చలికాలంలో ఇలా చేస్తే చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంది

25 Nov, 2023 15:51 IST|Sakshi

ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తోంది. మార్పు, వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లు మొదలవుతుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మన పెద్దలు కొన్ని గృహ చిట్కాలను పాటించేవారు. అవేమిటో తెలుసుకుందాం. 

పూర్వం చలికాలం రాగానే పెద్దవాళ్లు వంటికి వెన్నపూస లేదా నువ్వులనూనెను రాసుకుని ఎండలో కాసేపు నిలబడేవారు. దాంతో చర్మానికి తగిన పోషకాలు అంది తేమను కోల్పోకుండా మృదువుగా ఉండేది. ఇప్పుడు కూడా మనం అలా చేయవచ్చు. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు చూద్దాం. 

చర్మానికి కలబంద: అలోవెరా జెల్‌ అంటే కలబంద గుజ్జు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎల్లప్పుడూ చర్మానికి మంచి నేస్తం వంటిది. అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ, గాయాలను నయం చేయడానికీ సహాయపడుతుంది. దీనికోసం చేయవలసిందల్లా రాత్రిపూట కాసింత కలబంద గుజ్జు... అదేనండీ... అలోవెరా జెల్‌తో ముఖానికి, శరీరానికి సున్నితంగా మసాజ్‌ చేస్తే సరి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె: తలకే కాదు. ఒంటికి కూడా... కొబ్బరినూనెను కేవలం తలకు మాత్రమే రాసుకునే తైలంగా చూస్తారు చాలామంది. అయితే కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. స్వచ్ఛమైన కొబ్బరినూనెను తీసుకుని ఒంటికి, ముఖానికి సున్నితంగా మసాజ్‌ చేయాలి. పడుకునే ముందు లేదా స్నానానికి అరగంట ముందు ఇలా చేస్తే చికాకు, అసౌకర్యం లేకుండా ఉంటుంది. అదేవిధంగా రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన నేతిని చర్మానికి రాసుకుంటూ ఉంటే కొద్దిరోజుల్లోనే చర్మం కోమలంగా... మృదువుగా నిగారింపును సంతరించుకుంటుంది. 

ఆవనూనె: పొడి బారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా మార్చుకోవడానికి ఆవనూనెను చర్మంపై అప్లై చేయడం సర్వసాధారణం. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు ఏవీ రావు. పిల్లలకు రోజూ బేబీ ఆయిల్‌ లేదా వెన్న, నెయ్యి లేదా నువ్వులనూనెను ఒంటికి రాసి ఎండలో ఆరిన తర్వాత స్నానం చేయిస్తే చర్మం మృదువుగా ఉండడంతో పాటు ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. చలికాలంలో ఇలా చేయడం మంచిది.      

                            

మరిన్ని వార్తలు