు. దూరవిద్య ద్వారా బీకాం చదువుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ సంతోషంగా ఉన్నారని రజిత సంతోషపడుతున్నారు.

హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..!
నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో గ్రామంలోని చాలా మంది రైతులు హేళన చేసేవారు. చిన్న అమ్మాయి ఏమి తెలుసని అనేవారు. 2012 నుంచి పురుగుమందుల్లేని వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను అధ్యయనం చేసి, నా ఎకరం పొలంలో ఆచరిస్తున్నాను. ఇవే నన్ను ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిపించాయి. జీవామృతంతో పంటలు పండించే విధానాన్ని 2, 3 ఏళ్ల పాటు రైతులు మా పొలంలో చూసి తెలుసుకున్నారు.  ప్రకృతి వ్యవసాయంలో తగ్గిన ఖర్చులు చూసి రసాయన ఎరువులు, పురుగుమందులతో పంటలు సాగు చేసే రైతులు నివ్వెరపోయారు. వాళ్ళు 2, 3 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించిపోతున్నది. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది.
– కె.రజిత (76740 21990), 
యువ ప్రకృతి వ్యవసాయదారు, 
నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా  

– ఎన్‌.మాధవరెడ్డి, 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు
ఫొటోలు: ఎమ్‌. ప్రసాద్, 
సీనియర్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

మరిన్ని వార్తలు