Minapa Vadiyalu: గలగలలాడే మినప వడియాలు చేసుకోండిలా! మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తేనే

31 Mar, 2023 13:37 IST|Sakshi

ఎండలు మండిపోతున్నాయి. అందుకే... ఎండబెట్టి వండుకునే వడియాలను చేద్దాం.  ఇంతకీ ఇవి అర్కపక్వాలా? అగ్నిపక్వాలా? ఎండలో ఎండుతాయి... మంటకు పొంగుతాయి. వంటకాలకు తోడయ్యి... జిహ్వను సంతోషపరుస్తాయి. సంతృప్తికరమైన భోజనానికి మినిమమ్‌ గ్యారంటీనిస్తాయి.  

మినప వడియాల తయారీ ఇలా!
కావలసినవి:
►మినప్పప్పు – అర కేజీ
►పచ్చి మిర్చి – 7 లేదా 8
►జీలకర్ర– టీ స్పూన్‌
►అల్లం– రెండు అంగుళాల ముక్క
►ఉప్పు – టేబుల్‌ స్పూన్‌.

తయారీ:
►మినప్పప్పు కడిగి మునిగేలా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
►ఉదయాన్నే గ్రైండర్‌లో మెత్తగా రుబ్బాలి.
►మినప్పప్పు మెదిగేటప్పుడు అందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి.

►మొత్తం మెత్తగా మెదిగిన తరవాత ఒక గిన్నెలోకి తీసుకుని కలిపితే వడియాల పిండి రెడీ.
►తడి వస్త్రాన్ని లేదా పాలిథిన్‌ షీట్‌ని ఎండలో పరిచి దాని మీద వడియాలు పెట్టుకోవాలి.
►ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో స్పూన్‌ని ముంచి అప్పుడు పిండి తీసుకుంటే పిండి సులువుగా జారుతుంది.

►చేత్తో పెట్టాలన్నా అంతే... వేళ్లను తడుపుకుంటూ పెట్టాలి. రెండు రోజుల పాటు ఎండనివ్వాలి.
►మూడవ రోజు వలిచి మళ్లీ ఎండబెట్టాలి. అప్పుడు గలగలలాడుతాయి.  
►ఏడాది పాటు నిల్వ ఉంటాయి.

►నూనె వేడి చేసి పచ్చి వడియాలను నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేగిన తరవాత తీసేయాలి.
►ఈ వడియాలను పెద్ద మంట మీద వేయించరాదు.
►మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తే చక్కగా వేగి కరకరలాడుతాయి. 

ట్రై చేయండి: బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్‌ మజ్జిగచారు తయారీ ఇలా

మరిన్ని వార్తలు