ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలి

2 Aug, 2020 00:11 IST|Sakshi

కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ...‘‘కాలోహి దురతి క్రమః’’ అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం...లోకంలోఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే.

కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా  కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు.  ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికిగానీ, మరొకరిని ఉద్ధరించడానికిగానీ పనికిరాడు.

కాలం విలువ తెలిసి ఉండాలి. అందుకే రుషులు కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేసారు. సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేసారు. దాన్ని ఉత్తరాయనం, దక్షిణాయనంగా విడదీసారు. దక్షిణాయనం అంతా భగవంతుడిని ఉపాసన చేయవలసిన కాలంగా నిర్ణయించారు. మళ్ళీ దాన్ని నెలగా, దాన్ని శుక్ల, కష్ణ పక్షాలుగా, పక్షంలో ఒక రోజును తిథిగా దాన్ని పగలు, రాత్రిగా విభజించారు. ఎన్ని విభాగాలుగా చేసినా దాని ప్రయోజనం – ఆ కాలాన్ని, దాని వైభవాన్ని ఎన్ని రకాలుగా మనిషి  గుర్తించగలడో గుర్తించి, దాని చేత మనిషి సమున్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడు. కాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని అప్పడు చేసినవాడు  తాను ఆశించిన స్థితిని పొందుతాడు.

శ్రీ రామాయణంలో ఒక మాటంటారు...సత్పురుషులయిన వాళ్ళు కోపానికి వశులుకారు–అని. కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఎవర్ని చూస్తే కోపం వస్తుంది? కేవలం ఒక పనిని గొప్పగా చేయడం కాదు.  ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడు చేసినవాడు ధన్యుడు. అలా కాకుండా ఒక పనిని చేయవలసినప్పుడు కాకుండా వేరొక సమయంలో చేసిన వాడు, ఆలస్యం చేసిన వాడు, సమయానికి చేయనివాడెవడో వాడిని చూస్తే సత్పురుషులకు కోపం వస్తుంది. అంటే కాల విభాగం లో ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చేయవలసి ఉంటుంది. సాక్షాత్‌ భగవంతుడు అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చినా.. ఆయనను నిద్ర లేపాల్సి వస్తే ఆ కాలము నందు అతను చేయాల్సిన పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది...‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్‌...’’ అని. 

మరిన్ని వార్తలు