Pareshamma: ఒప్పించి.. మెప్పించింది!

5 Jun, 2021 05:40 IST|Sakshi

వాటర్‌ ఉమన్‌

ఐదేళ్ల శ్రమకు దక్కిన గౌరవం ఇది. నేలతల్లి గొంతు తడిని నిలిపిన ఫలితం. గ్రామీణ మహిళకు అందిన ఈ పురస్కారం.

చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె కరువుకు కేరాఫ్‌. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఇక్కడ రైతులకు కొత్తేమీ కాదు. సాగు చేయడానికి నేల ఉంది, పంట పండడానికి నీరు లేదు. తంబళ్లపల్లెతోపాటు చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఇప్పుడు ఆ దుస్థితి నుంచి గట్టెక్కాయి. ఆ గట్టెక్కడంలో వేల అడుగులు నడిచింది పారేశమ్మ. ఆమె శ్రమకుగాను యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్, నేషనల్‌ వాటర్‌ మిషన్‌లు బుధవారం నాడు నేషనల్‌ ఉమెన్‌ వాటర్‌ చాంపియన్‌ అవార్డును ప్రకటించాయి.

తంబళ్లపల్లె మండలం, గోపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సింది. గోపిదిన్నెకు చెందిన ఎరుకులప్పను కులాంతర వివాహం చేసుకుంది. అతడు తంబళ్లపల్లె పంచాయతీలో పారిశుద్ద్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. పారేశమ్మ తల్లిదండ్రులకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నప్పటికీ సాగునీటి ఇబ్బందులతో వ్యవసాయం చేయడం కుదరలేదు. బతుకుతెరువు కోసం తంబళ్లపల్లెలో స్థిరపడ్డారు.

వెంటపడి వినిపించింది!
తంబళ్లపల్లి వచ్చిన తర్వాత తాను కూడా ఏదో ఒక పని చేయాలి, ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తున్నప్పుడు 2015లో ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ’ సంస్థ పర్యావరణం, నీటి సంరక్షణ, రైతుల కోసం పనిచేస్తున్న విషయం తెలిసి పని అడిగింది. నెలకు రూ. 4,500 గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీ లో రీసోర్స్‌పర్సన్‌గా నియమితురాలైంది. తంబళ్లపల్లె పరిసరాల్లోని 16 పల్లెల్లో విధులు నిర్వహించాలి. వ్యవసాయంలో ఎంతో అనుభవం కలిగిన రైతులకు సూచనలివ్వాలి. చెప్పడానికి పారేశమ్మ సిద్ధంగా ఉన్నప్పటికీ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాళ్లు అలవాటు పడిన పద్ధతిలో మార్పు తీసుకురావడం మాటలు కాదు. అందులోనూ సేద్యంలో అనుభవం లేని పారేశమ్మ చెప్తుంటే పట్టించుకునేదెవరు? ఆమె ప్రయత్నం అంతా తాతకు దగ్గులు నేర్పించడం వంటిదే అన్నమాట.

కొన్నిరోజుల్లోనే పారేశమ్మకు పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఆమె ఆ రోజు ఈ పని తనవల్ల కాదని వదిలేసుంటే పారేశమ్మ గురించి రాయడానికి ఏమీ ఉండేది కాదేమో! ఆమె పట్టుదలతో కొనసాగింది. ఒక్కొక్క పల్లెకు ఒకటికి పదిసార్లు వెళ్లింది. ఉదయం ఆరున్నరకు వెళ్తే మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చేది. మళ్లీ సాయంత్రం నాలుగింటికి వెళ్తే రాత్రి 8 గంటల దాక పల్లెల్లోనే. వాస్తవ నీటి పరిస్థితులు, అధిక నీటి వినియోగమయ్యే పంటలసాగుతో కలిగే ఇబ్బందులను వివరిస్తూ వచ్చింది. చెవినిల్లు కట్టుకుని చెప్పినట్లే చెప్పింది. చెప్పగా చెప్పగా రైతులు వినడం మొదలైంది. ఆ తర్వాత వారిలో ఆలోచన రేకెత్తింది. నిజమే కదా! అని సమాధానపడ్డారు. అలా పారేశమ్మ రైతులను పంటల సాగులో మార్పుకు ఒప్పించింది.
 
రైతులకు అవగాహన కల్పిస్తున్న పారేశమ్మ
చాంపియన్‌
పొలాల్లో కందకాలు తవ్వుకుంటే నీరు పొలంలోనే ఇంకిపోయి తేమ శాతం పెరుగుతుందని వివరించింది. భుగర్భజలాలు పెరగడంపై అవగాహన కల్పించేది. ఉపాధి హామీ పథకం పనుల్లో అధికంగా నీటినిల్వ పనులు చేసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ పల్లెల్లో ఒక వర్షానికే కుంటలు నిండిపోతున్నాయి. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి పారేశమ్మ ఒంటరిపోరాటం చేసింది. ఆమె కృషికి గుర్తింపుగా వాటర్‌ చాంపియన్‌ అవార్డు ఆమెను వరించింది.
– టైలర్‌ షామీర్‌ బాషా ,బి. కొత్తకోట, చిత్తూరు జిల్లా

పదహారు పల్లెలు
తంబళ్లపల్లె, పులసవాండ్లపల్లె, గోళ్లపళ్లోపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె, బురుజు, బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారిపల్లె, చేలూరివాండ్లపల్లెల్లో ఇంటికి ఒకరిని సంఘంలో చేర్చాను. వారితో నిత్యం పొలాల్లో, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఏయే పల్లెల్లో భూగర్భజలాల మట్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి వివరించాను. ఏయే పంటలకు ఏ మేరకు నీటి వినియోగం అవుతుందో చెప్పేదాన్ని, నీటివనరును బట్టి ఏ పంటలు సాగు చేయాలనే అవగాహన కల్పిస్తూ  అందుకు అనువైన పంటల గురించి వివరించాను. అందరూ కలిసిరావడంతోనే విజయం సాధించాం.
– పారేశమ్మ, రీసోర్స్‌ పర్సన్,ఎఫ్‌ఈఎస్‌

ఇదీ ప్రణాళిక!
ఈ పల్లెల చుట్టూ కొండలు, గుట్టలు ఉంటాయి. పల్లెల చుట్టూ సహజంగా ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకోవడం. భూమికోత నివారణ, మొక్కల పెంపకం ద్వారా అడవుల సంరక్షణ, భూగర్భజలాల వృద్ధికి నష్టం కలిగించే పనులు చేపట్టకపోవడం కార్యక్రమాలను సంఘాల  ద్వారా అవగాహన కల్పించింది పారేశమ్మ. ఈ గ్రామాల్లో రైతులు వరి, టమాట పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు. సగం పొలంలో రైతుకు ఇష్టమైన పంట వేసుకుని, మిగిలిన సగం పొలంలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ సాగు చేశారు. గత ఏడాది 60 మంది రైతుల చేత 75 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయించారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో 480 టన్నులు వచ్చింది. కోవిడ్‌ ప్రభావంతో ధరలు తగ్గాయి. కొందరు రైతులు పంటను అమ్మకుండా మార్కెట్‌ మెరుగయ్యే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫొటోలు: షేక్‌ మహ్మద్‌ రఫీ, సాక్షి, తిరుపతి

మరిన్ని వార్తలు