మెహబూబా ముఫ్తీ (కశ్మీర్‌ నేత) రాయని డైరీ | Sakshi
Sakshi News home page

మెహబూబా ముఫ్తీ (కశ్మీర్‌ నేత) రాయని డైరీ

Published Sun, Aug 2 2020 12:15 AM

Mehbooba Mufti unwritten dairy - Sakshi

ఏడాదిగా నేను వెలుగునే చూడలేదు! శ్రీనగర్‌లో నేను బందీగా ఉన్న ఈ ఫెయిర్‌ వ్యూ గృహంలో నిరంతరం విద్యుత్‌ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఎన్ని దీపాలు వెలుగుతుంటే ఏంటి? బయటి వెలుగే సోకకుండా!

నా తోటి వారందరినీ విడుదల చేసి మోదీజీ నన్ను మాత్రం నిర్బంధంలోనే ఉంచేశారు! సజ్జద్‌ గనీని ఆగస్టు ఐదుకు నాలుగు రోజుల ముందే వదిలిపెట్టారు. ఫరూక్‌ అబ్దుల్లాను, ఒమర్‌ అబ్దుల్లాను ఆగస్టు ఐదుకు ఐదు నెలల ముందే వదిలిపెట్టారు. నన్ను కూడా సజ్జద్‌ తర్వాత ఆగస్టు ఐదు లోపే వదిలి పెడతారనే ఆశించాను. అయితే ఆగస్టు ఐదు తర్వాత కూడా ఇంకో మూడు నెలలు నేను ఈ నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు వరండాలో నా నుంచి కశ్మీర్‌కు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి ఎవరితోనో అంటుంటే ఆ మాటలు వినిపించాయి.

‘‘ఏంటి! ఇంకో మూడు నెలలు నేను బందీగానే ఉండిపోవాలా!’’ అని అతడిని పిలిచి అడిగాను. 

‘‘మేడమ్‌జీ.. మీరిలా ప్రతిసారీ నన్ను పిలిచి ఏదో ఒకటి అడగడం పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద శిక్షార్హమైన నేరం. ఆ నేరానికి శిక్ష మీకు పడుతుందా, నాకు శిక్ష పడుతుందా అనేది చెప్పలేను కానీ నేరం నేరమే’’ అన్నాడు!

‘‘ప్రతిసారీ నిన్నెప్పుడు పిలిచాను?!’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. 

‘‘ఫరూక్‌ సార్‌ విడుదలైనప్పుడు పిలిచారు. ఒమర్‌ సార్‌ విడుదలైనప్పుడు పిలిచారు. ఇప్పుడు సజ్జద్‌ సార్‌ విడుదలైనప్పుడూ పిలుస్తున్నారు’’ అన్నాడు. 

‘‘నేనేమీ కొత్తగా ప్రశ్నలు అడగడానికి పిలవడం లేదు. నేను ఇంకో మూడు నెలలు నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు నువ్వు ఎవరితోనో అంటుంటే వినిపించి పిలిచాను’’ అన్నాను. 

‘‘అది నా వ్యక్తిగతమైన విషయం అవుతుంది మేడమ్‌జీ. నేను మాట్లాడుతున్నది మీ గురించే అయినప్పటికీ, మాట్లాడుతున్నది మీతో కాదు కనుక అది నా వ్యక్తిగతమైన విషయమే. పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద నా వ్యక్తిగత విషయాలను నిర్బంధంలో ఉన్న వారితో పంచుకోవడం కూడా నేరమే కావచ్చని నా భయం. మీరు అడిగారు కాబట్టి మీకు అవసరంలేని ఒక విషయం చెప్పగలను. ఎవరితోనూ పంచుకునే వీలులేకనే నేను ఎవరో ఒకరితో పంచుకుంటున్నాను. అది మీరు విన్నారు’’ అన్నాడు. 
నవ్వాను.

‘‘నేను నా వ్యక్తిగత విషయాలను నీతో పంచుకుంటే అది కూడా పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద నేరం అవుతుందన్న భయం కనుక నీకు లేకపోతే మోదీజీ గురించి నీతో నేను కొద్దిసేపు మాటల్ని పంచుకుంటాను..’’ అన్నాను.

‘‘మోదీజీ గురించి నాతో మాట్లాడాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మేడమ్‌జీ? మీరు అనుకోవలసింది నేరుగా మోదీజీతోనే మాట్లాడాలని కదా!’’ అన్నాడు.  
‘‘నిన్నూ, మోదీజీని నేను వేర్వేరుగా చూడటం లేదు. కశ్మీర్‌ నుంచి ఆయన భారత ప్రజల్ని కాపాడుతున్నారు. నా నుంచి నువ్వు కశ్మీర్‌ ప్రజల్ని కాపాడుతున్నావు. ఇద్దరూ ఒకటే..’’ అన్నాను. 

అతడి ముఖం వెలిగిపోయింది. ఆగస్టు ఐదున కశ్మీర్‌లో త్రీసెవెంటీని రద్దు చేశాక ఈ ఏడాదిలో నేను చూసిన తొలి వెలుగు అది!

‘‘అందర్నీ వదిలిపెట్టి, నన్నిలా వదిలేశారు. మోదీజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి?!’’ అని అడిగాను. 
గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. 

‘‘మేడమ్‌ జీ.. నేనొకటి చెబుతాను నిరుత్సాహపడకండి’’ అన్నాడు. 
చెప్పమన్నట్లు చూశాను. 

‘‘మోదీజీని ఎవరి సమయాన్ని బట్టి వారు అర్థం చేసుకోవలసిందే. ఒకే సమయంలో ఇద్దరికి ఆయన ఎప్పుడూ అర్థం కారు..’’ అన్నాడు!!

-మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement