మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి

14 Aug, 2023 10:11 IST|Sakshi

బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది.  మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. 

ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. 

కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది.  వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. 

‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి.

అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. 
– బొర్రా గోవర్ధన్‌మిత్రధర్మం 

(చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!)

మరిన్ని వార్తలు