Healthy Food: ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర..

1 Oct, 2021 10:21 IST|Sakshi

ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. అలాగని ఏది పడితే అది తినిపించడమూ మంచిది కాదు. ముఖ్యంగా వాళ్లు ఇష్టంగా తింటున్నారు కదా అని జంక్‌ ఫుడ్‌ తినిపిస్తే ఆరోగ్యంగా ఎదగకపోగా ఊబకాయం వస్తుంది. ముందు ముందు అది మరెన్నో సమస్యలకు దారి తీయవచ్చు. అందువల్ల ఏ ఆహారంలో ఏముంటుందో తెలుసుకుని, వాటినే వారు తినేలా చూడగలిగితే పిల్లలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది. 

పాలు: బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యకరమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం అయ్యే ఆహారం.తల్లి పాల తర్వాత ప్రోటీనులూ, విటమిన్లు, ఖనిజాలు గల పాలు ఆవుపాలు. పిల్లలకు ఆవుపాలు తాగించడం వల్ల వారిలో ధారణ శక్తి కలుగుతుంది. ఆవుపాలు శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించడంతోపాటు. శరీరానికి కాంతిని, ఇంద్రియాలకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. అందువల్ల పిల్లలకు ఆవుపాలు తాగించడం మంచిది.
విటమిన్‌ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం జున్ను, క్యారెట్, పాలూ, గుడ్లూ  ఇవ్వాలి.


బి కాంప్లెక్స్‌ విటమిన్లు: శరీర పనితీరు బాగుండాలంటే  బీ కాంప్లెక్స్‌ అత్యవసరం. మాంసం, చేపలూ, సోయా బీన్స్‌ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్‌ అందుతుంది.
కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్‌ సి చాలా అవసరం. టొమాటో, తాజా కూరలూ, పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్‌ సి లభిస్తుంది.
ఎముక బలానికి: ఎదిగే పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్‌ డి తప్పనిసరి. ఇందుకోసం పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.
ఐరన్‌ లోపం లేకుండా: ఐరన్‌ రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్‌ వంటివి ఇవ్వాలి.
గుడ్డు: గుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. రోజుకో గుడ్డు ఇవ్వడం వల్ల మాంసకృత్తులు సమృద్ధిగా అందు తాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి దోహదం చేస్తుంది. గుడ్లు చవకైన పోషకాహారమే కాదు. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా.

గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గుడ్లలో విటమిన్‌ డి దండిగా ఉంటుంది. అందువల్ల గుడ్లను పిల్లల ఆహారంలో చేర్చటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
►మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ వ్యాధి, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. 
►ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయులు మెరుగుపడతాయి. ట్రై గ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. 

ఏ పాలు..? ఎన్ని పాళ్లు ..? 
పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను తాగడం మంచిది కాదు. 

ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి (వేడి చేసి) కాచిన తర్వాతనే  తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. 

పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిన, నిల్వ ఉన్న పాలను తాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు తాగించాలన్నదీ తెలుసుకోవడం మంచిది.

చదవండి: Dairy Rich Diet: గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు​ ఇవే...

మరిన్ని వార్తలు