Sakshi News home page

స్త్రీ సాధికారతతోనే దేశ పురోగతి

Published Wed, Feb 14 2024 12:32 AM

Sakshi Guest Column On women empowerment

ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల రాజకీయ ఉన్నతి పెరుగుతున్నది. స్త్రీలలో వస్తున్న నిరంతర చైతన్యం, పెరుగుతున్న సానుకూల దృక్పథం, అంకిత భావం, పోరాట శక్తి వారిని మునుముందుకు నడిపిస్తున్నాయి. పార్లమెంటులో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడే వారి ప్రతిపాదనలు, హక్కులు నెరవేరతాయని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. స్త్రీ విద్యావంతురాలయితే ఆరోగ్యం, పరిసరాలు, సామాజిక ఘర్షణలన్నింటినీ చక్కగా అవగాహన చేసుకోగలుగు తుంది. స్త్రీలు తమ అస్తిత్వానికి సంబంధించి రాజీపడరు. వారు ఆత్మగౌరవ నిధులు. వారిలో జీవన ప్రతిభ ఎక్కువ. అందుకే వారు నాయకులుగా సులభంగా రాణించగలరు. అందుకే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో స్త్రీలకు గణనీయంగా స్థానాలు కేటాయించాలి.

స్త్రీ అత్యున్నతంగా విద్యావంతురాలైన కేరళ రాష్ట్రంలో సమాజ వికాసం గొప్పగా ఉంది. స్త్రీ విద్య తక్కువ వున్న రాజస్థాన్‌లో ఇంకా స్త్రీ పట్ల దురాచారాలు కొనసాగుతుండగా, కేరళ స్త్రీ ప్రపంచ ఎల్లలను తాకుతున్నది. కేరళలో ఇంగ్లీషు విద్యను కూడా స్త్రీలకు నేర్పగలిగారు. స్త్రీలకు ఏ భాష అయినా త్వరగా వస్తుంది. ఈ రోజున యాంకర్స్‌లో స్త్రీలు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇటీవల రిపబ్లిక్‌ డే పరేడ్‌లో జరిగిన విన్యాసాలలో అసమా నమైన ప్రతిభా పాటవాలు వారు చూపారు. స్త్రీలు ఈ రోజు శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, జ్ఞాన రంగంలో అత్యున్నత దశలో ఉండడానికి కారణం వారికి విద్యార్జన శక్తి అత్యుత్తమంగా ఉండటమే!

‘నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను’ అని ప్రముఖ తత్వ వేత్త డెకార్ట్‌ అన్నట్లుగా... ‘నేను బాధను అనుభవిస్తున్నాను, కాబట్టే నేను ఉన్నాను’ అనుకొనే స్వభావం, బాధలో సౌఖ్యాన్ననుభవించే గుణం స్త్రీల స్వభావంలోనే ఉందనే నిందను స్త్రీవాదులు ఎదుర్కొ న్నారు. నటాలీ షైన్‌ అనే న్యూయార్క్‌ మానసిక వైద్యురాలు చెప్పి నట్లు, ‘స్త్రీ మానసిక శాస్త్రం ఒక సమగ్ర దర్శనంగా రూపొందినప్పుడే స్త్రీకి ఉన్న అన్ని కోణాలు, అంతరాంతరాల్లో ఆమె ఆలోచన సమగ్రంగా దర్శితమవుతాయి.’ స్త్రీలను సాహిత్యం, మనస్తత్వ శాస్త్రంతో పాటు మతం బలంగా పురుష పెత్తనం కిందికి నెట్టింది.

అది హిందూమతంలోనే కాదు, అన్ని మతాల్లోను కొనసాగింది. స్త్రీ మానసికంగా బలహీన మైనదని చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఆమె ఒక పని తీసుకుంటే ఆ పని పూర్తి అయ్యేవరకు నిదురపోదు. ప్రపంచంలో మానసిక తత్వవేత్తలు అందరూ ఇప్పుడు స్త్రీ ఆత్మ స్థైర్యం మీద సానుకూలంగా స్పందిస్తు న్నారు. అందుకే ఆమె ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతున్నది. నిజా నికి స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా కుటుంబ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాదు... ఆమె రాజ్య, ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నదని అర్థమవుతుంది. 

ఈనాడే కాదు, స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీలు ఆయా దేశాల్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళారు. క్లియో పాత్రా (ఈజిప్ట్‌), క్వీన్‌ ఎలిజబెత్‌ (బ్రిటన్‌), కేథరిన్‌ ది గ్రేట్‌ (రష్యా), మేడమ్‌ డె పాంపెడర్‌ (ఫ్రాన్స్‌), సిరిమావో బండారునాయకే (శ్రీలంక), మార్గరెట్‌ థాచర్‌ (బ్రిటన్‌), ఇవా పెరాన్‌(అర్జెంటీనా), గోల్డా మెయిర్‌ (ఇజ్రాయెల్‌) లాంటి నాయకురాళ్ళు పితృస్వామ్య వ్యవస్థలోనే రాజ కీయ ఆధిపత్యాన్ని వహించగలిగారు. 

ఇకపోతే 17వ లోక్‌సభలో స్త్రీల సంఖ్య పెరగడం గుణాత్మకమైన మార్పు అనక తప్పదు. యువకులు, విద్యావంతులైన నాయకులతో కూడిన సభగా 17వ లోక్‌సభ నిలిచింది. గతంలో కంటే లింగ నిష్పత్తి మెరుగైంది. లింగ నిష్పత్తిలో చాలా దేశాల కంటే వెనుకంజలో ఉన్న  ప్పటికీ మెరుగుదల కనిపించింది. మొదటిసారి ఎంపీలు దాదాపు సగం (260 మంది) ఉన్నారు. తిరిగి ఎన్నికైన ఎంపీల సంఖ్య కూడా పెరిగింది. 70 ఏళ్లు పైబడిన ఎంపీలు తగ్గి, 40 ఏళ్ళ కంటే తక్కువ వయస్సుగల ఎంపీలు పెరిగారు.

ఎంపీల సగటు వయస్సు 54 ఏళ్లుగా ఉంది. తొలి లోక్‌సభలో 26 శాతం మంది యువ ఎంపీలు ఉంటే, 16వ లోక్‌సభ నాటికి 40 ఏళ్ల లోపు వారు 8 శాతం మందే ఉన్నారు. ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. పిన్నవయస్సుగల సభ్యురాలిగా 25 ఏళ్లకు ఎంపీగా ఎన్నికైన బిజూ జనతా దళ్‌ నేత చంద్రాణి ముర్ము (ఒడిషా) నిలిచారు. వయోవృద్ధుడిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌ వాదీ ఎంపీ షఫీకుర్‌ రెహమాన్‌ బర్క్‌ (90) ఉన్నారు. పురుషుల కంటే తక్కువ వయస్సు గల మహిళా ఎంపీలు ఈ సభలో ఉన్నారు. 

2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 716 మంది ఉంటే, 78 మంది ఎన్నికయ్యారు. 2014లో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయితే చాలా దేశాల్లో మహిళా ఎంపీల శాతం ఎక్కువగా ఉంది. రువాండాలో 61 శాతంగా, దక్షిణాఫ్రికాలో 43 శాతంగా, బ్రిటన్‌లో 32 శాతంగా, అమెరికాలో 24 శాతంగా, బంగ్లాదేశ్‌లో 21 శాతంగా ఉంది. 17వ లోక్‌సభ ఎంపీల్లో 39 శాతం మంది తమ వృత్తిని రాజకీయాలు, సామాజిక సేవగా పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తామని 38 శాతం మంది, వ్యాపారవేత్తలమని 23 శాతం మంది వెల్లడించారు. 

ఇకపోతే స్త్రీలు తమ విద్యా సంపత్తితో పాటు రాజకీయ అవ గాహనను కూడా పెంచుకోవాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నీ స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెబుతున్నాయి. 2016లో నిర్వహించిన  లింగ సమానత్వ సూచిలో 87వ ర్యాంక్‌ పొందిన ఇండియా... 2023 నాటికి 146 దేశాల్లో 144వ స్థానానికి పరిమితమయ్యింది. 2021 నాటికి దేశంలో కార్మికుల్లో స్త్రీల శాతం (19.2) మాత్రమే అని ప్రపంచ బ్యాంకు నివేదించింది.

2022–23కు 37 శాతానికి పెరిగిన ప్పటికీ, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. చైనా ఇప్పుడు 61 శాతం స్త్రీ శ్రామిక శక్తిని కలిగింది. ఈ విష యాలన్నీ పార్లమెంటులో ఎత్తిచూపి నిలవేయాలంటే దళి తులు ఎక్కువగా పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులు కావలసి ఉంది. వ్యాపార రంగంలోనూ, విద్యా రంగంలోనూ, శాస్త్ర రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ స్త్రీలు మరింతగా ఎదగాలంటే రాజకీయరంగంలో స్త్రీల సంఖ్య పెరగాలి. 

మరో పక్క మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరుగు తున్నాయి. వాస్తవంలో మహిళలపై దాష్టీకాల ఘటనలు అధిక సంఖ్యలో ఉంటాయనీ, చాలా వరకు అవి బయటకు రావనీ పరిశీలనలు చెబుతున్నాయి. అసంఘటితరంగంలో ఈ వేధింపులు మరింత అధికంగా ఉంటాయని అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క పని ప్రదేశం అని ఏముంది... ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, రహదారులు, ఇలా అన్ని చోట్లా మహిళలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారు.

పనిచేసే చోట ఇలాంటి అకృత్యాలకు గురయ్యే మహిళల్లో దాదాపు 69 శాతం మంది బయటకు చెప్పుకోవడానికి సైతం సంకో చిస్తున్నారని ‘ఉమెన్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’ సర్వే వెల్లడించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కొరవడటం, వృత్తిపర మైన ఎదుగుదలకు అవరోధంగా మారుతుందన్న భయంతో బాధిత మహిళల్లో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తు న్నారు. ఉద్యోగం మాన్పించేస్తారన్న భయంతో చాలామంది కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోవడం లేదు.

ఇకపోతే పురుషుల మానసిక వ్యవస్థలలో వస్తున్న వికృతమయిన మార్పులవల్ల బాలికలపై కూడా దాడులు పెరుగుతున్నాయి. 11, 12 సంవత్సరాల బాలికలపై దాడులు జరుగుతున్న ప్రాంతాలలో ముంబయి, అమృత్‌సర్, వడోదరా, అహ్మదాబాద్, మీరట్‌ ముందు వరుసలో ఉన్నాయి. చివరకు తండ్రే కూతురిని వేధించే అసహ్య కరమైన కేసులు కూడా బయటకు వస్తున్నాయి.

ఈ పరిస్థితులలో రాజ్యాధికారంలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో స్త్రీల విద్య, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని మహిళా ఎంపీలు చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామం. స్త్రీ సాధికారత జాతీయ పురోగతికి తోడ్పడుతుంది. కరుణ, ప్రేమ, ప్రజ్ఞల విస్తృతికి తోడ్పడుతుంది. ఆ దిశగా మనమందరం నడుద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695

Advertisement

What’s your opinion

Advertisement