Shefali Shah: రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి నటి... పగటి‘కళ’లు నిజమవుతాయి!

10 Dec, 2021 14:45 IST|Sakshi

అదర్‌ సైడ్‌

సరిగమపదనిసా... కరో కరో జర జల్సా!

Shefali Shah Opens Jalsa Restaurant In Ahmedabad How It Named Specialities: ‘పగటి కలలు నిజం కావు’ అంటారు. మరి పగటి‘కళ’లు? కచ్చితంగా నిజమవుతాయనే చెబుతుంది బాలీవుడ్‌ నటి, డైరెక్టర్‌ షెఫాలి షా. చిన్న పాత్ర అయినా రామ్‌గోపాల్‌వర్మ ‘సత్య’ సినిమాలో ప్యారీ మాత్రేగా గుర్తుండి పోయేలా నటించింది షా. ఒకవైపు సినిమాలు, మరో వైపు షార్ట్‌ఫిల్మ్, వోటిటీ ఫిల్మ్‌... ఇంత బిజీలోనూ షెఫాలి ఎప్పుడూ ఒక పగటి‘కళ’ కనేది!

ఆ కల ఇలా ఉంటుంది...
ఒకచోటికి అందరూ వస్తారు. వేడివేడి తేనీరు ఆస్వాదిస్తూనో, ఘుమఘుమలాడే అపరిచిత వంట రుచులను మెచ్చుకుంటూనో పక్కాగా కళల గురించి మాట్లాడుకుంటారు.
‘బంగారం ధర ఎంత పెరిగింది?’ ‘క్రిస్టో కరెన్సి నన్ను మరోస్థాయికి తీసుకెళ్లిందనుకోండి’ ‘ఈమధ్య కొత్త కారు కొన్నాను’ ఇలాంటి మాటలేవీ అక్కడ వినిపించవు. స్థూలంగా చెప్పాలంటే చూసిన నాటకం గురించి, విన్న సంగీతం గురించి, చదివిన పుస్తకం గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటారు. ఒకరి నుంచి మరొకరు విలువైన విషయాలు నేర్చుకుంటారు......

ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది షెఫాలి. అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లో ‘జల్సా’ పేరుతో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించింది. టేబుల్‌ మ్యాట్స్, నేప్‌కిన్స్‌ ఎంపిక నుంచి గోడలపై పెయింటింగ్స్‌ వరకు అన్నీ స్వయంగా తానే చేసింది. విద్యాబాలన్‌తో కలిసి ‘జల్సా’ అనే సినిమాలో నటించింది షెఫాలి. తనకు ‘జల్సా’ అనే పదం చాలా ఇష్టం. దానిలో ‘ఉత్సాహం, ఉద్వేగం’ ఉంటాయి అంటుంది.

 ‘జల్సా’ అనేది మోర్‌ దేన్‌ ఫుడ్‌లాంటి రెస్టారెంట్‌!
ఏ ఉదయం పూటో ‘జల్సా’కు వెళితే కమ్మనీ కాఫీ తాగుతూ కళ్యాణిరాగాన్ని ఆస్వాదించవచ్చు. సాయంత్రం స్నాక్స్‌తో పాటు తోలుబొమ్మలాటను ఎంజాయ్‌ చేయవచ్చు. ఒక్కటా రెండా....అన్ని రకాల కళలు, కళాకారులకు ఇదొక వేదిక అయింది. ‘కళల కార్నివాల్‌’ ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ ఫ్రెండ్స్‌’ అయింది. ఇలాంటి ‘జల్సా’లను దేశంలోని ముఖ్యనగరాల్లో ప్రారంభించాలనేది షెఫాలి మరో కల.

‘జల్సాలో భోజనంతో పాటు రకరకాల అనుభవాలను కూడా వడ్డిస్తాం’ అని సరదాగా అంటుంది షెఫాలి. ‘కళ అంటే సృజన మాత్రమే కాదు సామరస్యం కూడా’ అంటారు తాత్వికులు. ‘జల్సా’కు వెళ్లినవారికి ఆ సామరస్యం తప్పకుండా కనిపిస్తుంది! 

చదవండి: Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత

మరిన్ని వార్తలు