గాంధీజీ హైదరాబాద్‌కు తొలిసారి ఎప్పుడొచ్చారో తెలుసా?

7 Apr, 2021 13:27 IST|Sakshi

హైదరాబాద్‌లో సుల్తాన్‌ బజార్‌లోని ఫ్రేం థియేటర్‌లో 1929 ఏప్రిల్‌ 7న మహాత్ముని గౌరవార్థం మహిళా సభను ఏర్పాటు చేశారు. మహాత్ముని తొలి హైదరాబాద్‌ పర్యటన 1929 ఏప్రిల్‌లో జరిగింది. కృష్ణస్వామి ముదిరాజ్‌ తన ఆంధ్ర వాలంటీర్‌ దళాన్ని వాడి స్టేషన్‌కు తీసుకువెళ్ళి మహాత్మునికి స్వాగతం పలికి నాంపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తరువాత ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. స్థానిక నాయకులైన వామన్‌ నాయక్, మాడపాటి హనుమంతరావు, మందుమల నరసింగారావు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయక్, రాజ్‌ బన్సీలాల్, ముకుంద్‌ దాస్‌ మొదలైన వారు వివేకవర్థినీ మైదానంలో మహాత్మునికి స్వాగతం పలికి తీసుకుపోయారు.

వామన్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో మహా త్ముని ప్రసంగం క్లుప్తంగా జరిగింది. ‘‘రాట్నం కామధేనువు. మన దేశానికది సకల వరప్రదాయిని. ఖద్దరు ఉత్పత్తికి హైదరాబాద్‌ రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని నాకు తెలిసింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సహాయ సహకారాలందించే స్థితిలో మీరున్నారు. ఇక్కడ మంచి నాణ్యత గల ఖాదీ ఉత్పత్తి అవుతుందని సరోజినీ నాయుడు నాకు చెప్పారు. నా మెడలో వేసిన నీలదండ హరిజనులు వడికినదని తెలుసుకొని నేనెంతో సంతోషపడ్డాను.

హిందూదేశం కన్నా దరిద్రదేశం మరొకటి లేదు. ఎందుకంటే మన దేశంలో రోజుకి ఒక్కపూటైనా అన్నం దొరకని వారి సంఖ్య మూడు కోట్ల మందికి పైగానే ఉంటుంది. అటువంటి వారికి రాట్నం కామధేనువు వంటిది. రాట్నం వలన ఒక లక్ష మంది స్త్రీలకు జీవనోపాధి కలుగుతున్నది. వారు తాము వడికిన నూలు అమ్మకం కోసం 5.6 మైళ్ళు నడిచి వెలుతున్నారు.

రాట్నంలో వడికి, ఖద్దరు ఉత్పత్తి చేసి హిందుస్థాన్‌ అంతటికీ మీరు సప్లై చేయగలుగుతారు. మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఒక ఏడాదిలోనే కావలసినంత ఖాదీ తయారవుతుంది. మీకు సన్నని బట్టలు విదేశీ బట్టల మీద మోజు ఉన్న సంగతి నాకు తెలుసు కానీ సోదర భారతీయులను దృష్టిలో పెట్టుకుని ముతక బట్టలు ధరిస్తే వారికి సహాయపడిన వారవుతారు’’ అని గాంధీ అన్నారు.

ఆ ఉపన్యాసం పూర్తి కాగానే రాజ్‌ ధన్‌రాజ్‌ గిర్జీ 2 వేల రూపాయలు. ముకుందదాస్‌ నూరు రూపాయలు మహాత్మునికి సమర్పించుకున్నారు. వామన్‌ నాయక్‌ సమర్పించుకున్న సన్మాన పత్రానికి మహాత్ముడు స్పందిస్తూ ‘‘ఉపన్యాసానంతరం 12వేల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. మీరు ఈ దరిద్ర నారాయణుడిని డబ్బిచ్చి సత్కరించినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు.

(1929 ఏప్రిల్‌ 7వ తేదీన హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ తొలి పర్యటన సందర్భంగా)
– కొలనుపాక కుమారస్వామి,
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్, వరంగల్‌
మొబైల్‌ : 99637 20669

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు