రైతును రాజును చేసిన రాజన్న

8 Jul, 2021 01:36 IST|Sakshi

ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్‌ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం.

రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్‌ జయంతి డిసెంబర్‌ 23ను  జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్‌ చౌదరి, కె.హెచ్‌.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్‌ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్‌ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. 

సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్‌ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్‌ గర్వించే ఇంజనీర్‌ కె.ఎల్‌.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది.

సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే  వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. 

రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 అమలు చేశారు.

రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్‌ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90  శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్‌.

నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్‌. రైతు భరోసా –పీఎంకిసాన్‌గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం,  వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం,  వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం,  వైఎస్సార్‌  కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని  వైఎస్సార్‌ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది.

 
ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి
వ్యాసకర్త వైస్‌ చైర్మన్, ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌

మరిన్ని వార్తలు