సంజయ్‌దత్‌ కుటుంబానికి క్యాన్సర్‌ శాపం

13 Aug, 2020 07:39 IST|Sakshi

‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’లో రోగాన్ని మందులతో కంటే మాటలతో ఎక్కువ నయం చేయాలంటాడు సంజయ్‌దత్‌. ఇప్పుడు ఆ నటుడు మందులకు అంతగా లొంగని కేన్సర్‌ బారిన పడ్డాడు. సంజయ్‌దత్‌కు లంగ్‌ కేన్సర్‌ నిర్థారితం అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి. సంజయ్‌దత్‌ కుటుంబానికి క్యాన్సర్‌ ఒక శాపం అనవచ్చు. తల్లి, ఇద్దరు భార్యలు దాని బారిన పడ్డారు. కొందరు దానిని జయించారు. సంజయ్‌దత్‌ కూడా జయిస్తాడనే ఆశ.

‘మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌’ చేసి ఉండకపోతే సంజయ్‌దత్‌ భారతీయ ప్రేక్షకులకు ఇంత ఇష్టుడై ఉండేవాడు కాదు. ఆ తర్వాత వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్‌’తో అతడు తన పాత ఇమేజ్‌ను అంతా చెరిపేసుకోని బాలీవుడ్‌లో అత్యంత ముఖ్యమైన నటుడు అయ్యాడు. ‘ఖల్‌నాయక్‌’ సమయంలో అతడు టాడా కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లినప్పుడు చిలువలు పలువలుగా కథనాలు రాసిన మీడియా తర్వాతి కాలంలో శిక్ష పూర్తి చేయడానికి సంజయ్‌దత్‌ పూణె జైలులో ఉన్నప్పుడు ఎంతో సానుభూతితో రాశాయి. సాధారణ జనం సంజయ్‌దత్‌ అనుభవించింది చాలు అతణ్ణి తొందరగా విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కూడా. 2014లో జైలు నుంచి విడుదలైన సంజయ్‌దత్‌ మునుపటి సంజయ్‌దత్‌ ఎంతకీ కాలేకపోయాడనే చెప్పాలి. ఆ ఉడుకు, వేగం తగ్గాయి. సినిమాల సంఖ్య కూడా తగ్గింది. ఫ్యామిలీతోటి ఎక్కువ గడుపుతూ అతడు చేసిన సినిమాలలో తాజాగా ‘సడక్‌2’ ఈ నెలాఖరున డిజిటల్‌ రిలీజ్‌కు సిద్ధమైంది. సంజయ్‌దత్‌ను మరోసారి ఏదో ఒక తెర మీద చూడాలని అభిమానులు అనుకుంటున్నప్పుడు హటాత్తుగా ఆయన అనారోగ్యం వార్త బయటకు వచ్చింది.

ఆగస్టు 8 నుంచి
ఆగస్టు 8 నుంచి సంజయ్‌దత్‌ వార్తలు రావడం మొదలయ్యాయి. ఛాతీలో అసౌకర్యం వల్ల ఆయన ముంబైలో లీలావతి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాడు. అయితే ఆగస్టు 10 సోమవారం ఆయన డిశ్చార్జ్‌ అయ్యాడు. తనకు కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందని, కాని పని నుంచి కొంత బ్రేక్‌ తీసుకోవాలని అనుకుంటున్నానని ఆయన ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాతి నుంచి ఆయన లంగ్‌ కేన్సర్‌ వార్తలు బయటకు వచ్చాయి. ప్రసిద్ధ సినిమా జర్నలిస్ట్‌ కోమల్‌ నహతా ‘సంజయ్‌దత్‌కు లంగ్‌ కేన్సర్‌ నిర్థారితం అయ్యింది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం’ అని ట్వీట్‌ చేశాడు. సంజయ్‌దత్‌కు కేన్సర్‌ స్టేజ్‌ 3 లెవల్‌లో ఉందని చెబుతున్నారు. ఆయన కుటుంబం వైద్యం కోసం అతి త్వరలో అమెరికా వెళ్లనుంది.

నర్గీస్‌దత్‌ నుంచి
సంజయ్‌దత్‌కు తల్లి నర్గిస్‌ దత్‌తో ఎక్కువ అనుబంధం. కొడుకును సూపర్‌స్టార్‌గా చూడాలని ఆ నటి అనుకుంది. సంజయ్‌దత్‌ ఆ ప్రయత్నాల్లో ఉండి సినిమా మొదలెడుతుండగా ఆమె 1980లో పాంక్రియాటిక్‌ కేన్సర్‌ బారిన పడింది. ఇది సంజయ్‌దత్‌ను చాలా డిస్ట్రబ్‌ చేసింది. తను డ్రగ్స్‌ బారిన పడటానికి తల్లి అనారోగ్యం కూడా ఒక కారణం అని అతడు చెప్పుకున్నాడు. భర్త సునీల్‌దత్‌ అమెరికాలో ఆమెకు వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. 1981లో నర్గిస్‌ మరణించింది. ఆ తర్వాతే సంజయ్‌దత్‌ తొలి సినిమా ‘రాకీ’ విడుదలైంది. తల్లి పడ్డ క్యాన్సర్‌ బాధ సంజయ్‌దత్‌ను చాలాకాలం వెన్నాడింది.

తర్వాత భార్య రిచాశర్మ
సంజయ్‌దత్‌ నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్నాడు. రిచా శర్మ చాలా హిట్‌ సినిమాలలో నటించింది. ఆమె కుటుంబం ఆమెరికాలో స్థిరపడి ఉంది. అయితే కూతురు త్రిశాల పుట్టిన కొన్నాళ్లకు రిచా శర్మకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. రిచాశర్మ వైద్యం కోసం సంజయ్‌ దత్‌ కుమార్తెతో కలిసి అమెరికాకు అనేకసార్లు రాకపోకలు సాగించాడు. కాని ఫలితం దక్కలేదు. 1996లో 32 ఏళ్ల వయసులో రిచాశర్మ మరణించింది. కూతురు త్రిశాల అమ్మమ్మ, నాయనమ్మల దగ్గరే పెరగడానికి అమెరికాలో ఉండిపోయింది. 

సంజయ్‌దత్, మాన్యత, ఇద్దరు పిల్లలు​​​​​​​

ఆ తర్వాత మాన్యత
నటి మాన్యతను 2008లో సంజయ్‌దత్‌ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకు వారికి ట్విన్స్‌ పుట్టారు. అబ్బాయి. అమ్మాయి. ఆ తర్వాత ఒకవైపు టాడా కేసు నడుస్తూ ఉంటే మరోవైపు సినిమాల్లో నటిస్తూ సంజయ్‌ బిజీగా ఉన్నాడు. తీర్పు వెలువడ్డాక జైలు శిక్ష అనుభవించడానికి వెళ్లిపోయాడు. అయితే ఈలోపు 2013లో మాన్యత లివర్‌ ట్యూమర్‌తో బాధ పడిందనే వార్తలు వచ్చాయి. ఆమె దానితో పోరాడే సమయంలో సంజయ్‌దత్‌ భార్య అనారోగ్య కారణంగా పరోల్‌ పొందేవాడు. అయితే మాన్యత ఆ ట్యూమర్‌ నుంచి బయటపడింది.

ఇప్పటి పరిస్థితి
సంజయ్‌దత్‌ జీవితం అనూహ్య పరిణామాల జీవితం. నాటకీయ జీవితం. అందుకే అతని జీవితం ఆధారంగా రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘సంజూ’ సినిమా వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. సంజయ్‌దత్‌ కోసం బాలీవుడ్‌ ఎన్నో కేరెక్టర్లు రాస్తోంది. సంజయ్‌దత్‌ చేయాల్సిన సినిమాలూ చాలానే ఉన్నాయి. 61 ఏళ్లు అంటే ఇంకా పదేళ్లపాటు నటించవచ్చు. కాని ఈలోపు ఈ అనారోగ్య వార్త. సంజయ్‌ తన శరీరాన్ని చాలా అబ్యూస్‌ చేసుకున్నాడు. డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్‌... ఇవన్నీ ఏళ్ల తరబడి అతడి దశలవారీ వ్యసనాలుగా ఉన్నాయి. వాటి పర్యవసానమే ఇప్పటి అనారోగ్యం కావచ్చు.

కాని సంజయ్‌ ఎన్నో పోరాటాలు కూడా చేశాడు. వచ్చిన ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచాడు. క్యాన్సర్‌ను జయించి తిరిగి వస్తాడనే ఆశ. అతని భార్య కూడా అదే ట్వీట్‌ చేసింది. ‘మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. అన్ని చెడుకాలాలు వెళ్లినట్టే ఈ చెడుకాలం కూడా వెళ్లిపోతుంది’ అని ప్రకటన చేసింది. నిజంగా ఈ చెడుకాలం గడిచిపోయాలనే ప్రతి ఒక్క సినీ అభిమాని ఆకాంక్ష.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా