అణగారిన వర్గాల ఆశాజ్యోతి

11 Apr, 2021 03:46 IST|Sakshi

సందర్భం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి.

భారతదేశ గతిని ఉన్నతి వైపు తిప్పిన మహాను భావులు ఎందరో. అలాం టివాళ్లకు మనం రుణపడి ఉండాలి. అలాంటివారిలో ఒకరు జ్యోతిరావు ఫూలే. భార్య సావిత్రి బాయితో కలిసి ఆయన స్త్రీవిద్యకు మార్గదర్శిగా నిలిచారు. 1827 ఏప్రిల్‌ 11న జన్మించిన నాటి నుంచి, 1890 నవంబర్‌ 28న తుదిశ్వాస విడిచే వరకూ ఫూలే అవి శ్రాంతంగా సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తల్లి చిమ్నాబాయి మరణించింది. మాలి కులానికి చెందిన అబ్బాయి కావడం వల్ల పైకులాల వాళ్ల లాగా చదువు కోసం కలలుగనే అవకాశాలు లేకపోవడం, తమ కులంలో కూడా చదువు అనేదానికి అంతగా ప్రాధాన్యత లేకపోవడంవల్ల వాళ్ల తండ్రి ఆయన్ని బడి మాన్పిం చాడు. అయితే వాళ్ల కులంలోంచి క్రిస్టియన్‌గా మారిన ఒకాయన చొరవతో స్థానిక స్కాటిష్‌ మిషన్‌ హైస్కూల్లో చదవగలిగాడు.

జ్యోతిరావు ఫూలే ఏడాది వయసులో ఉన్నప్పుడు తల్లి చిమనాబాయి కన్నుమూసింది. దిగువ కులానికి చెందిన పిల్లవాడు అగ్రకుల పిల్లల్లాగా చదువు పట్ల ఆకాంక్ష ఉంచుకోవడం కష్టం.. పైగా విద్య ఫూలే కులానికి ప్రాధమ్యం కాదు. దీంతో ఫూలే పాఠశాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ వీరి కులం నుంచి క్రిస్టియన్‌గా మారిన ఒక వ్యక్తి స్థానికంగా ఉండే స్కాటిష్‌ మిషన్‌ స్కూల్‌లో పూలేని చేర్పించాలని జ్యోతిరావు తండ్రికి నచ్చచెప్పడంతో తర్వాత పూలే 1847 నాటికి తన ఇంగ్లిష్‌ పాఠశాల చదువును పూర్తి చేశాడు. 

1848లో ఒక బ్రాహ్మణ స్నేహితుడి వివాహా నికి హాజరైనప్పుడు అతడి తల్లిదండ్రుల నుంచి ఎదురైన అవమానం ఫూలేలో కులాల అసమానత మీద గట్టి పోరాటం చేయాలన్న సంకల్పాన్ని కలి గించింది. అదే సంవత్సరం క్రైస్తవ మిషనరీలు అహ్మద్‌నగర్‌(మహారాష్ట్ర)లో నడుపుతున్న బాలికల పాఠశాలను చూడటమూ, థామస్‌ పెయిన్‌ రాసిన ‘రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌’ పుస్తకం చదవడమూ దోపిడీకి గురవుతున్న వర్గాల దాస్యవిమోచనకు విద్య అనే దాన్ని మహత్తర శక్తిగా గుర్తించేట్టు చేసింది. ఆ రోజుల్లో బాల్యవివాహాల సంప్రదాయం ఉండ టంతో ఆయనకు పదమూడేళ్లకే సావిత్రిబాయితో పెళ్లయింది. దాంతో ముందుగా భార్యకు చదవడం, రాయడం నేర్పి, అనంతరం బాలికల కోసం ఆమెతో కలిసి బడిని ప్రారంభించాడు. ఆ దంప తుల ఆధ్వర్యంలో 1852లో 273 మంది బాలిక లతో మూడు పాఠశాలలు నడుస్తుండేవి.

స్త్రీవిద్యతో పాటు వితంతు పునర్వివాహాన్ని ఫూలే సమర్థించాడు. పైకులాల వితంతు మహిళలు సురక్షితంగా ప్రసవించేందుకు వీలుగా 1863లో ఆశ్రమం నెలకొల్పాడు. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భం దాల్చడం, ప్రసవించిన శిశువును ఆమె బావిలో తోయడం, అటుపై పట్టుబడి ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో చలించిన ఫూలే, ‘వితంతువులారా, మీ శిశువులను ఇక్కడ సురక్షితంగా ప్రసవించండి. ఆ శిశువును మీరు పెంచుకుంటారా మీ ఇష్టం, లేదంటే ఆశ్ర మమే పెంచుతుంది’ అని ప్రకటన ఇచ్చాడు.

బ్రాహ్మణుడు లేకుండా పెళ్లి చేసే పద్ధతిని కూడా జ్యోతిబా ప్రారంభించాడు. దాన్ని ముంబై హైకోర్టు కూడా గుర్తించింది. నిమ్నకులాల కోసం తమ మంచినీటి బావిని వాడుకోనివ్వడంతోపాటు, అణగారిన వర్గాలను సూచించడానికి మరాఠీ పదమైన దళిత పదాన్ని మొదటిసారి ఆయనే ప్రయోగించాడు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 2003లో పార్లమెంట్‌ ప్రాంగణంలో ఫూలే విగ్ర హాన్ని ఆవిష్కరించడంతో ఆయన సేవలను గుర్తించినట్టయింది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ పూచీ ఉండటంతో ఎస్సీలు, ఎస్టీల హక్కుల పరిరక్షణ జరిగిన మాట వాస్తవం. కానీ అదే మాట ఇతర వెనుకబడిన కులాలైన ఓబీసీల విషయంలో చెప్పలేము. మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడం వారి అభ్యున్నతి విష యంలో చిన్న అడుగు మాత్రమే. వారికి కేటా యించిన వాటిల్లో చాలా బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి, ముఖ్యంగా ఏ, బీ గ్రూపుల్లో. ఓబీసీల్లోని నిరుపేదల ఎదుగుదల కోసం సమగ్ర విధానం అవసరం. ఓబీసీల్లో ఉప వర్గీకరణ పంపకాల్లోని అసమానతలను పరిశీలించ డానికి 2017లో బీజేపీ ప్రభుత్వం జస్టిస్‌ రోహిణి కమిషన్‌ ఏర్పాటు చేసింది. 2014లో ఓబీసీల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌ హోదాలో నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. వివిధ ఓబీసీ బృందాలతో సంభాషించాను. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలనేది అప్పుడు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అది ప్రసాదించడం, ఆ చారిత్రక ఘట్టంలో నేనూ భాగంకావడం నేను గర్వించే విషయం.

అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. నిరుపేద ఓబీసీల కోసం మోడల్‌ స్కూళ్లు ప్రారంభించడం, అత్యున్నత సంస్థల నుంచి వారు చదివే వీలు కల్పించేలా స్కాలర్‌షిప్పులు ఇవ్వడం, సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్వ విపణికి అనుసంధానం చేయడం, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన సాంకే తిక పరిష్కారాలను వెతకడం, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు అందేలా చూడటం లాంటివి అత్యవసరం. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. సామాజిక ఐక్యత, వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం ఫూలే స్థాపించిన సత్య శోధక్‌ సమాజ్‌ లాంటి ఎన్నో సంస్థలు పని చేయాల్సిన అవసరం ఉంది.

బండారు దత్తాత్రేయ 
వ్యాసకర్త హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌
(నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే 194వ జయంతి)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు