తెలుగువారి ‘బంగారు కొండలరావు’

29 Jul, 2020 00:41 IST|Sakshi

నివాళి
నటులుగా, నాటక ప్రయో క్తగా, రచయితగా ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు వారిని రంజింప చేసిన ఆత్మీయులు రావి కొండల రావుగారు ప్రపంచ రంగ స్థలం మీదినుంచి నిష్క్ర మించారన్న వార్త ఎంతో బాధను కలిస్తున్నది. కొండలరావుగారితో యాభై ఏళ్లు పైబడిన సాన్నిహిత్యం నాది. హితులుగా వయసుతో నిమిత్తం లేకుండా స్నేహితులుగా ఆయన చెలిమి కలిమి నా అదృష్టం. నేను విద్యార్థిగా ఉంటున్న రోజుల నుంచీ ఆయ నకు నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయనను అడపా దడపా మద్రాసు వడపళనిలోని చంద మామ కార్యాలయంలో కలుసుకొంటూ ఉండే వాణ్ణి. అప్పుడు ఆయన ‘విజయచిత్ర సంపాదక వర్గం’లో పనిచేస్తూ ఉండేవారు.

1975లో ‘వనిత’ పత్రిక ప్రారంభించినపుడు ఆ సంపాదక వర్గంలో పనిచేయడానికి నన్ను ఎన్ను కొన్నారు. దాంతో కొండలరావుగారితో మిత్రులు బి.కె. ఈశ్వర్‌గారితోనూ కలిసి ‘వనిత’ ‘విజయ చిత్ర’ పత్రికల పనిలో నేను భాగస్వామినయ్యాను. అటు సినిమాలో నటిస్తూ ఇటు పత్రికల్లో పనిచేస్తూ ఆ రెండు పాత్రలనూ విజయవంతంగా నిర్వహిం చేవారు. ‘వనిత’ కోసం ‘బామ్మగారి పేజీ’ ఆయనే రాసేవారు. ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన రక రకాల రచనా విన్యాసాలు చేశారు. సంపాదకీ యాలు, పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు, ప్రము ఖులతో సంభాషణలు, సంగీతానికి సంబంధించిన ‘స్వరధుని’ వ్యాసాలు ఇవన్నీ ఒక  పార్శ్వమయితే, నాగయ్యగారి జీవిత చరిత్ర. పాత తెలుగు చిత్రా లను వాటిని చూస్తున్న అనుభూతి కలిగించేటట్టు సాగిన సమగ్ర చిత్ర రచనలు మరొక పార్శ్వం. ‘విజయచిత్ర’లో ప్రాచుర్యం గడించిన ‘విచి’ (విజయచిత్రకు కురచ రూపం) కొండల రావుగారే!

నేను ‘చందమామ’ నుంచి ‘ఆకాశవాణి’ ఉద్యోగంలో చేరినా కొండలరావుగారి కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగింది. నేను మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు నాటకాల విభా గాన్ని నిర్వహిస్తున్నప్పుడు కొండలరావుగారు, రాధాకుమారిగారు ఎన్నో నాటకాలలో పాల్గొ న్నారు. రేడియోకోసం ఎన్నో నాటకాలు రాయిం చడం కూడా మరచిపోలేని మధురానుభూతి. అట్లా ఆయన రాసి రేడియోకోసం నేను రూపొందించిన ‘ఉద్యోగమే మహాభాగ్యం’ నాటకం కథతో ఆ తర్వాత ‘పెళ్లిపుస్తకం’ చిత్రం రూపొందింది.

మహానటి సూర్యకాంతంగారు నటించిన చివరి రేడియోనాటకం ‘వంటమనిషి కావలెను’ కొండలరావుగారి రచన. మహాభారత కథతో రూపొందించిన ఇంకొక రేడియో నాటకంలో ఆయన దుర్యోధనుడి పాత్ర, (ఇంకెవరూ లేక పోవడంతో) నేను శకుని పాత్ర ధరించాము.  ‘అర్ధ రాత్రి’ సినిమా తర్వాత మళ్లీ ఈ నాటకంలో ప్రతి నాయకుడి (విలన్‌) పాత్ర ధరించే అవకాశం వచ్చింది అని చమత్కరించారు కొండలరావుగారు!

మద్రాసులోనే కాక హైదరాబాదులోనూ ఆకా శవాణి నిర్వహించిన ఉగాది కార్యక్రమాలు ఎన్నిటి లోనూ పాల్గొని వాటి వన్నెనూ వాసినీ పెంచారు కొండలరావుగారు. ఎప్పుడు రంగస్థలం ఎక్కినా అదే తమ మొదటి ప్రదర్శన అన్నంత శ్రద్ధాభక్తులు చూపడం ఆయన ప్రత్యేకత! కొండలరావుగారి రాసిన ఎన్నెన్నో నాటకాలు ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరిట వచ్చిన వ్యాసాలు, మాయాబజార్, షావు కారు చిత్రాలకు సంబంధించిన సమగ్ర రచనలు, సినిమాలు ఎట్లా తీయాలో ఎట్లా తీయకూడదో వివరించిన ‘సినీతి చంద్రిక’ ఆయన చేతి వాసికి గొప్ప ఉదాహరణలు.

చిన్న వేషాలు వేసినా వాటిని చిరస్మరణీయం చేసిన ఆయన నటనా వైదుష్యానికి ‘కథా నాయకుడు’ ‘గృహలక్ష్మి’ ‘బ్రహ్మచారి’ వంటి చిత్రాల లోని వేషాలు మచ్చుతునకలు. నాటక రచయితగా, పత్రికా రచయితగా నటులుగా, నాటక ప్రయోక్తగా ఏ పని చేసినా రావి కొండల రావుగారు మనసు పెట్టి చేశారు. ఆయన కృషి అజరం. అమరం.

వ్యాసకర్త పూర్వ సంచాలకులు,
ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం
పి.ఎస్‌. గోపాలకృష్ణ
మొబైల్‌ : 94920 58970

మరిన్ని వార్తలు