ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు

17 Sep, 2022 16:43 IST|Sakshi

ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది.

ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్‌ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట.

సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి  ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. 

ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్‌కంటాక్స్‌ పేయర్స్‌ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట.  ఈ కార్పొరేట్‌ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్‌ శక్తులకు, ఇన్‌కంటాక్స్‌ పేయర్స్‌కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు)

ఇంతకీ కార్పొరేట్‌ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్‌ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్‌మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?)


- డాక్టర్‌ కాలువ మల్లయ్య 
ప్రముఖ కథారచయిత, విమర్శకులు

మరిన్ని వార్తలు