ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నామా?

14 Aug, 2021 01:17 IST|Sakshi

చరిత్రలోని అతి గొప్ప సంఘటనలన్నీ మౌనంలోంచే పుట్టుకొచ్చాయి. తిరిగి అవి నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒక శతాబ్దం క్రితం అంటే 1920–21లో జరిగిన, చరిత్రను మలుపుతిప్పిన అనేక ఘటనలను ఈ 2021 ఆగస్ట్‌ నెల మళ్లీ అందరికీ  గుర్తు చేస్తోంది. భారతీయ చరిత్రలోని ఆ విశిష్ట దశ అనేక ఘటనల కూర్పుతో నిండి ఉంది. వీటిలో కొన్నింటికి ఈనాటికీ ప్రాధాన్యం ఉండగా, మరికొన్ని తమ విశిష్టతను కోల్పోతున్నాయి. పైగా ఒక వైవిధ్యపూరితమైన సమాజంగా మనుగడ సాధించడం అనే భావనకు ఇప్పటికీ దేశం పూర్తిగా సిద్ధం కాలేదు.

అదే సంవత్సరం జమ్‌షెడ్‌పూర్‌లో టాటా స్టీల్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ స్థాపన భారతీయ పారిశ్రామిక నగరీకరణ శకం ప్రారంభాన్ని నిర్వచించింది. నాగరికతా సంస్కృతికి ఉక్కు వెన్నెముకగా ఉంటూ వస్తోంది. 1921లో కోహినూర్‌ ఫిల్మ్‌ కంపెనీ కోసం కనాజీభాయ్‌ రాథోడ్‌ తీసిన భక్త విదుర్‌ సినిమాపై నిషేధం ఎంత గొప్ప జ్ఞాపకంగా ఉంటోందో.. అదేరకంగా బాబూరావ్‌ పెయింటర్‌ తీసిన సురేఖా హరణ్‌ సినిమాలో వి. శాంతారాం కీలక పాత్ర పోషిస్తూ నటనా జీవితంలోకి అడుగుపెట్టడం కూడా మర్చిపోని జ్ఞాపకమే.. జాతి అనే చారిత్రక ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించడంలో, భారత్‌ అనే సామూహిక భావనలోంచి పుట్టుకొచ్చిన సెల్యులాయిడ్‌ స్వప్నాలను దేని తోనూ పోల్చి చూడలేం. జాతీయ ఆకాంక్షను ముందుకు తీసుకుపోవడానికి రెండు మూకీ చిత్రాలు కూడా ఆ సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఈ రెండు సినిమాలు ఏకకాలంలోనే దేశాన్ని అటు కాల్ప నికత వైపు, ఆధునికతవైపు తీసుకుపోయాయి. వీటికి మించిన గొప్ప ఘటన డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ తీసుకొచ్చిన ‘మూక్‌నాయక్‌’ పత్రిక. ప్రగతిశీలుడైన కొల్హాపూర్‌ రాజు సాహు అందించిన ఆర్థిక సహాయంతో ఈ ప్రచురణ వెలుగులోకి వచ్చింది. దళితులు రాసిన కథనాలను ప్రచురించడానికి ఆనాడు ప్రముఖ దినపత్రికలు ఏవీ సుముఖత చూపకపోవడంతో మూక్‌ నాయక్‌ ఒక ప్రత్యామ్నాయ మీడియాగా వచ్చింది. ఇది కొద్దికాలం మాత్రమే నడిచినా, అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి ఇది నాంది పలికింది.

నిశ్శబ్దంగా మొదలైన మరొక మూడు ఘటనలను కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. పరివర్తనా స్థలంగా ఆశ్రమ జీవితం అనే ప్రాచీన భారతీయ భావనను ఇవి వెలుగులోకి తీసుకొచ్చాయి. వేదకాలపు రుషులను మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ ముగ్గురు విశిష్ట వ్యక్తులను ప్రపంచం గురుదేవ్, మహాత్మా, మహర్షి అని గుర్తించింది. వారు ఎవరో కాదు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ (1861–1941), ఎం.కె. గాంధీ (1869–1947), అరబిందో ఘోష్‌ (1872–1950). వీరిలో చిన్నవాడు ఘోష్‌. 1947కి 75 సంవత్సరాల ముందు జన్మించిన ఘోష్‌ బెంగాల్‌ విభజన తర్వాత బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజద్రోహ ఆరోపణలకు గురై సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అనంతరం భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వచిం చడం వైపుగా తన శక్తియుక్తులను మళ్లించారు.

పాండిచ్చేరికి తరలి వెళ్లాక, సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతూ అసమాన శక్తితో వ్యాసాలు రాశారు. ఉనికిలో ఉన్న ప్రతి సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూ అతిగొప్ప తాత్విక రచనలను సృష్టిం చారు. ఆయన వ్యాసాలు తొలుత తాను ప్రారంభించిన ‘ఆర్య’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ది డివైన్‌ లైఫ్, ది సింథసిస్‌ ఆఫ్‌ యోగా, ఎస్సేస్‌ ఆన్‌ ది గీతా, ది సీక్రెట్స్‌ ఆఫ్‌ ది వేదా, హైమ్స్‌ టు ది మిస్టిక్‌ ఫైర్, ది రినైజాన్స్‌ ఆఫ్‌ ఇండియా, ది హ్యూమన్‌ సైకిల్‌ అండ్‌ ఫ్యూచర్‌ పోయెట్రీ వంటి పుస్తకాలు రాసి ప్రచురించారు. తన తాత్విక రచనా కృషి అద్భుతంగా కొనసాగుతుండగా 1920లో ఘోష్, ఆర్య పత్రిక ప్రచురణను నిలిపివేశారు. ఉత్కృష్టమైన ధ్యాన యోగ మహాకావ్యం ‘సావిత్రి’పై కేంద్రీకరించేందుకు తన రచనా కృషిని మొత్తంగా నిలిపివేశారు. తర్వాత మూడు దశాబ్దాల తన జీవితాన్ని మానవ జాతి మహా పరివర్తన కోసం, తన యోగ కృషి ద్వారా భూమ్మీదికి అత్యున్నత చైతన్యాన్ని తీసుకు రావడానికి అంకితం చేశారు.

ఈ త్రిమూర్తులలో పెద్దవాడైన రవీంద్రనాథ్‌ టాగూర్‌ 1921 నాటికి నోబెల్‌ అవార్డు కూడా పొందారు. ప్రపంచమంతటా రుషిలాగా కీర్తిపొందిన టాగూర్‌ 1921లోనే విశ్వభారతి విద్యా సంస్థను ప్రారంభించారు. విశ్వమానవ భావనను పెంపొందించే లక్ష్యంతో నేర్చుకునే, సృజనాత్మక కృషిని సాగించే మౌలిక సంస్థ విశ్వభారతి. ఘోష్‌ లాగే టాగూర్‌ కూడా ఒక వర్గం మనుషులకోసం, ఒకే జాతి కోసం కాకుండా యావత్‌ ప్రపంచాన్ని పరిరక్షించేందుకోసం జీవి తాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. అయితే గాంధీ ప్రయత్నిం చిన ఆత్మ పరివర్తన మరింత మౌలికమైనది. 1920 ఆగస్టులో తిలక్‌ మృతితో లాల్‌ బాల్‌ పాల్‌ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్‌ తిలక్, బిపిన్‌ చంద్ర పాల్‌) శకం ముగిసిపోయింది. ఆ శూన్యంలోకి ఎం.కె. గాంధీ ఒక శతఘ్నిలా దూసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి కాంగ్రెస్‌లోని వేరువేరు బృందాలను ఒకటి చేశారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులను భాగం చేసి సేవా దళ్‌ ఏర్పర్చి జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో యువతకు ప్రేరణగా నిలిచారు. 1920 అక్టోబర్‌లో గాంధీ గుజరాత్‌ విద్యాపీఠాన్ని నెలకొల్పారు. ఇది కమ్యూనిటీ శ్రమజీవుల విశ్వవిద్యాలయం. ఇక 1921 డిసెంబర్‌లో కలకత్తా సమావేశాల్లో కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతను చేపట్టారు.

తర్వాత జరిగిందంతా చరిత్రే. భారత్‌లో గాంధీ ఆశ్రమం తొలి సంవత్సరాలు సాదాసీదాగా మొదలయ్యాయి. ప్రారంభంలో కొచార్బ్‌లో ఒక ఆశ్రమాన్ని ఏర్పర్చారు. తర్వాత అహ్మదాబాద్‌ నగరానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డుకు దాన్ని మార్చారు. మొదట్లో దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు. నది ఒడ్డున ఏర్పర్చిన ఈ ఆశ్రమం తర్వాత సబర్మతి ఆశ్రమంగా పేరొందింది. ఒక దశాబ్దం తర్వాత దండికి మహాత్ముడు తలపెట్టిన పాదయాత్ర బ్రిటిష్‌ సామ్రాజ్య పునాదులను కదలించివేసింది. సబర్మతి ఆశ్రమ వాతావరణం, అక్కడ పాటించిన సిద్ధాంతాలు, నిరాడంబరత్వానికి మహా త్ముడి జీవితమే కీలక శక్తిగా పనిచేసింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నా లేదా విస్మరించినా సరే ఈ మూడు ఆశ్రమాల విశిష్ట గాథలు భారత చరిత్రలోనే అత్యంత కీలక అంశాలుగా ఉంటున్నాయి.

అయితే 2021లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మార్చడం రూపంలో అది పెను ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. దీని కోసం ప్రభుత్వం రూ. 1200 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో వివాదాస్పదమైన సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని చేపట్టిన సంస్థే సబర్మతి ఆశ్రమ శిబిరాన్ని ఆధునీకరించే బాధ్యతలు చేపట్టింది. గాంధీ అసాధారణమైన నిరాడంబరత్వం ద్వారానే ప్రపంచంలోనే అత్యంత విశిష్టమూర్తిగా నిలిచి ఉంటున్నారు. ఆయన నిర్మించిన ఆశ్రమం వద్ద ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన వీఐపీ గెస్ట్‌ హౌస్, ఆడిటోరియం వంటివి గాంధీని, ఆయన నిరాడంబరత్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. సబర్మతి ఆశ్రమ ఆధునీకరణ పథకాలు గాంధీ ఆదర్శాలను గుర్తుకు తీసుకురావడం కాకుండా వాటిని అందరూ మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వాతంత్య్ర పోరాటాన్ని, టాగూర్‌ ప్రవచించిన బౌద్ధిక స్వాతంత్య్రాన్ని, అరబిందో ఘోష్‌ దార్శనికత ప్రబోధించిన ఆధ్యాత్మిక స్వాతంత్య్రాన్ని మొత్తంగా మర్చిపోవాలంటూ తన సమాచార ఫ్యాక్టరీల ద్వారా మనకు చెప్పడంలో క్షణం తీరిక లేకుండా ఉంటున్న ప్రస్తుత పాలనా వ్యవస్థ నుంచి ఇంతకు మించి మనం ఆశించేది ఏమీ ఉండదు.

జీఎన్‌ డెవీ
వ్యాసకర్త సాహితీ విమర్శకుడు, సాంస్కృతిక కార్యకర్త

మరిన్ని వార్తలు