ఈ విజయం.. విశ్వసనీయతకు చిహ్నం

5 May, 2021 00:12 IST|Sakshi

విశ్లేషణ

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంతకు తగ్గించగలిగితే, ప్రజలలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని వారనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. మతపరంగా రాజకీయాలు చేయడానికి, అసందర్భ ఆరోపణలు చేయడానికి టీడీపీ పూనుకున్నా.. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ శ్రేయస్సుకోసం పనిచేస్తున్న పార్టీపై, దాని అధినేతపై ఏపీ ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి ఈ విజయం తిరుగులేని సంకేతం.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిందా? లేదా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాను ఓడిపోయినా, వైసీపీకి ఐదు లక్షల మెజార్టీ రాలేదని సంతోషపడుతున్నట్లుగా ఉంది. సీఎం జగన్‌ రెండేళ్ల పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా కూడా ఈ ఉపఎన్నిక ఫలితాన్ని తీసుకోవచ్చు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎప్పుడూ ఐదు లక్షల మెజార్టీతో ఎవరూ గెలవలేదు. కానీ  ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థ్దిగా పోటీచేసిన ఒక సాధారణ వైద్యుడు డాక్టర్‌ గురుమూర్తి గతంలో తిరుపతిలో ఎన్నడూ లేనంత మెజార్టీతో విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఈ ఉపఎన్నికతో సహా మొత్తం పదిహేడుసార్లు ఎన్నికలు జరిగితే ఈసారే అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఉంది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు 2.28 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. అంతకుముందు జరిగిన ఎన్నికల కన్నా అదే అత్యధికం. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో అంతకన్నా ఎక్కువగా 2.70 లక్షల ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్‌ సీపీ గెలిచింది. అంటే సగటున ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో నలభై వేల ఓట్ల ఆధిక్యత వచ్చిందన్నమాట. అంతేకాదు. ఓట్ల శాతాలను పరిగణనలోకి తీసుకున్నా గతంలో వైఎస్సార్‌ సీపీకి ఏభై శాతం లోపు మెజార్టీ రాగా, ఈసారి ఏభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఆరు శాతం పెరిగాయన్నమాట. మరి అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ గత లోక్‌సభ ఎన్నికలలో 37 శాతం ఓట్లు సాధించగా, ఈ ఉపఎన్నికలో 32 శాతం ఓట్లనే తెచ్చుకుంది. నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ గెలిచినా మెజార్టీతో పాటు ఓట్లశాతం తగ్గుతుంది. అలాగే ప్రతిపక్షం గట్టి పోటీఇస్తే దాని ఓట్ల శాతం పెరుగుతుంది. కాని ఇక్కడ రివర్స్‌లో జరిగింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా కవర్‌ చేసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ నేతలు చెప్పినంతగా మెజార్టీ రాలేదని సంతోషపడవచ్చు. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం లేదు.కాకపోతే తన వర్గం మీడియాలో టీడీపీ ఓటమి గురించి కాకుండా వైఎస్సార్‌ సీపీ మెజార్టీ గురించి మాట్లాడుకునేలా చేయాలన్న ఎత్తుగడలు కావచ్చు. 

1991లో కర్నూలు లోక్‌సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డికి 54 వేల పైచిలుకు ఓట్లు వస్తే, ఆయన ఉమ్మడి ఏపీ సీఎం అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1993లో ఆ స్థానంలోనే పోటీ చేసిన కోట్ల తనయుడు సూర్యప్రకాశ్‌ రెడ్డి కేవలం 20 వేల లోపు మెజార్టీతో గెలిచారు. నాటి అధికార పార్టీపై వ్యతిరేకతకు అది గుర్తు. కానీ తిరుపతి లోక్‌సభ స్థానానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో కన్నా ఇప్పుడు ఏభైవేలకు పైగా ఓట్ల మెజార్టీ పెరిగింది.

కాగా తిరుపతిలో ఆరుసార్లు గెలిచి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన చింతా మోహన్‌కు ఈ ఉప ఎన్నికలో పదివేల ఓట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా వచ్చాయి. ఇక బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థ్ధిగా వచ్చిన కర్ణాటక మాజీ ఛీ‹ఫ్‌ సెక్రటరీ రత్నప్రభ సుమారు అరవై వేల ఓట్లు పొంది డిపాజిట్‌ కోల్పోయారు. నిజానికి ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సామాజికవర్గానికి చెందినవారు కానీ, ఆయన అభిమానులు కానీ గణనీయంగానే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ పార్టీ రీత్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఆయన మనసు మాత్రం చంద్రబాబు వైపే ఉందన్నది ఎక్కువ మంది భావన. దానికి తగ్గట్లుగానే జనసేన అభిమానులు కొంత శాతం మంది టీడీపీకి వేసి ఉండవచ్చు. అందువల్లే టీడీపీకి ఆ మాత్రం ఓట్లు అయినా వచ్చాయని మరో విశ్లేషణ కూడా లేకపోలేదు. చీఫ్‌ సెక్రటరీ హోదాలో పనిచేసిన రత్నప్రభను బీజేపీ పక్షాన రంగంలో దించి ఆమెను కూడా రాజకీయంగా బలిచేసినట్లయింది. సునీల్‌ దేవ్‌ధర్‌ వంటివారు మతపరంగా వైషమ్యాలు పెంచేందుకు ఇక్కడ ప్రయత్నం చేసినా ప్రజలు తగురీతిలో జవాబు ఇచ్చారు. ఏíపీలో  వ్యూహాత్మకంగా బీజేపీ ఇంకా పరిణితి చెందలేదని ఈ ఉప ఎన్నిక స్పష్టం చేసింది.

ఇక తెలుగుదేశం పార్టీ గురించి పరిశీలిస్తే గతంలో కన్నా తక్కువ శాతం ఓట్లు రావడం ఆ పార్టీ ఇంకా కష్టాల నుంచి బయటపడలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మొదటి నుంచి అనాసక్తిగానే ఉన్నారు. అయినా టీడీపీ ఒత్తిడితో మళ్లీ రంగంలో దిగారు. ఆమెకు ఈ సీటులో గెలవడం అసాధ్యమన్న సంగతి తెలియకకాదు. కానీ ఎన్నికల వ్యయం అంతా పార్టీ నాయకత్వం పెట్టుకునే కండిషన్‌తో పోటీకి ఒప్పుకున్నారని అంటున్నారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు కూడా వైఎస్సార్‌ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంత, ముఖ్యంగా 2019 నాటి మెజార్టీ కన్నా తగ్గించగలిగితే, ప్రజ లలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. టీడీపీ కూడా మతపరంగా రాజకీయాలు చేయడానికి, పలురకాల పిచ్చి ఆరోపణలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడలేదు. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. అయినా టీడీపీ తన వైఖరి మార్చుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడానికి సిద్ధపడుతున్నట్లుగా లేదు. కేవలం ఒక విధ్వంసకర పాత్ర పోషిస్తూ, మీడియాపరంగా మాత్రం ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతోంది. టీడీపీ ధోరణి ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీని ఎదుర్కోవడం కష్టమేనని చెప్పవచ్చు. నాయకత్వ స్థాయిలో టీడీపీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ముందుగా దాని నుంచి అది బయటపడవలసి ఉంది.

ఉప ఎన్నికలలో ఓట్ల కొనుగోలు, మద్యం పంపిణీ వంటివి చేయరాదని పార్టీ నేతలకు జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి తోడు కరోనా సమస్య ప్రజలను భయపెట్టింది. ఈ కారణాల వల్ల ఉప ఎన్నికలో పోల్‌ అయిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. కానీ గతంలోకంటే ఈసారి అధిక మెజార్టీ సాధించడం ఆ పార్టీకి సంతోషం కలిగించే అంశమే. అంతేకాక జగన్‌ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార సభ నిర్వహించాలని అనుకున్నా, కరోనా పరిస్థితిలో తాను సభ పెడితే, పెద్ద సంఖ్యలో జనం వస్తే, కరోనా కేసులు పెరగవచ్చని ఆయన భావించి సభను రద్దు చేసుకున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. 

ఏతావాతా ఏభై ఆరు శాతం ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ గెలవడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడం, వలంటీర్ల వ్యవస్థ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పరిపాలనను అందించడం, వృద్ధాప్య పెన్షన్‌లు ఇంటి వద్దే ఇవ్వడం, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీములు పేదలకు బాగా ఉపయోగపడటం, కరోనా సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో లాక్‌డౌన్‌లతో ప్రజల ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు జగన్‌ చేసిన ఆర్థ్దిక సాయం పేదలకు కొండంత భరోసా ఇచ్చింది. ఇలాంటి పలు కారణాల వల్ల జగన్‌ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం వైఎస్‌ జగన్‌పై ఉన్నవి, లేనివి అసత్య ప్రచారం చేసినా ఆయనను జనం నమ్మడం లేదని కూడా రుజువు అయింది. ఏది ఏమైనా తనకు వచ్చిన మెజార్టీతో సంతృప్తి చెందక వైíసీపీ మరింత గట్టిగా పనిచేయవలసి ఉండగా, టీడీపీ ఇంతవరకు కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకోడానికి తంటాలు పడాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు విశ్వసనీయత కన్నా, వేరే అంశాలకే ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ఆయనను జనం నమ్మరు. అదే సమయంలో జగన్‌ విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడడం ఆయనకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పాలి.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు