చర్మం మీద మార్పులతో... క్యాన్సర్స్‌ 

24 Apr, 2022 13:14 IST|Sakshi

మన శరీరంలోని అతి పెద్ద అవయవం మన చర్మం. శరీరాన్నంతటినీ కప్పి రక్షణ కవచంలాగా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ... విటమిన్‌ ‘డి’ తయారీకి ఉపయోగపడుతుంది. చర్మానికి వచ్చే ఇతర సమస్యలతో పాటు చర్మ క్యాన్సర్‌... నివారణ పద్ధతులు, చికిత్సలాంటి అంశాలను తెలుసుకుందాం. 

చర్మం పైన హెచ్‌పీవీ వైరస్‌ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా మరికొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) క్యాన్సర్‌ కారకం కాదు. అలాగే సెక్సువల్‌ కాంటాక్ట్స్‌ వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. కానీ... హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్‌ రకాను అంకోవైరస్‌లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరికాయలను కలగజేయవు గానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. 

అధిక బరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులోవారికైనా కనిపించే స్కిన్‌ట్యాగ్స్‌ వల్ల సాధారణంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ అవి పెద్దసైజులో ఉండి, బాగా బయటకు కనిపించే భాగాల్లో ఉంటే తీసివేయించుకోవడమే మంచిది. సాధారణంగా పెసర గింజంత ఉండే ఈ స్కిన్‌ట్యాగ్స్‌ గోల్ఫ్‌బాల్‌ సైజుకూ పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించి, స్కిన్‌ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా... 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగుమారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్‌ అని అనుమానించాల్సి ఉంటుంది. 

శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్‌టిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఇవి అక్కడక్కడ ఒకటీ రెండూ లేదా శరీరమంతా ఉండవచ్చు. ఎడిపోజ్‌ టిష్యూలతో ఏర్పడే ఈ ప్రమాదకరం కాని ఈ గడ్డలు... ఒకవేళ శరీరం లోపలి అవయవాల మీద కూడా ఏర్పడితే జాగ్రత్తగా గమనించాలి. చర్మం కిందగానీ, రొమ్ములోగానీ, గడ్డలు మెత్తగా కదులుతూ, కొద్దివారాలుగా ఎలాంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ... మనం చేతితో తాకినప్పడు గట్టిగా రాయిలాగా ఉండటం, గడ్డలో ఏవైనా మార్పులు గమనిస్తూ ఉంటే  మాత్రం తప్పనిసరిగా వాటిని అనుమానించాలి. 

రంగు మారడం కనిపిస్తే జాగ్రత్త: గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్‌ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. శరీరం మీద ఎక్కడైనా... అంటే... ముఖ్యంగా ఎండకు గురయ్యే శరీరభాగాల్లో చర్మం రంగులో మార్పుతో పాటు మానని పుండు, స్కిన్‌ప్యాచ్‌లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది. 

మన దేశవాసుల్లో మెలనిన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్‌క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్‌ ప్రధానంగా ‘బేసల్‌సెల్‌ కార్సినోమా’, ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్‌ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి. 

చికిత్స: స్కిన్‌క్యాన్సర్స్‌ దాదాపు 100 శాతం నయమవుతాయి. క్యాన్సర్‌ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిగిలి ఉన్న క్యాన్సర్‌ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి ఇస్తారు. క్యాన్సర్‌ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్‌మెంట్‌ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు. సర్జరీ చేసి  చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సివచ్చినప్పుడు... ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్‌ చేస్తారు. 

నివారణ ఇలా... ఎండ నేరుగా తగిలే భాగాల్లో పై పూతగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం, శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులూ, ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులూ, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం, వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ క్యాన్సర్‌ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. క్యాన్సర్‌ నివారణకే గాక ... మామూలుగా కూడా చర్మసంరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.  -డా. సీహెచ్‌ మోహన వంశీ

మరిన్ని వార్తలు