Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి

25 Nov, 2022 00:24 IST|Sakshi

పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం లిఖిస్తోంది. సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల, వృద్ధి రేటు పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తు సేవల వినియోగం తగ్గిపోతోంది. ఈ స్థితిలో ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు కరెన్సీ ముద్రిస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచుతున్నారు. దీంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. మొత్తం మీద ఒక అనివార్య చక్రబంధంలో పెట్టుబడిదారీ దేశాలు చిక్కుకు పోయాయి.

ప్రపంచ పెట్టుడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ వాయిదా వేసిన తన అధికారిక మరణ ప్రకటనను నేడు ముఖాముఖి ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి వ్యవస్థ తాలూకు అంతిమ వైఫల్యం 3, 4 దశాబ్దాల క్రితమే నిర్ధారణ అయిపోయింది. 1979ల తర్వాత పెట్టుబడి దారి ధనిక దేశాలలో ఆయా వ్యవస్థలు ఇక ఎంత మాత్రమూ ప్రజలకు ఉపాధిని కల్పించలేని పరిస్థితులు వేగవంతం అయ్యాయి. దీనికి కారణాలుగా అప్పటికే పెరిగిపోసాగిన యాంత్రీకరణ; ఈ దేశాలలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి గనుక అక్కడి నుంచి పరిశ్రమలు చైనా వంటి చౌక శ్రమ శక్తి లభించే దేశాలకు తరలిపో నారంభించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు అన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా వంటివి తమ పారిశ్రామిక పునాదిని కోల్పోయాయి. అలాగే 1990ల అనంతర సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ విప్లవా లతో ఈ దేశాలలోని సేవారంగం కూడా (ఐటీ, బీపీఓ) భారత దేశం వంటి దేశాలకు తరలిపోయింది. 

ఈ క్రమంలోనే ఆయా ధనిక దేశాలలోని ప్రజలకు ఇక ఎంత మాత్రమూ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలూ, వ్యవస్థలూ ఆ ప్రజలలో అసంతృప్తి జ్వాలలు రగులకుండానూ, వారి కొనుగోలు శక్తి పతనం కాకుండానూ కాపాడుకునేందుకు దశాబ్దాల పాటు క్రెడిట్‌ కార్డుల వంటి రుణ సదుపాయాలపై ఆధారపడ్డాయి. అలాగే 1990లలో యావత్తూ... సుమారు 2001 వరకూ ఇంటర్నెట్‌ ఆధారిత హైటెక్‌ కంపెనీల షేర్ల విలువలలో భారీ వృద్ధి ద్వారా జరిగిన షేర్‌ మార్కెట్‌ సూచీల పెరుగుదల పైనా వ్యవస్థలు నడిచాయి. ఇక చివరగా 2003 తర్వాతి కాలంలో... 2008 వరకూ రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌పై ఆధారపడి ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింది. అంతిమంగా 2008 చివరిలో ఈ రియల్‌ బుడగ పగిలిపోవడంతో వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.  

ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వేరే దారిలేక ఈ ధనిక దేశాలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు, ఉద్దీపన రూపంలో కరెన్సీల ముద్రణను మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో ధనిక దేశాలన్నింటిలోనూ ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల రికార్డు స్థాయికి చేరింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం ధనిక దేశాలలో దేశీయంగానే సరుకులూ, సేవల ఉత్పత్తి తాలూకూ పారిశ్రామిక పునాదులు లేకపోవడం. ఫలితంగా ఈ దేశాలలో ముద్రించబడిన డబ్బు, అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న సరుకులు, సేవలకు ఖర్చవుతోంది.  

అందుకే ద్రవ్యోల్బణం తగ్గడంలేదు. దాంతో ప్రస్తుతం దరిదాపు అన్ని ధనిక దేశాలూ ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్యాంకు వడ్డీ రేట్లను పెంచసాగాయి. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్ల వలన ఆయా దేశాలలో రుణ స్వీకరణ తగ్గిపోతోంది. ఇది వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పతనానికీ... అంటే అంతిమంగా వృద్ధి రేటు పతనానికీ దారితీస్తోంది. అదీ కథ!
అంటే ఆర్థిక మాంద్య స్థితిలో ఉద్దీపన కోసం కరెన్సీలు ముద్రిస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని వడ్డీ రేట్లను పెంచితే తక్షణమే ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరుగుతోంది.  కొద్ది నెలల క్రితం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరిట అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే తర్వాతి త్రైమాసిక కాలం నుంచీ ఆర్థిక వృద్ధి రేటు అకస్మాత్తుగా పడిపోసాగింది. వ్యవస్థ పరిమితులలో పరిష్కారం సాధ్యంకాని చిక్కుముడిగా... వైరుధ్యంగా ఈ పరిస్థితి తయారయ్యింది. ముందు నుయ్యి... వెనుక గొయ్యి స్థితి ఇది.

స్థూలంగానే... ఆయా ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంక్షోభ కాలంలో ఉద్దీపనలు లేదా వాటి ద్వారా ప్రభుత్వమే పూను కొని (ప్రైవేటు పెట్టుబడి దారులకు బదులు) ఉపాధి కల్పన చేసి వ్యవస్థను తిరిగి గట్టెక్కించే అవకాశాలు నేడు సన్నగిల్లి పోయాయి. యాంత్రీకరణ వేగం పెరగడం... విపరీతమైన స్థాయిలో మర మనుషుల వినియోగం పెరగడం వంటి వాటి వలన నేడు ఈ దేశాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఇక ఎంత మాత్రమూ లేకుండా పోతున్నాయి. వాస్తవంలో నేటి ప్రపంచంలో జరిగిన... జరుగుతోన్న హైటెక్‌ సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాల్సింది. ఎందుకంటే ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి భారీగా ఉత్పత్తిని పెంచి తద్వార జన జీవితాన్ని మరింత సులువైనదిగా, సంపన్నవంతమైనదిగా మార్చ గలగాలి. 

కానీ ఇప్పుడు జరుగుతోంది... సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల... వృద్ధి రేట్ల పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కారల్‌ మార్క్స్‌ పరిభాషలో చెప్పాలంటే... నేడు జరుగుతోంది ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న కొద్దీ అవి ప్రజలకు మేలుచేయక పోగా... వినాశకరకంగా మారడమే. ఈ పరిస్థితికి కారణం నేటి వ్యవస్థ తాలూకు కీలక చలన సూత్రం లాభాల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టడం. అంటే ఇక్కడ... ఈ వ్యవస్థలో నిర్జీవమైన డబ్బును... లాభార్జన ద్వారా... మరింత అధిక డబ్బుగా మార్చడం అనేదే ప్రాథమిక సూత్రం. దీనిలో ప్రాణం ఉన్న మనుషులు... ప్రాణం లేని పెట్టుబడీ, దాని తాలూకు లాభాల కోసం పని చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టుకొని లాభాలు సంపాదించుకోగలిగితే అది పెట్టుబడి దారులకు మహా సంతోషం. అలాగే ఈ పెట్టుబడిదారులు తమ ఈ ఆలోచనా విధానం వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్‌ పడిపోయినప్పుడు ఆ స్థితి నుంచి వ్యవస్థను గట్టెక్కించేందుకు ఇక ఎంత మాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టరు. అప్పుడు ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడవలసి రావడమే ప్రతి ఆర్థిక మాంద్య కాలంలోనూ జరిగింది. 

అయితే 1980ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నయా ఉదారవాద సంస్కరణలు కనీసం ప్రభుత్వాలైనా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా నికరంగా పూనుకోగలగడాన్ని చాలా వరకూ ఆటంక పరుస్తున్నాయి. ఈ సంస్కరణల తాలూకు ఆలోచనా విధానంలో ప్రభుత్వ పాత్ర కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ధనవంతులకు అనుకూలంగా వ్యవహారిస్తేనే దానివలన పెట్టుబడులు పెరిగి  ప్రజలకు ఉపాధి లభిస్తుందనేది కీలక విధానంగా ఉండడం. అంటే ఈ ప్రపంచీకరణ విధానాలకు ముందరి... 1980ల ముందరి సంక్షేమ రాజ్య ఆలోచనలైన ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు బాగుండి, వారి ఆర్థిక స్థితి బాగుంటేనే వ్యవస్థలో కొనుగోలు శక్తి... డిమాండ్‌ స్థిరంగా ఉంటాయనే దానికి తదనంతరం తిలోదకాలిచ్చారు. 

అలాగే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల కలగలుపు అయిన ఈ ఉదారవాద సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని సిద్ధాంతీకరించాయి. అంటే పూర్తిగా డిమాండ్‌ సరఫరాలపై ఆధారపడిన మార్కెట్‌ ఆలోచనా విధానం ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు. అందుచేత ఈ విధానాలను విశ్వసించేవారు ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ పాత్రను తిరస్కరించే గుడ్డితనానికి పోతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం కాగితం కరెన్సీల ముద్రణపై ఆధారపడి తమ మరణ శాసనాలను వాయిదా వేసుకున్న పెట్టుబడిదారీ పాలకులు నేడు ఇక ఎంత మాత్రమూ వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో పడిపోయారు!

డి. పాపారావు, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్‌: 98661 79615 

మరిన్ని వార్తలు