ఈ మౌన ముని.. ‘పోఖ్రాన్‌–2’ పథ నిర్దేశకుడు

9 Aug, 2020 00:31 IST|Sakshi

సందర్భం 

1996 మే 8. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్‌ కలాంకు వర్తమానం వచ్చింది – రాత్రి 9 గంటలకు ప్రధానిని కలవమని. పి.వి.నరసింహారావు ప్రధాని. కలాం ప్రధానికి శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారు, డీఆర్డీఓ కార్యదర్శి. ‘‘కలాంగారూ, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్, మీ బృందం పరీక్షలకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ పరీక్షలకు డీఆర్డీఓ, డీఏఈ సిద్ధంగా ఉండాలి’’– అని కలాంకు ముఖాముఖిగా చెప్పారు పీవీ. అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం లభించలేదు.

1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్దుల్‌ కలాం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ డైరెక్టర్‌ ఆర్‌. చిదంబరం కలసి అంతకుముందురోజే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయిని కలిశారు. పీవీ ప్రధానికి ఓ చీటీ ఇచ్చారు. వాజ్‌పేయి కేవలం 13 రోజులు పని చేసి, మెజారిటీ చాలదనే కారణం మీద జూన్‌ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 మే 22 దాకా పదవిలో ఉన్నారు. 2004 క్రిస్మస్‌ రోజులు. డిసెంబర్‌ 23న పీవీ కన్నుమూశారు. గ్వాలియర్‌లో వాజ్‌పేయి రచయితల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ విషయం బయటికి చెప్పవద్దని పీవీ కోరారు. కానీ ఆయనే గతించారు. చెప్పడం తన విధి’ అని ప్రకటిస్తూ 1996 మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. ‘సామగ్రి తయ్యార్‌ హై’ అని రాసిన చీటీ లోగుట్టు చెప్పేశారు. ‘అణుపరీక్షలకు అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు’ అని దాని అంతరార్థం. పీవీనే పోఖ్రాన్‌– 2 న్యూక్లియర్‌ ప్రోగ్రాం మూలపురుషుడు అని ఆ రోజు వాజ్‌పేయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి ఉండేదికాదు.

ఆంధ్రప్రదేశ్‌లో పీవీ ప్రారంభించిన భూసంస్కరణలు, విద్యాసంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని చేశాయి. ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలలో భారత్‌ ధోరణి, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అణుశక్తి రంగంలో ఆయన చూపిన చొరవ, వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావన రాలేదు. 1996 మే నెలలో జరగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి 1995 డిసెంబర్‌లో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆరునెలలు వాయిదా పడ్డాయి. 1995 నవంబర్‌ చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు అబ్దుల్‌ కలాం, ఆర్‌.చిదంబరంకు టి–30 కార్యక్రమం నిర్దేశించారు. ముప్పయి రోజుల్లో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే డిసెంబర్‌ 15న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి సంచలనం రేపింది. మరోవైపు సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి డిసెంబర్‌లో అణు పరీక్షలు జరుపలేదు.

మరి మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు పీవీ? ఎందుకంటే 1995 డిసెంబరు నాటికి హైడ్రోజన్‌ బాంబు సిద్ధం కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలల వ్యవధి అడిగారు. అంతేకాకుండా థార్‌ ఎడారిలో పోఖ్రాన్‌ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢచారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టిం చాలో కూడా ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉంటే 1995 డిసెం బర్‌లో కొన్ని పరీక్షలు జరిపి ఉండేవారు పీవీ. కానీ ఆయన ఆవిధంగా ఆలోచించలేదు. నరసింహా రావు కనుమూయడానికి కొన్నినెలల ముందు జర్నలిస్టు శేఖర్‌ గుప్తా ఈ విషయం అడిగితే– ‘భయ్యా కొన్ని రహస్యాలు నా పాడెతోనే పోనీవోయ్‌’ అని పీవీ అనడం అందరూ టీవీల్లో చూశారు. పోఖ్రాన్‌–2 అణుపరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని అంగీకరించింది. అదేవిధంగా పీవీ ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానులు సీటీబీటీ, ఎన్పీటీ ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. కనుకనే ఈ విషయాలన్నీ దగ్గరగా చూసిన అబ్దుల్‌ కలాం– దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడటం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది.

వ్యాసకర్త సైన్స్‌ రచయిత,
వర్తమాన అంశాల వ్యాఖ్యాత
మొబైల్‌ : 94407 32392

డా. నాగసూరి వేణుగోపాల్‌

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా