సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం | Sakshi
Sakshi News home page

సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

Published Thu, Feb 15 2024 12:18 AM

- - Sakshi

భారీగా హాజరైన లబ్ధిదారులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం

లబ్ధిదారులకు నమూనా తాళాన్ని అందజేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు

మామిడి తోరణాలు.. బంధుమిత్రుల కోలాహలం.. పూజా కార్యక్రమాలు.. పండగ వాతావరణం నడుమ టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందోననే అనుమానం.. అద్దె ఇళ్లలో ఉంటూ ఆ భారాన్ని మోయలేక అవస్థలు పడుతున్న ఎంతో మంది చిరకాల స్వప్నం ప్రభుత్వ పుణ్యమానని సాకారమైంది. తమకు గృహయోగం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందోత్సాహాల మధ్య పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పేదలకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పటికే జగనన్న కాలనీల్లో గృహాలను నిర్మిస్తుండగా.. తాజాగా టిడ్కో ద్వారా పూర్తయిన గృహ సముదాయాలను లబ్ధిదారులకు మంగళవారం అప్పగించింది. జిల్లాలో ఒక్క రోజులోనే 15,552 గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. 300 చదరపు అడుగుల ఇళ్లను 15,120 మందికి.. 365 చదరపు అడుగుల గృహాలను 432 మంది లబ్ధిదారులకు కేటాయించారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతి నిధుల సమక్షంలో అల్లీపురంలో కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు.

ఆద్యంతం.. కోలాహలం

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాల్లో ప్రవేశాలను అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, కల్లూరుపల్లి, కొండ్లపూడి, ఇరుకళల పరమేశ్వరి ఆలయ సమీపాన, అక్కచెరువుపాడు ప్రాంతాల్లో రెండు విడతల్లో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు. లబ్ధిదారులకు తమ సొంతింటి తాళాలతో పాటు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేసి గృహప్రవేశాలు చేయించారు. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ స్రవంతి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త ఖలీల్‌ అహ్మద్‌, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ సమక్షంలో ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇల్లు వస్తుందని ఊహించలేదు

నేను, నా భర్త కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఆరేళ్లుగా లక్ష్మీనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇంటి బాడుగ, ఖర్చులు, పిల్లల చదువులకు మా సంపాదన సరిపోయేది కాదు. ఇల్లు పొందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నా. దీనిపై పలుమార్లు అధికారులను అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో ఆశలు వదిలేసుకున్నాం. జగనన్న ప్రభుత్వంలో మా కల నెరవేరడం సంతోషంగా ఉంది. – రాయపు కరుణ, లబ్ధిదారు

నేను, నా భర్త మైపాడు రోడ్డులో బాడుగ ఇంట్లో ఉంటూ టిఫిన్‌ అంగడి ద్వారా జీవనం సాగించేవాళ్లం. మా కుమారుడు చనిపోయారు. కూతురికి వివాహమై పొదలకూరులో ఉంటున్నారు. పదేళ్ల క్రితం కిందపడటంతో కాలు విరిగింది. ఆపరేషన్‌ చేసినా, నడవడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఇంటి కోసం పెట్టుకున్న అర్జీ విషయమై అధికారుల చుట్టూ నా అల్లుడు తిరిగేవారు. ప్రస్తుతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కారణంగా సొంతిల్లు వచ్చింది.

– అడిగోపుల సరోజనమ్మ, లబ్ధిదారు

జగన్‌బాబు కారణంగా ఇల్లు వచ్చింది

నెల్లూరు(బారకాసు): తమ సొంతింటి కలను సాకారం చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కరతాళధ్వనులతో కృతజ్ఞతలను తెలియజేశారు. అల్లీపురంలో టిడ్కో గృహల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులను ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.

ఘన స్వాగతం

కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులకు ఘన స్వాగతం పలికారు. విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్‌ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ఎమ్మెస్సెమ్‌ఈ డైరెక్టర్‌ పాశం శ్రీనివాస్‌, పార్టీ జిల్లా మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నేతలు పొట్లూరి జయవర్ధన్‌, మంగళపూడి శ్రీకాంత్‌రెడ్డి, పాలకీర్తి రవికుమార్‌, టిడ్కో ఎండీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల కలల సౌధం సాకారం

15 వేల టిడ్కో గృహాల అందజేత

పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన

ఖుషీఖుషీగా లబ్ధిదారులు

గృహ ప్రవేశ సందర్భంగా శాస్త్రోక్తంగా 
పూజా కార్యక్రమాలు
1/5

గృహ ప్రవేశ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు

పసుపు, కుంకుమతో గడపను తీర్చిదిద్దుతూ..
2/5

పసుపు, కుంకుమతో గడపను తీర్చిదిద్దుతూ..

3/5

4/5

5/5

Advertisement
Advertisement