పారిపోను.. సాయం చేస్తా

11 Oct, 2023 02:58 IST|Sakshi

శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్‌ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్‌ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్‌లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు  పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. 

కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్‌లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్‌ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది....
 

నేను టెల్‌ అవీవ్‌ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్‌ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్‌ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్‌లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్‌ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్‌ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్‌ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్‌లు ఉన్నాయి. పబ్లిక్‌ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి.

ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్‌ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్‌ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్‌ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్‌ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు.

అరగంట లోపలే...
మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్‌ అవీవ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. ఈ అపార్ట్‌మెంట్‌లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్‌ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్‌మెంట్‌ తలుపులు లె రుచుకుని ...సైరన్‌ రాగానే బంకర్‌లోకి పరుగెడుతున్నాం. సైరన్‌ ఆగినప్పుడు బంకర్‌ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్‌లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. 

ఊహకందని దాడి
ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్‌ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్‌ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్‌ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్‌ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. 

ఇప్పుడు రాలేను..
ఇజ్రాయెల్‌ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్‌ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. 

మరిన్ని వార్తలు