పేపర్‌ బొమ్మ

22 Aug, 2020 00:04 IST|Sakshi
పేపర్‌తో తయారుచేసిన బొమ్మలతో లావణ్య

అందమైన బొమ్మలు.. సందేశాన్ని ఇచ్చే బొమ్మలు.. సందర్భానికి తగ్గ బొమ్మలు.. నాజూకైన బొమ్మలు.. లావణ్య నల్లమిల్లి చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. అదీ క్విలింగ్‌ పేపర్‌తో. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినా సృజనాత్మక ఆలోచనలతో పేపర్‌ బొమ్మల తయారీలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగులమయం చేసుకోండి’ అనే థీమ్‌తో ఐదు అడుగుల బొమ్మను పేపర్‌తో తయారుచేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పేరు సంపాదించుకున్నారు. స్టిచింగ్‌ ట్యూటోరియల్‌తో ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకుంటున్నారు. ఉన్న దారిలో ప్రయాణించడం కుదరకపోతే మరో దారిని తనకు తానుగా వేసుకుంటూ ముందుకు వెళుతున్న లావణ్య చెబుతున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘పుట్టి పెరిగింది నెల్లూరులో. హైదరాబాద్‌ జెఎన్‌టియూలో బీటెక్‌ చేశాను. ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. పెళ్లయి బాబు పుట్టాక ఉద్యోగం మానేశాను. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. చిన్ననాటి నుంచి ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ మీద ఆసక్తి ఎక్కువ. డెలివరీ టైమ్‌లో ఇంట్లోనే ఉండటంతో బాబుకి కావల్సిన క్రోషెట్స్‌ అల్లకం వంటివి ఆన్‌లైన్‌ లో చూసి నేర్చుకున్నాను. పాప పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల పనులతోనే రోజంతా సరిపోయేది.

దీనితో ఇక ఉద్యోగం చేయాలనే ఆలోచనను పూర్తిగా మానుకున్నాను. అయితే, కాస్త తీరిక టైమ్‌ దొరికినా ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ అభిరుచిని ముందేసుకునేదాన్ని. పిల్లలు కాస్త పెద్దవుతుంటే టైమ్‌ను ప్లాన్‌ చేసుకుంటూ నా హాబీని పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టాను. ఇంట్లోనే ఉండి యూ ట్యూబ్‌ చానెల్‌లో స్టిచింగ్‌ ట్యుటోరియల్‌ ప్రారంభించాను. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు స్టిచింగ్‌తో పాటు క్విల్లింగ్‌ డాల్స్‌ రెండూ చేస్తున్నాను. క్విలింగ్‌ డాల్స్‌ తయారీలో చేసిన ప్రయోగాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

గాంధీ టు గణేష
గాంధీజీ చరఖా తిప్పుతున్నట్టు ఉన్న డిజైన్‌ చేయాలనుకున్నప్పుడు కొంత టెన్షన్‌కి లోనయ్యాను. గాంధీ ముఖ కవళికలను బొమ్మలో సరిగ్గా తీసుకురాగలనా అని. బొమ్మ పూర్తయ్యాక వచ్చిన సంతృప్తి మాటల్లో చెప్పలేను. అలాగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనికుడు, జెండా బొమ్మలను తయారు చేశాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మినియేచర్‌ ఫ్లాగ్‌లో మిళితం చేశాను. మంచి ప్రశంసలు వచ్చాయి.కరోనా మహమ్మారి మీద పోరాటం చేస్తున్న డాక్టర్లను దృష్టిలో పెట్టుకొని డాక్టర్‌ బొమ్మను డిజైన్‌ చేశాను.
గణేష్‌ చవితిని పురస్కరించుకొని గణేష బొమ్మలను చేస్తున్నాను. గణేష టీమ్‌ పేరుతో ఒక మినియేచర్‌గ్రౌండ్‌నే సృష్టించాను. ఎలాంటి వర్క్‌షాప్స్, క్లాసులు లేకుండానే ఈ వర్క్‌ని నేర్చుకొని చేస్తున్నాను. ప్రస్తుతం ఆర్డర్స్‌ మీద వర్క్‌ చేస్తున్నాను. ఆన్‌లైన్‌లో క్లాసులు ఇస్తున్నాను. ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడు 40 బొమ్మలు తయారుచేసే పనిలో ఉన్నాను. ఈ బొమ్మలన్నీ ఎక్కువగా కానుకలుగా తమ ఆప్తులకు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. కిందటేడాది గణేషుడి బొమ్మలను నేరుగా సేల్‌ చేశాను. ప్రస్తుతం వీటిని ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నాను.  

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌
కుట్టడం, అల్లడం వంటివి ఎలాగూ వచ్చు. ఇవి కాకుండా ఇంకేం చేయచ్చు అని ఆలోచించినప్పుడు పేపర్‌ క్విల్లింగ్‌ ఆకట్టుకుంది. ముందు పేపర్‌తో ఆభరణాలు తయారుచేయడం, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టడం, ఆర్డర్స్‌ మీద ఎవరైనా అడిగితే చేసి ఇవ్వడం చేసేదాన్ని. దీంట్లోనే త్రీడీ క్రియేషన్స్‌ కూడా చేశాను. మా ఫ్రెండ్‌తో దీని గురించి చర్చ వచ్చినప్పుడు ఏదైనా వినూత్నంగా ట్రై చేద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్‌ ‘వన్మయి’ పేరుతో నేను 5 అడుగుల పొడవున మోడ్రన్‌ బొమ్మను తయారు చేశాను. కాగితపు గుజ్జు, ఫాబ్రిక్‌ గ్లూ వంటి వాటిని ఉపయోగించి ‘వర్నిక’ పేరుతో నిలువెత్తు కళారూపాన్ని ఒక మంచి థీమ్‌తో తయారుచేశాం. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగుల మయం చేసుకోండి’ అనేది ఆ థీమ్‌. కిందటేడాది ‘వన్మయి’ ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో నమోదయ్యింది. చాలా ప్రశంసలూ వచ్చాయి. దీంతో పూర్తిగా పేపర్‌ డాల్స్‌ మీద దృష్టిపెట్టాను. 

గంటల నుంచి రోజులు
క్విలింగ్‌లో ఒక నీడిల్‌ ఉపయోగించి బొమ్మలు తయారుచేస్తాం. దీనికి కావల్సిన చిన్న చిన్న వస్తువులు స్టేషనరీ షాపుల నుంచి సేకరిస్తాను. త్రీడీ డాల్‌ వర్క్‌ అయితే సాధారణ బొమ్మ తయారు కావడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే కొత్త కాన్సెప్ట్‌.. కాస్త ఎక్కువ వర్క్‌ ఉన్నదయితే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది’’ అని లావణ్య తను ఎంచుకున్న మార్గాన్ని పరిచయం చేసింది.
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు