పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే..  | Sakshi
Sakshi News home page

పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 

Published Tue, Aug 22 2023 6:28 AM

CM KCR Clarification To Party Cadre: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ముందు నుంచీ చెప్తున్నట్టుగానే సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు కేటాయించామని.. పార్టీ ధిక్కార చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ధిక్కారానికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు సాదాసీదాగా ఉండవని, పార్టీ నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు.

ఒకట్రెండు చోట్ల అసంతృప్తులుంటే.. పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకెవరూ పోటీయే కాదని.. 95 నుంచి 105 సీట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో 115 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో జాబితాను కేసీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో పూర్తి స్థాయి అవగాహన, సర్దు బాట్లతోనే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు.

పార్టీ నిర్ణయం మేరకు తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రావణమాసం మంచి ముహుర్తం ధనుర్లగ్నంలో అభ్యర్థులను ప్రకటించామని.. వీరిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఆశీర్వదించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌ 16న వరంగల్‌లో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే రోజున బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. 

తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు 
తప్పనిసరి పరిస్థితుల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎవరినైనా వదులుకోవాలంటే తమకు కూడా బాధగానే ఉంటుందన్నారు. అవకాశం రానివారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్‌పర్సన్లుగా పార్టీ అవకాశాలు కలి్పస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

మిగిలిపోయిన 4 సీట్లలో అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. వేములవాడ అభ్యర్థి మంచివాడే అయినా ఆయన పౌరసత్వం సమస్య కోర్టుల్లో ఉందని చెప్పారు. భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డికి పోటీచేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినందున మధుసూదనాచారి సహకారంతో టికెట్‌ కేటాయించామన్నారు. తాండూరు నుంచి మహేందర్‌రెడ్డి కూడా యువకుడికి అవకాశం ఇవ్వడానికి పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని చెప్పారు. 

వామపక్షాలతో పొత్తు మాటే రాదు 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక వామపక్షాలతో పొత్తు మాటే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిందని, బీఆర్‌ఎస్‌ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందేమని మీడియా ప్రశ్నించగా.. ‘చూద్దాం.. ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారో?’అని బదులిచ్చారు. మహిళలకు తక్కువ సీట్లపై స్పందిస్తూ.. పార్లమెంటు చట్టం చేస్తే ప్రతీపార్టీ కూడా మహిళలకే అవకాశాలు ఇస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఆలోచించి టికెట్లు కేటాయించామని వివరించారు.  

కర్ణాటకకు, తెలంగాణకు పోలికే లేదు 
ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు, తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించారు. బెంగళూరుకు విద్యుత్‌ సరఫరా చేయలేక లోడ్‌ షెడ్డింగ్‌ చేస్తున్నారన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. బీఆర్‌ఎస్‌ లక్ష రూపాయలే, అదీ విడతల వారీగా మాఫీ చేస్తామని, ప్రజలు తమనే నమ్మి గెలిపించారని చెప్పారు. 

జవదేకర్‌ ఓ పాగల్‌..! 
సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘జవదేకర్‌ మాట్లాడేది ఏంది? కాళేశ్వరం గురించి తొండం తెల్వదు.. తోక తెల్వదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఆయనో ఓ పాగల్‌. బీఆర్‌ఎస్‌ను ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్‌ అంటున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగల్‌ పార్టీలు..’’అని కేసీఆర్‌ మండిపడ్డారు. 

వ్యతిరేకులకు ఇళ్ల స్థలాలివ్వం: కేసీఆర్‌ 
‘‘రాష్ట్రానికి వ్యతిరేకంగా, అభివృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు ప్రచురించే పత్రికల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం. వాళ్లను పాలు పోసి పోషించాల్సిన అవసరమేముంది? ఎవరికి ఇవ్వా లన్నది ప్రభుత్వ విచక్షణ. కీలుబోమ్మలాంటి వారు జర్నలిస్టులు ఎలా అవుతారు? వాళ్లకు ఐడియా ఉండాలి కదా.. దేశంలో ఎవరూ మాతో పోల్చుకోవడానికి కూడా సాహసం చేయని పరిస్థితులు ఉంటే.. ఇక్కడ వేతనాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ కథనాలు రాస్తున్నారు.

ఒకే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఆ పత్రిక తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఆర్‌బీఐ రాష్ట్రాన్ని బెస్ట్‌ స్టేట్‌ అంటోంది. కేంద్రం, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని చెబుతూ అవార్డులిస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా పనికి మాలిన రాతలు రాస్తున్నారు. ఇదేం జర్నలిజం? ఉద్యమ సమయంలోనే చెప్పా.. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని.. న్యూస్‌పేపర్‌ కాదు వ్యూస్‌ పేపర్, చానెల్స్‌ ఉన్నాయి..’’అని సీఎం ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు.

Advertisement
Advertisement