ఆల్‌–వుమెన్‌ ప్లే:జీవన నాటకం

17 May, 2022 00:37 IST|Sakshi

జీవితమే ఒక నాటకరంగం... తాత్విక మాట. నాటకంలోకి జీవితాన్ని తీసుకురావడం... సృజనబాట. ఈ బాటలోనే తన నాటకాన్ని నడిపిస్తూ దేశ, విదేశ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది రమణ్‌జిత్‌ కౌర్‌....

చండీగఢ్‌లో పుట్టి పెరిగిన రమణ్‌జిత్‌కౌర్‌ పెళ్లి తరువాత కోల్‌కతాలో స్థిరపడింది. అక్కడి నాటకరంగంపై తనదైన ముద్ర వేసింది. జాతీయత, ప్రాంతీయత, కులం, వర్గం, జెండర్‌ అంశాల ఆధారంగా ఆమె రూపొందించిన ‘బియాండ్‌ బార్డర్స్‌’ నాటకం దేశవిదేశాల్లో ప్రదర్శితమై ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ నాటకంలో 29 మంది మహిళలు నటించడం ఒక విశేషం అయితే, ఇంగ్లీష్, హిందీతో పాటు పంజాబీ, బెంగాలి, మరాఠీ, గడ్వలి... భాషలను ఉపయోగించడం మరో విశేషం.

సమకాలీన సమస్యలను నాటకానికి వస్తువుగా ఎంచుకోవడం ఒక ఎత్తయితే...  వీడియో ఆర్ట్, ఇన్‌స్టాలేషన్‌ ఆర్ట్, ఫొటోగ్రఫీ, సౌండ్‌ డిజైన్‌లాంటి సాంకేతిక అంశాలను కూడా సృజనాత్మకంగా ఉపయోగించడం మరో ఎత్తు. నాటకం నాడి తెలిసిన కౌర్‌కు సినిమాలపై కూడా మంచి అవగాహన ఉంది. దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన ఫైర్, హెవెన్‌ ఆన్‌ ఎర్త్‌ చిత్రాలలో నటించింది. ‘మ్యాంగో షేక్‌’లాంటి షార్ట్‌ఫిల్మ్స్‌ కూడా రూపొందించింది.

‘నాటకరంగం, సినిమా రంగానికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇలా జవాబు ఇస్తుంది... ‘పెద్ద తేడా ఏమీలేదు. భావవ్యక్తీకరణకు రెండూ ఒకేరకంగా ఉపయోగడపడతాయి. అయితే నాటకం ద్వారా తక్షణ స్పందన తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ప్రేక్షకుల కళ్లను చూస్తు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు’
‘థియేటర్‌ గేమ్స్‌’ రచయిత క్లైవ్‌ బర్కర్‌లాంటి దిగ్గజాల దగ్గర శిక్షణ తీసుకున్న కౌర్‌ తొలిసారిగా డూన్‌ స్కూల్‌ స్పెషల్‌ చిల్డ్రన్స్‌ కోసం వర్క్‌షాప్‌ని నిర్వహించింది. నాటకరంగంలో పిల్లలు చురుకైన పాత్ర నిర్వహించాలనేది తన కల. ‘ది క్రియేటివ్‌ ఆర్ట్‌’తో తన కలను నెరవేర్చుకుంది కౌర్‌. ఈ సంస్థ ద్వారా వేలాదిమంది విద్యార్థులు యాక్టింగ్, వాయిస్‌ ట్రైనింగ్, ఎక్స్‌ప్రెషన్, మ్యూజిక్, ప్రొడక్షన్‌ డిజైన్‌... మొదలైన వాటిలో శిక్షణ తీసుకున్నారు.

కౌర్‌ దర్శకత్వం వహించిన తాజా నాటకం ‘ది ఈగల్‌ రైజెస్‌’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాటకంలో నటించిన వారందరూ మహిళలే. జీవితం అనేది యుద్ధం అనుకుంటే... అక్కడ మనకు అడుగడుగునా కావాల్సింది సానుకూల దృక్పథం. మన మీద మనకు ఉండే ఆత్మవిశ్వాసం. ఇవే మన వజ్రాయుధాలు’ అని చెబుతుంది ది ఈగల్‌ రైజెస్‌.

‘థియేటర్‌ అంటే ముఖానికి రంగులు పూసుకొని, డైలాగులు బట్టీ పట్టడం కాదు. మనలోని సృజనాత్మక ప్రపంచాన్ని ఆవిష్కరించే వేదిక. అందుకు సరైన శిక్షణ కావాలి. కొందరు ఏమీ తెలియకపోయినా ఇతరులకు నటనలో శిక్షణ ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. నాటకం అనేది ఉన్నచోటనే ఉండకూడదు. అది కాలంతో పాటు ప్రవహించాలి. సాంకేతికధోరణులను అందిపుచ్చుకోవాలి’ అని చెబుతున్న కౌర్, నటులకు ఫిజికల్‌ ఎనర్జీ, ఫిట్‌నెస్‌ ముఖ్యం అని నమ్ముతుంది. పిల్లలకు నాటకరంగలో శిక్షణ ఇవ్వాలనే తన కోరికను సాకారం చేసుకున్న కౌర్‌ ఆల్‌–వుమెన్‌ థియేటర్‌ కోర్స్‌కు రూపకల్పన చేస్తుంది. ఈ కోర్స్‌లో భాగంగా దేశ, విదేశ కళాకారులు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది. కౌర్‌ రెండో కల నిజం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.

మరిన్ని వార్తలు