తెలుగు సినిమా స్వర్ణయుగంలో మూలస్తంభం

21 Aug, 2021 13:22 IST|Sakshi

మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళభైరవి, మాయాబజార్‌ మొదలైన సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగం అని అంటూంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనపుడు తొలుత ఆ చరిత్రలో తారసపడే పేరు మూలా నారాయణస్వామి!

కె.వి.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా వచ్చిన ‘భక్త పోతన’ అఖండ విజయం సాధించింది. అయితే, సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి ‘వాహిని స్టూడియో’కు నడుం కట్టారు మూలా నారాయణస్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం ‘గుణసుందరి కథ’. ఇది కూడా కె.వి.రెడ్డి దర్శకుడిగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది. మొదట కె.వి.రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బి.ఎన్‌.రెడ్డి అభ్యంతరం చెప్పారు. నారాయణ స్వామి పట్టువదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు. దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో, నారాయణ స్వామి ముగింపు అంతకు మించి ఉత్కంఠ కల్గిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూలా తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం.

తాడిపత్రికి చెందిన నారాయణస్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే, ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చేశాడు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్‌ పరిశ్రమ, సహకార బ్యాంకు, పాల సహకార సంఘం, మార్కెట్‌ యార్డులు, పళ్ళ క్యానింగ్‌ ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంకు, రాయలసీమ టెక్స్‌టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలక్ట్రానిక్‌ కంపెనీ వంటి పేర్లుండేవి. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీరా టాకీస్‌ మూలాగారివే. వీరికి బి.యన్‌.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలసి బర్మాకు  ఉల్లిపాయలు ఎగుమతి  చేసేవారు.  

బీఎన్‌ రెడ్డి, కేవీ రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి కలిగినవారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలిసి హెచ్‌.ఎం.రెడ్డి భాగస్వామ్యంతో ‘గృహలక్ష్మి’ రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్‌.ఎం.రెడ్డితో సర్దుకోలేక వాహినీ సంస్థను నెలకొల్పారు. 

వందేమాతరం, సుమంగళి, దేవత సినిమాలను నిర్మించి వాహిని సంస్థ చరిత్ర సృష్టించింది. ఇది 1938–1942 మధ్యకాలం. బాల్యమిత్రుడైన కేవీ రెడ్డిలో వ్యాపారి నారాయణస్వామి ఏమి చూశారోగానీ తెలుగు తెరకు ఒక గొప్ప దర్శకుడిని పరిచయం చేశారు. కేవీ రెడ్డి అప్పటికి ఆ సంస్థలో కేషియర్‌ మాత్రమే. ఏ సినిమాకూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేయలేదు. అందుకే మూలా దార్శనికుడు.

‘భక్త పోతన’ నిర్మించినపుడు న్యూటోన్‌ స్టూడియోలో ఇబ్బందులు గమనించి రెండున్నర లక్షల వ్యయంతో వాహినీ స్టూడియో ఏర్పాటయ్యింది. ఇందులో రెండు లక్షలు నారాయణ స్వామివి కాగా మిగతా యాభై వేలు బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి తదితరులవి. ఆ సంస్థకు నారాయణస్వామియే చైర్మన్‌. మూలాకు ‘ఆంధ్రా బిర్లా’ అనే పేరుండేది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కస్తూర్బా ఫండ్‌కు ఆ రోజుల్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు స్వామిగారి పూర్వాపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. ఆయన తోడ్పాటుతో ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు.

1938–1949 మధ్యకాలంలో గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్త పోతన – గుణసుందరి కథ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్తా ముందు ఇన్‌కమ్‌ టాక్స్‌ సమస్యల్లో నారాయణస్వామి ఇరుక్కోవడం సంభవించింది. ముప్ఫై లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహినీ స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయ్యింది. నారాయణస్వామికి నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కష్టాలు ముప్పిరిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 1950 ఆగస్టు 20న 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకటరంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. 1961లో దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారంటారు. ఏది ఏమైనా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూల విరాట్టు అయిన మూలా నారాయణస్వామి పరిణామగతి ఆశ్చర్యకరం!

– డా. నాగసూరి వేణుగోపాల్‌ 
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు