Bhogi: భోగి ఎందుకు జరుపుకొంటారో తెలుసా? భోగి పళ్లు పోయడం వెనుక అంతరార్థం?

13 Jan, 2023 08:05 IST|Sakshi

తెలుగు లోగిళ్ల ముంగిట ముచ్చటైన ముగ్గులతో ఆడపడుచుల సందడి మొదలైంది. మూడు రోజుల సంక్రాంతి పండుగకు సమయం ఆసన్నమైంది. ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ.. దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై చలి పెరుగుతుంది.

ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ.. రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలుగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారో, అందుకు గల శాస్త్రీయ కారణాలు గమనిద్దాం.

పురాణ గాథలు
"భుగ్" అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణ గాథ.

అదే విధంగా... శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాథ అందరికీ తెలిసిందే. అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందని చెప్పుకొంటారు. ఇందులో భాగంగా.. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో ఉన్నదనేది పెద్దల మాట.

ఆరోగ్యం కూడా
సాధారణంగా వ్యవహారంలో ఉన్న ప్రకారం.. ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని అందరూ చెబుతుంటారు. అయితే, భోగి మంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ధనుర్మాసంలో నేలంతా ఇంటి ముందు, ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలు చేస్తారు. వీటినే ఈ భోగి మంటలు వేయడానికి ఉపయోగిస్తారు. పిడకలని కాల్చడం గాలిలోని.. సుక్ష్మక్రిములు నశిస్తాయి. అంతేకాదు ఆక్సీజన్‌ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటికీ ఇది మెడిసిన్‌గా పనిచేస్తుందనడం అతిశయోక్తి కాదు. భోగి మంటలు పెద్దవిగా రావడానికి మామిడి లాంటి ఔషద చెట్ల బెరడ్లు వేసి.. అవి కాలడానికి నెయ్యని వేస్తారు.

అంతా ఒక్కచోట చేరి
ఈ ఔషద మూలికలు నెయ్యి, పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి శుద్ధి అవుతుంది. ఇక అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయం వల్ల.. ఈ మంట నుంచి నుంచి వచ్చే గాలి అందరు పీల్చగలుగుతారు. అంతేకాదు అంతా ఒక్కచోట చేరి పండుగ జరపుకోవడం.. ప్రజల మధ్య అంతరాలను తగ్గించి, ఐకమత్యాన్ని పెంచుతుంది. 

అయితే, ఇటీవల కాలంలో భోగి రోజున రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఆ మంట నుంచి వెలువడే విష వాయువులను పిలుస్తూ, కాలుష్యం పెంచుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దానర్థం.. ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి మాత్రం కావు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు.. పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు.

భోగి పళ్లు పోయడం ఎందుకు?
భోగి రోజున రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. ఈ కార్యక్రమాన్ని భోగి పళ్ల వేడుక అంటారు. సం‍స్కృతంలో రేగి చెట్టును బదరీ వృక్షంగా వ్యవహరిస్తారు. రేగి చెట్లు, రాగి పండ్లు ఆ నారాయణుడి ప్రతి రూపంగా భావిస్తారు. అంతేకాదు.. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. అందుకే రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తే మంచి జరగుతుందని నమ్మకం.

వాటిని తలపై పోయడం వలన ఆ దేవుడి అనుగ్రహం పిల్లలపై ఉంటుందని, వారికి ఉన్న దిష్టి తొలగి పోతుందని విశ్వసిస్తారు. ఈ భోగి పండ్లను పోయడం వల్ల తల పై భాగంలో ఉండే ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారని పెద్దలు చెబుతారు.

రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయట. కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలు ఇస్తాయి. ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతర్థాలు, రహస్యాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ప్రజలు పండుగలు జరుపుకొంటారు.

మరిన్ని వార్తలు