బండ సొరికలలో గుండుకు వెలిసిన కొమురెల్లి మల్లన్న!

26 Jan, 2023 10:38 IST|Sakshi

మాదిరాజు- మాదమ్మ దంపతుల సంతానంగా చెప్పబడే మల్లికార్జునుడిని పరమశివుడి అవతారంగా భావించి కొలవడం వీర శైవ సంప్రదాయం. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సిద్ధిపేట సమీపంలో నున్న కొమురవెల్లిలో మల్లికార్జునుడు 'బండ సొరికలలో గుండుకు వెలిసిన మల్లన్నదేవుడి' గా ఇరుపక్కల గొల్ల కేతమ్మ, లింగబలిజ మేడలమ్మ దేవేరులతో పూజలందుకుంటున్నాడు.

ఈ క్షేత్రానికి ప్రధానంగా వచ్చే భక్తులు యాదవ, గొల్ల, కురుమ, లింగబలిజలని చెప్పవచ్చు. కొమురవెల్లికి దాదాపు 20 కి మీ దూరంలోనున్న' కొండ పోచమ్మ'ను మల్లన్న స్వామి అక్కగా భావించి భక్తులు అక్కడికీ వెళ్తుంటారు. ప్రతియేటా సంక్రాతి నుండి ఉగాది వరకు జరిగే ఈ జాతరలో మొదటి ఆదివారం 'లష్కర్ బోనాల'కు హైదరాబాద్ నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

గంగరేణి చెట్టు కింద పట్నాలు
మల్లన్న ఆలయం ముందున్న గంగరేణి చెట్టు కింద జరిగే పట్నాలు అనబడే ముగ్గు పూజలు విశేషమైనవి. పసుపు రంగు బట్టలు వేసుకొని, జగ్గువాద్యం పట్టుకున్న ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి మధ్యలో స్వామిని పెట్టి, ఆవాహనం చేసి పూజలు చేస్తుంటారు. బహు పాత్రాభినయం చేస్తూ, గ్రామీణుల భాషలో, పిట్ట కథలు జోడించి, ఆడుతూ పాడుతూ ఒగ్గులు చెప్పే కథలు విన సొంపుగా ఉంటాయి.

జాతర చివరలో కామదహనం
ఈ కళలో ప్రసిద్దులైన వారు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసలు తెలంగాణ కళాకారులు వరంగల్కు చెందిన చుక్క సత్తయ్య ( 1935-2017), కరీంనగర్ మిద్దె రాములు( 1941-2010) లాంటివారు. కొమురెల్లి జాతర చివరలో కామదహనం ఉంటుంది. అగ్ని ప్రతిష్ఠ చేసి, కణకణ మండే నిప్పులు తొక్కుతూ అగ్ని గుండాలు దాటడం వీరశైవ ఆచారం.

'శివసత్తుల' ఆచారం
మల్లన్న ఆలయ ప్రాంగణంలోనే వున్న చిన్న ఉపాలయం రేణుకా చార్యుడిది. వీర శైవ సంప్రదాయం లోని పంచాచార్యులలో రేణుకాచార్య ప్రధముడు. వీర శైవులు పవిత్ర గ్రంధంగా భావించే 'శ్రీ సిద్ధాంత శిఖామణి'ని బోధించింది వీరే నంటారు. తెలుగు రాష్ట్రాల్లోని వృత్తి కులాలవారు చాలా మంది శైవ సంప్రదాయికులే కావడం, ముఖ్యంగా తెలంగాణలో యాదవ కులాలవారు ఆ రోజుల్లనే వీరశైవం వైపు ఆకర్శించబడడం, 'శివసత్తుల' ఆచారం వంటి అంశాలు ఆసక్తికరం, పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన విషయాలు.

'మల్లన్నసాగర్ ' పేరిట
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన జలాశయానికి 'మల్లన్నసాగర్ 'అని పేరు పెట్టడమే కాకుండా,గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆ నీటితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి పాదాలు కడిగితే, అదేయేడు డిసెంబర్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరపున కోటి రూపాయలు విలువైన బంగారు కిరీటాన్ని మల్లన్న కల్యాణ వేడుకల్లో సమర్పించారు.


-వేముల ప్రభాకర్, అమెరికా నుంచి

మరిన్ని వార్తలు