షుగర్‌ వ్యాధికి సరికొత్త ట్రీట్‌మెంట్‌.. ఏడాదికి మూడుసార్లు మాత్రమే

22 Nov, 2023 11:14 IST|Sakshi

డయాబెటిస్‌ అనేది జీవితకాలం వేధించే సమస్య. దీన్నే షుగర్‌ వ్యాధి లేదా మధుమేహం అని కూడా అంటాం. ఇది ఒక్కసారి అటాక్‌ అయ్యిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇకపై షుగర్‌ పేషెంట్స్‌ ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇన్సులిన్‌ తీసుకుంటే సరిపోతుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 


ఇటీవలి కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్(ఐసీఎంఆర్‌) ప్రకారం.. భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది (10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది.వయసుతో సంబంధం లేకుండా ఏటా భారత్‌లో డయాబెటిస్‌ రోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

ఈ సమస్యకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఒక్కసారి డయాబెటిస్‌ బారిన పడితే డైట్‌ పరంగానూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకునేలా అనేక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

వీటితో పాటు ప్రతిరోజూ తప్పకుండా మందులు వాడాల్సిందే. ఈ క్రమంలో డయాబెటిస్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు హైడ్రోజెల్‌ ఆధారిత ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇంజెక్షన్‌ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. 

ఈ ప్రయోగాన్ని మొదట ఎలుకలపై ప్రయోగించారు. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్‌ను ఇంజెక్ట్‌ చేసి పరిశీలించగా వాటి రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌తో పాటు బరువు కూడా కంట్రోల్‌లో ఉన్నట్లు తేలింది. ఎలుకల్లో 42 రోజుల దినచర్య అంటే మనుషుల్లో ఇది నాలుగు నెలలకు సమానమని సైంటిస్టుల బృందం తెలిపింది. తర్వాతి పరీక్షలు పందులపై ప్రయోగిస్తారు, ఎందుకంటే ఇవి మనుషుల్లాంటి చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అనంతరం 18 నెలల నుంచి రెండేళ్ల లోపు మనుషులపై ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తామని సైంటిస్టులు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు