దేవుడు బాబు: మరుగునపడిన స్వాతంత్య్రయోధుడు

23 Sep, 2021 09:08 IST|Sakshi

మహాత్మాగాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని,  జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. అలాంటి వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. ఆయన 12–8–1912న విశాఖపట్నంలో జన్మిం చారు. 1982 సెప్టెంబర్‌ 23న, తన 70వ ఏట కన్నుమూశారు.

1929లో గాంధీగారి  పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, అనగా తన 17వ ఏటనే, స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా పేరు గడించారు. తొలుత హార్బర్‌లో టైం ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు,  బ్రిటిష్‌ వాళ్ళు తయారు చేసిన గడియారం పెట్టుకుని పని చేయాలని, ఒక బ్రిటిష్‌ అధికారి చెప్పడంతో, అది నచ్చక తొలి రోజే రాజీనామా చేసేశారు.

వీరు చేసిన పలు సేవా కార్యక్రమాలు: పేదవారైన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టినప్పుడు కుల, మతాలకు అతీతంగా, వారివారి  కుటుంబ సభ్యులందరికీ, మూడుపూటలా, ఇంట్లో వండించి క్యారేజీలు పంపించేవారు, మందులు, బట్టలు, డబ్బు కూడా పంపించేవారు. గర్భిణీ స్త్రీలకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్‌ని ఇచ్చి, వాళ్ళని హాస్పిటల్‌లో దింపించేవారు. స్టోన్‌ హౌస్‌ అనే ఇల్లు కట్టించి, అందులో, 105 మంది పేద పిల్లలకి పెళ్లిళ్లు చేయించారని చెబుతుం టారు. ఎలాంటి ధనాశా లేకుండా, తన ఇంటి పక్క ఖాళీ స్థలం, ఉచి తంగా పేదవారికి ఇచ్చారు, నూకరాజు కార్ల రిపేర్‌ షెడ్,  దేవుడమ్మ టీ దుకాణం పెట్టుకుని ఇలాగే జీవనోపాధిని పొందారు. విశాఖలో పూడిపెద్ది సుందరరామయ్యను ‘దేవుడు బాబు’ అని పిలిచేవారు.

– ఉగాది వసంత, పూర్వ మేనేజర్,వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ‘ 98494 55367      
(నేడు పూడిపెద్ది సుందరరామయ్య వర్థంతి)


 

మరిన్ని వార్తలు