రైతు ప్రధానికి సముచిత గౌరవం

15 Feb, 2024 00:17 IST|Sakshi
‘భారతరత్న’ చరణ్‌ సింగ్‌

సందర్భం

పేదవర్గాలకు ఎనలేని సేవలందించిన భారత మాజీ ప్రధానమంత్రి దివంగత చరణ్‌ సింగ్‌కు ఆయన చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయటం హర్ష ణీయం. అదే విధంగా తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామా రావుకు కూడా భారతరత్న ఇస్తే సముచితంగా ఉంటుంది.

1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించటంలో చరణ్‌ సింగ్‌ది ప్రధానపాత్ర. వాస్త వానికి 1971 ఎన్నికలలో రాయబరేలీలో ఇందిరమ్మపై పోటీచేసిన రాజ్‌ నారాయణ్‌ ఎన్నికల పిటిషన్‌ వేసి, అలహాబాద్‌ హైకోర్టులో నెగ్గడం వెనుక కూడా చరణ్‌సింగ్‌ చాణక్యం లేకపోలేదు. మధు లిమాయే 1977లో ఒక మాటన్నారు: ‘ఉత్తరభారతంలో రామ్‌ మనోహర్‌ లోహియా విఫలం కాగా చరణ్‌ సింగ్‌ సమర్థంగా వ్యవ సాయ కులాలను, మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను గుదిగుచ్చి మాల తయారు చేయటంలో విజయం సాధించారు.’

1937లో చరణ్‌ సింగ్‌ రెవిన్యూ మంత్రిగా ఉత్తరప్రదేశ్‌లో రైతురుణ విమోచన చట్టం తెచ్చి, రైతాంగాన్ని ఆనాడే అప్పుల బాధ నుండి బయట పడేశారు. 1979లో చరణ్‌సింగ్‌ ఆర్థికశాఖను చేపట్టి 1979–80 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ సందర్భంలో ఓ రోజు ఉదయం ఫిబ్రవరి మొదటివారంలో చరణ్‌సింగ్‌ను కలుద్దామని తుగ్లక్‌ రోడ్డుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఉప ప్రధానిగా కూడా ఉన్నారు.

చరణ్‌ సింగ్‌ ఇంటి ముందు మూడు కార్లున్నాయి. వాటినిండా ఫైళ్ళు మూట గట్టి నింపేస్తున్నారు. వ్యక్తిగత భద్రతాధికారి కర్తార్‌ సింగ్‌ నన్ను చూడగానే, ‘చౌధరీ సాబ్‌ బడ్జెట్‌ రూపొందించేందుకై హరియాణాలోని సూరజ్‌కుండ్‌కు వెళ్తు న్నారు. నీవు ఇక్కడే ఉండు, చౌధరీసాబ్‌ బయటకు రాగానే కనపడ’ మని సలహా చెప్పారు. వాకిలి వద్దే నిలుచున్నాను. 

చౌధరీ బయటకు రాగానే నన్ను చూసి ‘ఏమిటింత ప్రొద్దున్నే వచ్చావు. గొడ్డుచలిలో?’ అని వాకబు చేశారు. ‘రెండు, మూడు సమస్యలున్నాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలలో పొందుపరచాలి’ అని వివరించాను. కారు ఎక్కమన్నారు. వెనుక సీటులో చౌధరీసాబ్‌ పక్కన కూర్చున్నాను. ముందు సీటులో కర్తార్‌ సింగ్‌ కూర్చున్నారు. రైతులు పండించే పొగాకుపై ఎక్సైజ్‌ సుంకం రద్దుచేయవలసిన అవసరాన్ని వివరించాను.

అదే మాదిరి పేదవారు వాడుకొనే అల్యూమినియం పాత్రలపై కూడా సుంకం తొలగించాలని వివరించాను. దానికి సంబంధించిన వివరాలతో, ముసాయిదా పత్రాన్ని కూడా తయారు చేశానని చెప్పాను. ఆ పత్రాలు లాక్కొని తన ఫైలులో పెట్టుకొన్నారు. ఆ రెంటినీ బడ్జెట్‌ ప్రతిపాదనలలో పొందుపరిచారు. చాలా ఆశ్చర్యమేసింది. అంతకు ముందు బడ్జెట్లు రూపొందించే కసరత్తులో భాగంగా సలహాల కోసం బొంబాయి వెళ్ళి ఆర్థికవేత్తలు, ప్రణాళికా నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వారు, పాలనాదక్షులతో చర్చలు జరిపితే బడ్జెట్‌ మరింత నాణ్యంగా రూపొందించడానికి ఉపయోగపడగలదని సూచించాను. సరేనన్నారు.

బొంబాయి సమావేశంలో పాల్గొన్న పెద్దలు చెప్పినవన్నీ జాగ్రత్తగా రికార్డు చేయించి, ఆ కాగితాలు తీసుకొని ఆ సూచనలలో ప్రతి ఒక్కదానికీ పూర్తి వ్యతిరేకంగా బడ్జెట్‌ ప్రతిపాద నల్లో చేర్చారు. ‘బొంబాయిలోని వారంతా బడా బాబులు. వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తే, మనం సరైన మార్గంలో ఉన్నట్లు! మనం చేసిన పని బాగుందని వారు కితాబిస్తే మనం ఎక్కడో తప్పు చేశామని అర్థం! అని గీతోపదేశం చేశారు.

1979 జులైలో జనతాపార్టీ చీలిపోయింది. మొరార్జీ స్థానంలో చరణ్‌ సింగ్‌ ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కాలంలో లోక్‌ సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. డీసీఎం అధిపతి అయిన భరత్‌ రామ్‌ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షులుగా చరణ్‌ సింగ్‌ దగ్గరకు వెళ్లి ఆయనకు ఎన్నికల నిధి ఇవ్వజూపారు. ఏమిటిదని అడిగారు చరణ్‌ సింగ్‌. ‘ఏమీ లేదు – ఇది మామూలే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధానమంత్రు లందరికీ మేము ఇలాగే సమర్పించుకొంటుంటాం.

ఇందులో కొత్త ఏమీలేదు. ఇప్పుడు ప్రధాని కుర్చీలో మీరు కూర్చున్నారు గనుక మీకు సమర్పిస్తున్నాం’ అన్నారు. ‘ఏమిటీ నాకు డబ్బులిస్తావా? పోలీసులకు అప్ప జెబుతాను. నేను రైతుల దగ్గరికెళ్ళి రూపాయి – రూపాయి అడుక్కొంటాను గానీ, పారిశ్రామికవేత్తల విరాళాలతో ఎలక్షన్‌కు వెళ్తానా?’ అని కోపగించారు చరణ్‌ సింగ్‌. భరత్‌ రామ్‌  రాష్ట్రపతి భవన్‌ కెళ్ళి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని కలిసి ‘భలేవాడిని ప్రధాన మంత్రిగా చేశారు సార్‌.

ఎన్నికల నిధికి ఏదో పదిరూపాయలిద్దామని వెడితే, అరెస్ట్‌ చేయిస్తానని వెంటబడతాడే మిటి సార్‌’ అని వాపోయారు. ఎమ్‌వీఎస్‌ సుబ్బరాజు, గణపా రామస్వామి రెడ్డి, దొడ్డపనేని ఇందిర జనతాపార్టీ శాసనసభ్యులు, నీలం సంజీవరెడ్డికి ఆత్మీయులు. వారు వాస్తవానికి మానసికంగా లోక్‌ దళ్‌కూ, చరణ్‌ సింగ్‌ భావజాలానికీ దగ్గర. వారిని పిలిపించారు సంజీవరెడ్డి. ‘ఇదెక్కడ గోలయ్యా. తుండు, తుపాకీ లేకుండా యుద్ధానికి వెళతానంటాడు. ఎవరో పెద్దమనిషి పది రూపాయ లిస్తానంటే అరెస్టు చేయిస్తానంటాడు. ఈ సిద్ధాంత మూర్ఖుడితో కూడుగాదు, మీరు కాంగ్రెస్‌లో చేరిపోండి’ అని సలహా ఇచ్చారు. అలాగే చేశారు వారు ముగ్గురూ.

ప్రధానమంత్రిగా నుండగా 1979 అక్టోబరులో గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ. చౌధరీ సాబ్‌ ఉపన్యా సాన్ని తెలుగులోకి నేనే తర్జుమా చేశాను. ‘శివాజీ, నా ఉపన్యాసం కన్నా, నీ తర్జుమా మరింతగా శ్రోతలను ఆకట్టుకొంది. లేకుంటే సభ అంత రక్తికట్టేది కాదు’ అని సభానంతరం మనసారా అభినందించారు చరణ్‌ సింగ్‌.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక వల్లనే కాంగ్రెస్‌ నెగ్గు కొస్తున్నదనీ, ఆ పార్టీలన్నీ ఐక్యం అయితే కాంగ్రెస్‌ పాలన ముగు స్తుందనీ చరణ్‌ సింగ్‌ విశ్వాసం. ఆ దిశగా ఆలోచన చేసే 1974 ఆగస్టు 29న భారతీయ క్రాంతిదళ్, సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీలు, ముస్లిం మజ్లిస్, స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ లోక్‌ దళ్, మజ్దూర్‌ పార్టీ, పంజాబ్‌ ఖేతీ భారీ జమీందారీ యూనియన్లను విలీనం గావించి భారతీయ లోక్‌దళ్‌ను రూపొందించారు. 

జాతీయ స్థాయిలో నిరంతరం రైతుల కోసం పరితపించిన చరణ్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వటం ఎంతో సముచితం. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు.

డా‘‘ యలమంచిలి శివాజి 
వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు ‘ 98663 76735

whatsapp channel

మరిన్ని వార్తలు