ఎక్కువసేపు కూర్చునే ఉంటారా? ఈ సమస్యలు తెలిస్తే.. స్థిమితంగా కూర్చోలేరేమో! 

10 Sep, 2022 08:53 IST|Sakshi

ఇటీవలి కాలంలో కూర్చుని పనిచేయడం ఎక్కువైంది. అందులోనూ కరోనా ప్రభావం వల్ల ఇంటి దగ్గరే ఉండి కూర్చుని పని చేయడం మరికాస్త ఎక్కువైంది. కూర్చుని పని చేస్తే ఏమైంది, చక్కగా ఒళ్లు అలవకుండా ఉంటుంది కదా అని మురిసిపోవద్దు. అలా గంటల తరబడి కదలకుండా పని చేయడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేవలం కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేయడం ఒక్కటే కాదు, గంటలకొద్దీ డ్రైవ్‌ చేయడం కూడా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూర్చునే ఉండటం వల్ల నష్టాలేమిటో తెలుసుకుంటే.. స్థిమితంగా కూర్చోలేరేమో! 

►ధూమపానం, ఊబకాయం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో రోజుకు ఏడెనిమిది గంటలపాటు కూర్చోవడం వల్ల కూడా అలాంటి అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. తక్కువగా కూర్చోవడం, పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణుల సలహా. 

►నిల్చోవడం, నడవడం వంటి వాటితో పోల్చితే కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్‌ స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

►సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు దారితీసే కారకాలకు మధ్య గల సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి అనేక దఫాలుగా అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాలలో ఎవరైతే కదలకుండా రోజుకు 8 గంటలకు పైగా కూర్చున్నారో వారి ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తేలింది. 

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల...
►ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలు, పిరుదుల కండరాలు శక్తి హీనంగా తయారవుతాయి. నడవడానికి, స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా తయారైతే... వ్యాయామాలు చేసినా, కిందపడినా తీవ్రమైన గాయాలవుతాయి. 

►అదేపనిగా గంటలకొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్ద పేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
రోజులో ఎక్కువసార్లు కండరాలను కదిలించడం వల్ల శరీరంలోని కొవ్వులు, చక్కెరలు సంపూర్ణంగా జీర్ణమవుతాయి. అదేగనక మనం రోజంతా కూర్చున్నట్లయితే, జీర వ్యవస్థ బలహీనపడి శరీరంలో కొవ్వులు, చక్కెరనిల్వలు అలాగే పేరుకుని పోతాయి. అంతేకాదు, గంటలకొద్దీ కూర్చోవడం వల్ల తొడ కండరాలు కుచించుకుపోయి జాయింట్‌ పెయిన్‌ వస్తుంది. 

►ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్ని వ్యాయామాలు చేసినా వాటివల్ల ఏమంతగా ఫలితం కలగదు.  
►రోజంతా చురుగ్గా ఉండటం వల్ల, ఎక్కువ సేపు తిరుగుతూ ఉండటం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలూ దరిచేరవు. అందువల్ల కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి లేచి అటు ఇటు తిరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. నిలబడి పని చేస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది.  టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు కూడా నడవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

►ఎక్కువసేపు కూర్చుని పని చేయడం కన్నా, ఎక్కువసేపు నిల్చుని పని చేయడం కొంత మెరుగయినదే అయినా, అది కూడా పూర్తిగా క్షేమం కాదు. మధ్య మధ్యలో టీ బ్రేక్‌లు, భోజన విరామాలు తీసుకోవడం, మంచినీళ్లు తెచ్చుకోవడం మేలు చేస్తుంది. కాబట్టి ఫ్యాన్‌ కింద కూర్చుని పని చేసేవారి గురించి అసూయ పడకండి మరి! 

మరిన్ని వార్తలు