పోయినవాళ్లు మిగిల్చేవి జ్ఞాపకాలే!

30 Oct, 2023 03:44 IST|Sakshi
మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ , బిషన్‌ సింగ్‌ బేడీ, అబ్బాస్‌ అలీ బేగ్‌

కామెంట్‌

ఇటీవల మరణించిన క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు పారదర్శకంగా ఉండేవి. మంచి సంభాషణను ఇష్టపడతారు. మాట్లాడినదంతా ఓపిగ్గా వింటారు. ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మరో క్రికెటర్‌ స్నేహితుడు టైగర్‌ పటౌడీలో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి ఉంటుంది. అది అచ్చమైన బ్రిటిష్‌ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి,సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. మరో క్రికెట్‌ దిగ్గజం అబ్బాస్‌ అలీ బేగ్‌ లోతైన రాజకీయ అవగాహనను కలిగి ఉండేవారు. టైగర్, బిషన్‌ ఇప్పుడు మనతో లేరు. స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే. 

నేను క్రికెట్‌ అభిమానిని కాదన్న సంగతి రహస్యమేమీ కాదు. నిజానికి ఆ ఆట నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో గాని చూడను కూడా. ఫలితంగా చాలా మంది క్రికెటర్లు నాకు తెలియదు. కానీ గొప్ప జ్ఞాన గాంభీర్యంతో నేను క్రికెట్‌ చర్చలకు తెగించినప్పుడు, తెలిసీ తెలియని విషయ సమా చారంతో బుద్ధిహీనమైన ప్రశ్నలు సంధించినప్పుడు పదే పదే నన్ను గట్టున పడేసిన వారిలో నేను స్నేహితులుగా పరిగణించే క్రికెటర్లు ముగ్గురున్నారు. వారు – టైగర్‌ పటౌడీ, బిషన్‌ సింగ్‌ బేడీ, అబ్బాస్‌ అలీ బేగ్‌. 

బాధాకరం... టైగర్‌(2011లో మరణించారు), బిషన్‌ ఇప్పుడు మనతో లేరు. బగ్గీ (అబ్బాస్‌ అలీ బేగ్‌) ఈ మధ్యే తన భార్య వినూ (వినూ మీర్‌చందానీ)ను కోల్పోయారు. గత సోమవారం (23 అక్టోబర్‌) నాటి బిషన్‌ సింగ్‌ మరణం ఈ ముగ్గురు స్నేహితుల జ్ఞాప కాలను తిరిగి తెచ్చిపెట్టింది. వారి గౌరవార్థం, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

టైగర్‌కు నా క్రీడా పరిజ్ఞానం అంతంత మాత్రమేనని తెలుసు. ఒక్క టీవీ స్టూడియోలో తప్ప, ఆయన నా ముఖంపై కోడిగుడ్లు పగిలే అవకాశం ఉన్న పరిస్థితికి నన్ను వదిలేయకుండా మా సంభాషణను సున్నితంగా, నేర్పుగా నాకు నచ్చిన విషయాల వైపు మళ్లించేవారు. తరచు ఆ మళ్లింపు నేను ధరించిన టై గురించిన పొగడ్త అయివుండేది. వివేచనను అభిరుచిగా కలిగిన వ్యక్తి ఆయన. కనుక ఆయన మెచ్చు కోలు నన్ను అదే టైని మళ్లీ మళ్లీ ధరించేలా చేసేది. ఒక సందర్భంలో తొలిసారిగా ఆయన తన కనుబొమ నొకదాన్ని ఎగరేస్తూ, నెమ్మదైన స్వరంతో... ‘‘మీరు ఆ టై ధరించడం ఇది మూడోసారి!’’ అని అనేంతవరకు ఆ టైని నేను వదిలిపెట్టలేదు. 

టైగర్‌లో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి కూడా ఉంది. అది అచ్చమైన బ్రిటిష్‌ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి, సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు.  

బిషన్‌ చాలా భిన్నమైనవారు. ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు, అంతర్గత భావాలు తరచు పారదర్శకంగా, పైకి కని పించేలా ఉండేవి. మంచి సంభాషణను ఆయన ఇష్టపడతారు. మాట్లా డినదంతా ఓపికగా వింటారు. అలాగే ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. 

మేము తరచు బగ్గీ, వినూ వాళ్లింట్లో కలుసుకునేవాళ్లం. మేడపైన మాటల్లో మునిగిపోయేవాళ్లం. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏమిటి’ అని బగ్గీ నన్ను అడిగేవారు. అయితే రాజకీ యాలను ఆయన నాకంటే బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమ యేందుకు ఎక్కువ సమయం పట్టేది కాదు. నేను చెప్పేది వినేవారు. నా గ్రహింపులో లేని లోతైన గమనింపుల గురించి చెప్పి నన్ను ఉల్లాస పరిచేవారు. 

ముగ్గురిలోకి బగ్గీ ఎక్కువగా తటపటాయింపుతో ఉండేవారు. వినూ అప్పుడు ఆ సంకోచాల నుంచి ఆయన్ని కాపాడేందుకు ముందు కొచ్చేవారు. ఆమె చురుకైనవారు. సంభాషణ ప్రియత్వం కలిగి నవారు. విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించే స్నేహశీలి. అతిథు లను ఆదరించే అద్భుతమైన మహిళ. రుచిగా వండినంత మాత్రానే కాదు, అతిథుల సన్నిధి ఆమెను ఉల్లాసపరచడం వలన కూడా వారింట్లో భోజనం ఆరగించడం అన్నది ఒక సంతుష్టికరమైన భావ నను కలిగించేది. తన స్నేహితుల సమక్షంలో ఆమె అపరిమితమైన సంతోషంతో ఉండేవారు.  

నేనిది రాస్తున్న సమయానికి, స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే నన్న మెలకువను కూడా మొత్తంగా నేను కలిగి ఉన్నాను. మీరు నెలలు లేదా ఏళ్లపాటు కలుసుకుని ఉండకపోవచ్చు. మిమ్మల్ని సముద్రాలు, తరచు రాసుకోని ఉత్తరాలు వేరు చేస్తుండొచ్చు.

అయితే ఆ దూరమే మిమ్మల్ని కలిపి ఉంచే జ్ఞాప కాలను శక్తిమంతం చేస్తుంది. కాల క్రమేణా ఆ జ్ఞాపకాలు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పచుకుంటాయి. ఇప్పుడు టైగర్, బిషన్, వినూ గురించి నాకు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే! ఆ ముగ్గురూ నాకు దూరమయ్యాక తమవైన స్థానాలను నాలో ఏర్ప చుకున్నారు. 

ఒక అర్థంలో నేను స్పష్టమైన దానిని చెబుతున్నాను. అలాగే, మరొక విషయం కూడా చెబుతాను. మనుషులు చనిపోయినప్పుడు మాత్రమే మళ్లీ ఇక వారిని కలవలేం అన్న భావనలో మనం మునిగి పోతాం. అప్పుడు వారి జ్ఞాపకాలు వేరే భిన్నమైన స్థాయిని పొందు తాయి. బతికున్నవాళ్లను – రేపో, తర్వాతి వారమో, ఫోన్‌ కాల్‌లోనో, ఈమెయిల్‌ ద్వారానో – జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది ఇకపై ఉండదు. ఇప్పుడిక మీకున్నవన్నీ కేవలం జ్ఞాపకాలే! ఒక సమావేశం, ఒక సంభా షణ, ఒక ఈమెయిల్‌ అన్నది ఇక ఎప్పటికీ సంభవించవివే! 

అనేకమైన ఈ ఆలోచనలు నిస్సందేహంగా వయసు నిర్దేశించి నవే. అది అనివార్యం. నిజాయతీగా చెప్పాలంటే 34 ఏళ్ల క్రితం నా భార్య నిషా చనిపోయినప్పుడు కూడా పూర్తి భిన్నంగా ఏమీ లేదు. 2015లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా! లేదా నేను సన్నిహితంగా ఉన్న మరెవరి విషయంలోనైనా! నా చిన్నతనంలో నేను జ్ఞాప కాలు ఎలా జనిస్తాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనే ఆలోచ నను కలిగిలేను. ఇటీవల కొద్ది వారాల తేడాతో సంభవించిన విను, బిషన్‌ మరణాలు నాలో ఆ స్పృహను కలిగించాయి. 

ప్రియ మిత్రమా! నా ఉద్దేశం మనో దౌర్బల్యం లోనికో, తాత్విక చింతన లోనికో జారుకోవడం కాదు. ఆనందకరమైన జ్ఞాపకాలతోనే నేను మొదలయ్యాను. కానీ నేను చెప్పాలని భావించిన దానికంటే విచారంగా ముగించినట్లున్నాను. అంటుంటారు కదా: ఇదే జీవితం!
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు