వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..

24 May, 2022 20:17 IST|Sakshi

ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి.
– డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ)

జాగ్రత్తలు.. 
► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.  
► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. 
► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. 
► అవసరాన్ని బట్టి ఓఆర్‌ఎస్‌ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. 
► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్‌ దుస్తులు ధరించాలి. 
► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. 

వడదెబ్బ ప్రమాదం 
► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. 

► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. 

► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 

► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. 

లక్షణాలు.. 
► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్‌ అవుతుంది 
► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. 
► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. 
► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి.  
► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది 
► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. 
► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు 
► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది 
► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. 

నివారణ చర్యలు.. 
► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. 
► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. 

► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్‌టబ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్‌ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  

► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు.  

ఏం తినాలి.. 
వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి.  

మరిన్ని వార్తలు