Shrushti Tawade: ఒక్క పాటతో సంచలనం.. పాడటమే కాదు సెటైర్‌లతో నవ్విస్తుంది.. డ్యాన్స్‌తో షేక్‌ చేస్తుంది

13 Apr, 2023 12:19 IST|Sakshi

ఆమె... ఒక్క మాటతో పొట్ట చెక్కలయ్యేలా చేయగలదు.
ఒక్క పాటతో కళ్లు కన్నీటి చెరువయ్యేలా చేయగలదు.
అదే పాటతో హుషారు ఉత్తుంగ తరంగమయ్యేలా చేయగలదు.
ముంబైకి చెందిన 24 సంవత్సరాల సృష్టి తవాడే రైటర్, పోయెట్, ర్యాపర్, 
సెటైరిస్ట్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది...

సృష్టి తవాడే తల్లికి కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. పాడడమే కాదు రాసేది కూడా. డైరీల నిండా ఆమె రాసిన కీర్తనలే కనిపించేవి. ఒకసారి తల్లి రచనలో నిమగ్నమై ఉన్నప్పుడు... ‘ఇలా రాస్తే ఏం వస్తుంది?’ అని అడిగింది సృష్టి.‘నువ్వు రాస్తే తెలుస్తుంది’ అని చెప్పి తన రచనలో నిమగ్నమైపోయింది తల్లి.

కోవిడ్‌ సమయంలో సృష్టికి బోలెడు తీరిక దొరికింది. ఇంగ్లీష్‌ సాహిత్యంలో పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ చేసిన సృష్టి పాత పాఠ్యపుస్తకాలను పదే పదే తిరగేసింది. ఒకరోజు తనకు కూడా రాయాలనిపించింది. అంతే...అప్పుడు పట్టుకున్న కలాన్ని మళ్లీ వదలలేదు. రచన చేయడంలో ఉండే మజా ఏమిటో సృష్టికి స్వయంగా తెలిసి వచ్చింది.‘మనల్ని మనం వ్యక్తీకరించుకోవడానికి కవిత్వం, కథలు బలమైన సాధనాలు’ అనే వాస్తవం బోధపడింది.

కవిత్వం, వచనం, పాట, సెటైర్‌... ఇలా ఎన్నో రాసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘ఏదీ వదలలేదు!’అయితే సృష్టి రాసిన పాటలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాలేదు. చిల్లీ కిండా గై, మై నహీతో కౌన్‌... మొదలైన పాటలతో ఇంటర్నెట్‌ సెన్సేషనల్‌గా మారింది సృష్టి.

మై నహీతో కౌన్‌... పాటను హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, హర్యాన్వీ భాషల్లోనూ పాడింది. 
ముంబైలోని నేషనల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్, ఎస్‌ఎన్‌డీటీ కాలేజీలో చదువుకున్న సృష్టికి ర్యాప్‌ అండ్‌ పాప్‌ కల్చర్‌ కొత్త కాదు.
తన పాటలతో సృష్టి ఇంటర్నెట్‌లో ప్రాచుర్యం పొందడం ఒక ఎత్తయితే ఎంటీవీలో అవకాశం మరో ఎత్తు.
మన దేశంలోని తొలి ర్యాప్, హిప్‌–హప్‌ రియాల్టి షో ఎంటీవీ హాజిల్‌తో సృష్టి తవాడే పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఇది తనకు ఊహించని గుర్తింపు!


‘ఆరోజుల్లో పాటలు ఎంత బాగుండేవో! అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఆ రోజుల్లో రచన ప్రక్రియ అనేది ఒక యజ్ఞంలా సాగేది. ఇప్పుడు డెడ్‌లైన్‌లే పాటలు రాయిస్తున్నాయి. అందుకే ఆలస్యం అయినా సరే బాగా ఆలోచించాకే పాట రాయాలని నిర్ణయించుకున్నాను. అది సత్ఫలితాన్ని ఇస్తోంది’ అంటున్న సృష్టి దగ్గర పాటకు సంబంధించిన బోలెడు ఐడియాలు ఉన్నాయి.

అయితే అన్ని ఐడియాలను తప్పనిసరిగా ర్యాప్‌ అండ్‌ పాప్‌లోనే జోడించాలనుకోవడం లేదు. ఫన్నీ ర్యాపర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సృష్టి సామాజిక అంశాలను కూడా పాటల్లోకి తీసుకువస్తోంది. మ్యూజిక్‌ ప్యారడీలలో కూడా పనికొచ్చే మాటలను జత చేస్తుంది. డ్యాన్స్‌ నుంచి ఉపన్యాసం వరకు... సృష్టి చిన్నప్పటి నుంచే స్టేజీ పర్సన్‌. స్టేజీ ఫియర్‌ అనేది ఆమె నిఘంటువులోనే లేదు. తన భయమల్లా...‘షో విఫలమైతే!’ అనేది. సృష్టికి అలాంటి సందర్భం ఇంతవరకు ఎదురు కాలేదు. సృష్టి పేరు వినిపిస్తే, స్టేజీ మీద కనిపిస్తే... సెల్ఫ్‌–టాట్‌ ర్యాపర్, కామెడిక్‌ గ్యాంగ్‌స్టర్‌లాంటి మెచ్చుకోళ్లు ప్రేక్షకుల నుంచి వినిపిస్తాయి.

మరిన్ని వార్తలు