జగన్‌ జైత్రయాత్రకు ఫలసిద్ధి!

16 Mar, 2021 02:37 IST|Sakshi

రెండో మాట

ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వేల కిలోమీటర్లు నడిచాడు జగన్‌. కోట్లాదిమంది ప్రజల్ని కలుసుకుని, వారి బాధలు తెలుసుకొని, తను చలించిపోయి, ప్రజాబాహుళ్యాన్ని చలింపజేశాడు. కనీవినీ ఎరుగని రీతిలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. తిరిగి అంతే చరిత్రను వినూత్న సంక్షేమ పథకాల ద్వారా తన సుపరిపాలనను మూలమూలకూ అందిస్తూ సృష్టిస్తున్నాడు. జగన్‌ విజయాన్ని చూడలేని, జగన్‌కు వస్తున్న ప్రజాదర ణకు ఓర్వలేని ప్రతిపక్ష నేత ఆయన ప్రభుత్వానికి ఎన్నో అడ్డంకులను కల్పించాడు. తప్పుడు ప్రచారాలు చేయించాడు. రాజధానుల విషయంలో అడ్డుపడ్డాడు. అయినా ప్రజాతీర్పు మరోసారి జగన్‌కు జైకొట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఘన విజయాన్ని స్థానిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి  ప్రజలు ఇచ్చిన ధ్రువపత్రం. ఇది జగన్‌ పాలనకు జనం పెట్టిన కిరీటం.

‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలాయ’న్న సామెత ఎందుకు పుట్టిందోగానీ సరిగ్గా అదే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా నెలకొన్నది. ఈ పరిణామం రెండు విధా లుగా ఆవిష్కారమైంది. రాష్ట్రంలో యువకిశోరంగా అవతరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘అవినీతి చక్రవర్తి’గా పేరు స్థిరపడిపోయిన ‘తెలుగుదేశం’ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును తిరిగి తలెత్తు కోకుండా చేసింది. ఆ పార్టీని 23 స్థానాలకు కుదించివేసి 151 స్థానా లతో అప్రతిహతమైన మెజారిటీతో చరిత్రలో నిలిచిపోయింది. కాగా, ఆ దరిమిలా ఇటీవల కాలంలో ఇంకా జగన్‌ తొలి పాలనకు పట్టుమని రెండేళ్లు కూడా ముగియకముందే స్థానిక సంస్థల (పంచాయతీ, ముని సిపల్, కార్పొరేషన్‌) ఎన్నికలు ముమ్మరించాయి. 

ఫలించని జిత్తులు
2019 ఎన్నికల్లో మట్టికరిసిన తెదేపా నాయకుడు అంతకు ముందు ‘జక్కాయి బుక్కాయి’ని కలుపుకుని తెదేపా ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వెలగబెట్టిన ‘తీరు’ దాచినా దాగని సత్యం. తన ప్రభుత్వం అస్తుబిస్తు మెజారిటీతో నడుస్తోందని బెంగపడిన బాబు తలపెట్టిన దుర్మార్గం– అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్‌సీపీలోని 23 మంది ఎమ్మెల్యేలను సంతలోని పశువుల్లా కొనేసి తన ‘వాపును బలుపు’గా చూపేందుకు నానా తంటాలు పడటం! అయినా తీరా 2019 ఎన్ని కలు వచ్చేసరికి సరిగ్గా ఆ 23 మంది ‘సత్తరకాయలే’ సంఖ్యాపరంగా సరికొత్త అసెంబ్లీలో టీడీపీకి మిగిలిన మొత్తం సంఖ్యాబలం అయింది. 

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో తాజా స్థానిక ఎన్నికలను అవకాశంగా చూసుకుని తన హయాంలో బ్యూరోక్రాట్‌గా సేవలందించిన నిమ్మ గడ్డ రమేష్‌ కుమార్‌ అండదండలతో స్థానిక ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయడానికి బాబు వినియోగించని తప్పుడు పద్ధతులు లేవు. ఆ బ్యూరోక్రాట్‌ ఆధారంగా ఎన్నో తప్పుడు మార్గాల ద్వారా న్యాయవ్యవస్థను కూడా పక్కదారులు పట్టించడానికి సవాలక్ష ‘చిట్కాలు’ బాబు పన్నాడు. నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనే అధికారి, కేవలం అధికారేగానీ రాజకీయ పార్టీలకు లేదా పూర్వా శ్రమంలో పాలకులనుంచి లబ్ధి పొందినందుకు ‘ముదరాగా’ ప్రజా క్షేత్రంలో అఖండ విజయం సాధించిన పార్టీ ప్రభుత్వ నిర్వహణకు, దాని నిర్ణయాలకు అడుగడుగునా ఏదో ఒక మిషపై ‘మోకాలడ్డి’ ప్రతిపక్ష నాయకుడి ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చడం ఆయన విధి కాదు.

ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవాలలో జరిగిన పరిణామాల దృష్ట్యా జస్టిస్‌ రోహిన్టన్‌ ఎఫ్‌ నారిమన్‌ అధ్యక్షతన ఉన్న త్రిసభ్య ధర్మాసనం, పక్కదారులు తొక్కే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ‘మాడు పగిలిపోయే’ తీర్పుచెప్పింది (10–3–21). ‘రాజ్యాంగ ఆదేశం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పని నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని’ చెబుతూనే, అసలు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లుగా నిరంకుశాధికారులను గాక, స్వతంత్రంగా వ్యవహరించే శక్తిగల వ్యక్తులను మాత్రమే నియమించాలని గోవా ప్రభుత్వ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశిం చవలసి వచ్చింది. ఇది పాలకులకు, బ్యూరోక్రాట్లకు మరవరాని హెచ్చరికే. ప్రభుత్వ బ్యూరో క్రాట్లను (ఉద్యోగులు) రాష్ట్రాల ఎలక్షన్‌ కమిషనర్లుగా నియమించడ మంటే అది ‘రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే’నని సుప్రీం ఘాటుగా అభివర్ణించింది.

దేశవ్యాప్తంగానేగాక రాష్ట్రాలలో కూడా నియమించే ఎలక్షన్‌ కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా మాత్రమే ఉండాలని సుప్రీం ఆదేశించవలసి వచ్చింది. ఎవరైతే, ఎక్కడైతే ప్రభుత్వ అధికారులు (ఉద్యోగులు) ఎన్నికల కమిషనర్లుగా అదనపు చార్జీలో ఉంటున్నారో వారంతా ఆ పదవుల నుంచి తప్పుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభు త్వంలో బ్యూరోక్రాట్లుగా పనిచేస్తున్న వారు అదనపు చార్జ్‌గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించడం ‘చిరాకెత్తించే’ వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. ఈ సుప్రీం ఆదేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బాబు హయాంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించడానికి అనర్హుడని స్పష్టమవుతోంది.

జీర్ణంకాని ఓటమి పరంపర
అయినా, 2021 మార్చి 31తో ముగియనున్న నిమ్మగడ్డ పదవీ కాలా నికంటే ఎనిమిది మాసాల ముందునుంచీ చంద్రబాబు రహస్య మంతనాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అఖండ మెజారిటీతో ఎన్నుకుని బాధ్యతలు అప్పగించిన జగన్‌ ప్రభుత్వానికి అడుగడు గునా అడ్డంకులు కలిగిస్తూ తప్పుడు నిర్ణయాలకు తెరలేపుతూ వచ్చారు. అయినా ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వేల కిలో మీటర్ల పర్యంతం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కోట్లాదిమంది ప్రజల్ని కలుసుకుని, వారి బాధలు, బాదరబందీలు, వారి ఇక్కట్లు, అవసరాలను స్వయంగా తెలుసుకుని, తను చలించిపోయి, ప్రజా బాహుళ్యాన్ని చలింపజేసిన జగన్‌ అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఘన విజయాన్ని స్థానిక ఎన్నికలలో వ్యవస్థాపించగలిగారు. ఈ సంద ర్భంగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి మధ్య వివక్ష లేకుండా చేయడానికి పరిపాలనా వ్యవస్థను మూడు ప్రాంతాల మధ్య వికేంద్రీకరించడానికి జగన్‌ ఏ నాయకునికన్నా అత్యంత దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి, ఆలస్యమైనా మూడు ప్రాంతాల ప్రజా బాహుళ్యం హర్షించి స్థానిక ఎన్నికల ద్వారా తిరుగులేని తీర్పు ప్రక టించారని మరవరాదు. ఇది ప్రతిపక్షాలకు ముఖ్యంగా ‘తెలుగు దేశం పార్టీ’కి, తమ ఉనికిని కాపాడుకో ప్రయత్నించిన బీజేపీ, జనసేన పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన అవమానకర ఓటమికి మించి మరపురాని, మరవలేని ఓటమి పరంపర!

సంస్కరణవాద ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ప్రజాస్పం దనకు దీటుగా ‘నవరత్నాల’తో 90 వంతులు  సంస్కరణలు ఆచరణ సాధ్యంచేసి ప్రజల మన్ననలు పొందుతున్నా బాబుకు చెవులు మూసుకుపోయాయి. ‘పీటీ మన్ను’ అంటి నేలకరచుకున్నా ప్రజా తీర్పును మన్నించలేకపోతున్నాడు. ఇప్పటికీ ఓటమిని భరించలేక పోతున్నాడు. తన పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొమ్ములు విరిగి చెల్లాచెదు రైనా– ఏం చూసుకునోగానీ ‘మనం ఇదే స్ఫూర్తితో పనిచేస్తే విజయం మనదే’ననీ ముఖాముఖి ముచ్చటమాని టెక్నాలజీ ముసుగులో ‘ట్వీట్లు’ కొట్టుకుంటున్నాడు. ‘సమరం అంతా అయిపోయిన తర్వాత ఇక కొందరు వామపక్ష సోదరులు ఆచరణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాల్ని ఎద్దేవా చేసినా ఎన్నికల అనంతరం మాత్రం ‘సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీని గెలిపించాయని కితాబివ్వడం విశేషం. ఎటుతిరిగీ టీడీపీ/బీజేపీ/జనసేనలు– ‘ఉన్న మద్దెల ఒకటే అయినా’ చేసేది లేక మూడు పార్టీలు సీట్లు మార్చుకుంటూ ‘చెరి కాసేపు వాయించుకోవడాని’కి అలవాటుపడ్డాయి. ఇక బాబు అంటారా, ‘ఓ’కు ఎన్ని వంకరలో అతని బుద్ధికీ అన్ని వంకరలు! కుక్క తోకను ఎవరైనా వంకర తీయగలరా? భూస్వామ్య–పెట్టుబడిదారీ కార్పొరేట్‌ వ్యవస్థల్లో కొన్ని పరిమితుల్లో పనిచేయవలసి వచ్చే ప్రజాస్వామ్య పక్షాలను, సంస్కరణవాద పక్షాలను కాపాడుకోక తప్పదు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు