హనుమ హృదయంలో సీతారాములు

24 Dec, 2023 09:22 IST|Sakshi

భక్త విజయం!

రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను, విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరల్లోనే సపరివారంగా నిలబడి, నెత్తి మీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యవాసుల జయజయ ధ్వానాల నడుమ, పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు.

పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులకు, విభీషణుడికి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మవారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు.

‘నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు’ అని చెప్పాడు రాముడు. ‘మహారాజా! మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!’ అంది సీత. ‘సమానులెలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు?’ ప్రశ్నించాడు రాముడు.

‘ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే, సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే!’ అని పలికింది సీత. ‘నా అభిప్రాయం కూడా అదే! గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు.

‘అందరూ గుణవంతులే! అందరూ భక్తులే!’ అంది సీత. ‘అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ, ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు.

హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుడిని పిలిచి, రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికిచ్చింది.
హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్నే పరిశీలనగా చూస్తూ, ఒక్కొక్క రత్నాన్నే కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. 

ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, ‘కోతికేం తెలుసు అల్లం రుచి’ అన్నాడు. హనుమంతుడు విభీషణుడివైపు చూసి,  ‘లంకాధిపా! అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. ‘తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే, నువ్వు చేస్తున్న పనేమిటి?’ అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు.

‘సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిదే’ అన్నాడు హనుమంతుడు. ‘సరేనయ్యా! ఈ మణులలో నీ దేవుడైన రాముడు లేడు. పర్వతంలాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి?’ అన్నాడు విభీషణుడు.

ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు, తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. -సాంఖ్యాయన

>
మరిన్ని వార్తలు