స్త్రీ శక్తి విజయం విజయ దశమి

23 Oct, 2023 04:35 IST|Sakshi

విజయ దశమి ప్రత్యేకం

ఈ చరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని  వారవుతారు. ఆ శక్తినే అదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో శక్తిబీజం సంయోగం చెందితే ‘స్త్రీ’అవుతుంది. అటువంటి త్రిగుణాలతో కూడిన శక్తి ఆవిర్భవించి దుష్టరాక్షస సంహారం చేసిన సమయం శరదృతువు.

ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది.

అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధంచేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి – యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణలు మొదలైన దీక్షలు పూనారు. మానవులు కూడా ఉడతాభక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు.  

ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది. నిర్గుణయైన పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ
 మహాసరస్వతీ అని జగదంబిక త్రిశక్తులలో మొదటిదిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది.
ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం.

సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు.ఈ తత్త్వాన్ని వంట పట్టించుకోవటం ఏ కాలం లోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్దినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది.

మహిషుని సంహరించేందుకు త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా ఆకారం ధరించింది. దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధాలను సమకూర్చారు. తన సంహారం కోసమే ఆమె ఆవిర్భవించిందని తెలిసినా మహిషుడు రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి కామరూపి గనుక ఆమెతో రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిషరూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటివరకు దీక్ష వహించిన వారందరు దశమి నాడు జగదంబను స్తుతించి, అమ్మకు పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయానికి  వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీ దేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచినప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది.

మరొకప్పుడు శుంభ నిశుంభులనే దానవ సోదరులు వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే – తమకు అమరత్వం ప్రసాదించమని కోరారు. బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన వరం కోరుకోమని అన్నాడు. వారు తమకు అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదు అని చెప్పారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్రైలోక్యాధిపత్యాన్ని, యాగభాగాలని కూడా హరించారు. దిక్పాలకులను సూర్యచంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు.

దేవతలు బృహస్పతి సూచనననుసరించి హిమవత్పర్వతం మీద ఉన్న దేవిని శరణు వేడారు. జగదంబ వారికి అభయం ఇచ్చింది. ఆ సమయంలో సర్వదేవతలు తమ తమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రక్తబీజుని సైన్యాన్ని మట్టు పెట్టసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు.
1. బ్రహ్మ శక్తి బ్రహ్మాణి.
2. విష్ణువు శక్తి వైష్ణవి
4. కుమారస్వామి శక్తి షష్ఠీ దేవి కౌమారి.
5. ఇంద్రుని శక్తి ఐంద్రి, మాహేంద్రి, ఇంద్రాణి అనే పేర్లు కూడా ఆమెకున్నాయి.  
6. ఆదివరాహమూర్తి శక్తి వారాహీ దేవి
7. నృసింహుని శక్తి నరసింహ రూపం నారసింహీ అనే నామం.

ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బంధించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది.

యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విధంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమసదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూతి కూడ విజృంభించి దానవులను నేలకూల నేస్తూ ఉంటే, చాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు.

దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుని కోపం మిన్ను ముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది. దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగివేయ మని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, కింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది.

అపుడు నిశుంభుడు శ్రీదేవితో యుద్ధానికి బయల్దేరాడు. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాసాడు.

శుంభుణ్ణి శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోరయుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది. 
       
సామూహికంగా కుంకుమార్చనలు చేసినా, చండీహోమాదులు చేసినా, బొమ్మల కొలువులు పెట్టినా, బతకమ్మలు ఆడినా కనపడేది ఏదైనా పదిమంది కలిసి చేయాలనే ఐక్యభావన. శక్తి స్వరూపమైన స్త్రీ జాతి పట్ల గౌరవ మర్యాదలు నెరపటం.  
‘‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’’

 

నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సాహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్రనామాలతోనే చేస్తారు. జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితో పాఖ్యానంలో వివరించబడింది.

 ఆమె సర్వచైతన్యస్వరూపిణి కనుక ఆమెను ‘లలిత’ అని పిలిచారు.తమను కన్నతల్లి లాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంటే సుఖపడటం – సుఖపడటం అంటే తినటం, నిద్ర పోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒకటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురవధ చేయటానికి సర్వచైతన్యస్వరూపిణిగా అవతరించింది. బండతనం మీద చైతన్యం విజయం సాధించటానికి సంకేతం విజయదశమి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా!


సమాజంలో ఎప్పుడూ మంచి చెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయ దశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడుపడుతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచనలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు కావచ్చు, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చును, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికి ఉండాలనే స్వార్థం కావచ్చును, ఒక జాతినో, వర్గాన్నో చులకన చేసే అహంకారం కావచ్చు ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చును – ఇటువంటి ఎన్నో చెడులక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయ దశమి. ముఖ్యంగా స్త్రీ పట్ల చులకన భావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయ దశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుంటూ జమ్మి పత్రాలని బంగారం, వెండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు.

– డాక్టర్‌ ఎన్ .అనంతలక్ష్మి

మరిన్ని వార్తలు