గణాంకాల్లో మన ఘన వారసత్వం

11 May, 2023 03:09 IST|Sakshi

సందర్భం

భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం భారత్‌ అసాధారణ ప్రేరణనిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్‌ (స్టాట్‌కమ్‌)కు భారత్‌ ఎన్నిక కావడం మనం సంతోషించాల్సిన విషయం.

విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఉంటుంది. సుసంపన్నమైన భారత్‌ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురుషుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్‌ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)ని స్థాపించారు.

భారత గణాంక సమాజం సంతోషించ డానికి కనీసం రెండు కారణాలు ఉన్నాయి. గణాంక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ బహుమతిని ఇండియన్‌–అమెరికన్‌ గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సీఆర్‌ రావుకు బహూకరించారు(ఈయన తెలుగువాడు). సైన్సును, టెక్నాలజీని, మానవ సంక్షేమాన్ని పురోగమింపజేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి కీలక విజయాలను సాధించినందుకు ప్రతి రెండేళ్ల కోసారి ఒక వ్యక్తికి లేదా బృందానికి ఈ అవార్డును అందజేస్తారు.

గణాంక శాస్త్ర సిద్ధాంతాలకు దశాబ్దాలుగా సీఆర్‌ రావు అందించిన తోడ్పాటుకు ఇది నిస్సందేహంగా సరైన గుర్తింపు అని చెప్పాలి. మరొక విజయం, ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్‌ (స్టాట్‌కమ్‌)కు భారత్‌ ఎన్నిక కావడమే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఐక్యరాజ్యసమితి సంస్థలో తిరిగి చేరింది.

1947లో స్థాపితమైన స్టాట్‌కమ్‌... ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌ (ఎకోసాక్‌)కు చెందిన కార్యాచరణ కమిషన్‌. ఇది ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం (యూఎన్‌ఎస్డీ) పనిని పర్యవేక్షి స్తుంది. అలాగే ప్రభుత్వ విధానాలకు, ప్రైవేట్‌ కార్యాచరణకు తోడ్ప డేలా గణాంక సమాచార అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యం వైపుగా కృషి చేయడానికి ప్రపంచవ్యాప్త గణాంక శాస్త్రజ్ఞులను ఒక చోటికి తెస్తుంది. స్టాటిస్టికల్‌ కమిషన్, నార్కోటిక్‌ డ్రగ్స్‌ కమిషన్, ఐక్యరాజ్య సమితి హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ జాయింట్‌ ప్రోగ్రామ్‌... వీటన్నింటికీ భారత్‌ ‘ఎకోసాక్‌’ ద్వారా ఎన్నికైంది.

స్టాట్‌కమ్‌ వ్యస్థాపక పితామహుడు అమెరికన్‌ సామాజిక శాస్త్ర వేత్త, గణాంక శాస్త్రవేత్త అయిన స్టూవర్ట్‌ అర్థర్‌ రైస్‌. 1946 మేలో న్యూయార్క్‌లోని హంటర్‌ కాలేజీలో ‘న్యూక్లియర్‌ సెషన్‌’కు రైస్‌ అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్య సమితి పరిధిలో గణాంకాల కోసం ఒక శాశ్వత కమిషన్‌ ఏర్పాటు, దానికి అవసరమైన నిబంధనలను ఆనాటి సెషన్‌ సిఫార్సు చేసింది.

స్టాట్‌కమ్‌ తొలి మూడు సెషన్లకు 1947–48 కాలంలో కెనడియన్‌ హెర్బర్ట్‌ మార్షల్‌ అధ్యక్షత వహించారు. ప్రపంచ గణాంక వ్యవస్థ రూపకల్పనను వేగవంతం చేయడం ద్వారా శాంతి కోసం ప్రపంచాన్ని కూడగట్టే ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలకు తోడ్పడటం అనే లక్ష్యాన్ని మూడో సెషన్‌ (1948) నివేదిక ప్రకటించింది. 

అంతర్జాతీయ గణాంకపరమైన కార్యకలాపాల కోసం ఏర్పడిన అత్యున్నత నిర్ణాయక విభాగమైన స్టాట్‌కమ్‌... గణాంకపరమైన ప్రమాణాలను రూపొందించడం; జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాటిని అమలు చేయడంతో సహా భావనలు, విధానాల అభివృద్ధి విషయంలో బాధ్యత తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల్లోని – మొత్తంగా 24 – కీలక గణాంక శాస్త్రవేత్తలను ఇది ఒకటి చేసింది. గత 76 సంవత్సరాల కాలంలో, కమిషన్‌ ప్రపంచమంతటి నుంచి ఒక చీఫ్‌ స్టాటిస్టీషియన్‌ నేతృత్వంలో నడుస్తూ వచ్చింది.

గణాంకాలు, వైవిధ్యత, జనాభా రంగంలో భారతీయ నైపుణ్యమే ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్‌ కమిషన్‌లో భారత్‌కు స్థానం సాధించి పెట్టిందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇటీవలే ట్వీట్‌ చేశారు. సుసంపన్నమైన భారత్‌ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురు షుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్‌ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది.

ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)ని స్థాపించారు. ఆధునిక భారత గణాంక వ్యవస్థలో అత్యంత విశిష్ట వ్యక్తి అయిన మహలనోబిస్‌ భారత రెండో పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి కూడా. అలాగే జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థతో పాటు కేంద్ర గణాంక సంస్థ స్థాపనలో కూడా కీలకపాత్ర వహించారు. 

స్టాట్‌కమ్‌లో భారత్‌ మునుపటి పాదముద్రకు ప్రధానంగా మహ లనోబిస్‌ కారణం. కమిషన్‌ ప్రారంభ సమయంలో ఆయన శిఖర స్థాయిలో ఉండేవారు. 1946లో ప్రారంభ సెషన్‌ నుంచి 1970లో సంస్థ 16వ సెషన్‌ వరకు తన జీవితకాలంలో అన్ని సెషన్లకు హాజరైన అద్వితీయ రికార్డు ఆయన సొంతం. సభ్యుడిగా, రాపోర్టర్‌గా, వైస్‌ ఛైర్మన్‌గా అనేక పాత్రలను పోషించిన మహలనోబిస్‌ 1954 నుంచి 1956 వరకు 8వ, 9వ సెషన్లకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన సంస్థకు అద్వితీయ తోడ్పాటును అందించారు.

నమూనా సేకరణ కోసం ఐక్యరాజ్యసమితి సబ్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తే ‘‘ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో గణాంక శాస్త్రం మెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్ప సహాయం చేస్తుంది’’ అని సూచిస్తూ మహలనోబిస్‌ 1946 ఏప్రిల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాశారు. దానికనుగుణంగానే ఒక సబ్‌ కమిషన్‌ ఏర్పాటైంది. తర్వాత ఈ ఉప కమిషన్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ ఉపకమిషన్‌ నమూనా సర్వే నివేదిక (1947) సన్నాహకాల కోసం సిఫార్సులు చేసింది. వివిధ రంగాల్లో అధికారిక గణాంకాలకు సంబంధించిన నమూనా సర్వేల అన్వయానికి ఈ సిఫార్సులు మార్గాన్ని సుగమం చేశాయి.

‘శిక్షణ పొందిన మానవ వనరులను కలిగి ఉండని దేశాల్లో’ గణాంక శాస్త్రంలో విద్య కోసం అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రోత్స హించడంలో మహలనోబిస్, రైస్‌ కీలక పాత్ర పోషించారని ఇండి యన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్‌ టీజే రావు ఒక పరి శోధనా వ్యాసంలో పేర్కొన్నారు. అలాంటి సంస్థను ఆసియా దేశాల కోసం లేదా ఇండియా, దాని పొరుగు దేశాల కోసం ఏర్పర్చాలని మహలనోబిస్‌ సూచించారు.

1950లో కలకత్తాలో స్థాపించిన ‘ది
ఇంటర్నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌’ (ఐఎస్‌ఈసీ)ను ఇప్పుడు ఐఎస్‌ఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మహలనోబిస్‌ 1972లో చనిపోయారు. ఆ సంవత్సరం తన 17వ సెషన్లో చేసిన ఒక తీర్మానంలో కమిషన్‌ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ‘‘సామాజిక గణాంక శాస్త్రం తరపున ఆయన సాగించిన మార్గదర్శక ప్రయత్నాలను స్మరించుకుంటున్నాము.

అభివృద్ధి చెందుతున్న దేశాల గణాంక అవసరాల కోసం నిలబడిన ఛాంపి యన్‌గా›ఆయన్ని స్మరించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన అసాధారణ ప్రేరణను మేము స్మరించుకుంటున్నాము’’ అని పేర్కొంది. ‘‘కమిషన్‌ సభ్యుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో ఆయన అసాధా రణ సామర్థ్యాన్ని’’ కూడా కమిషన్‌ ఆ సందర్భంగా గుర్తుచేసుకుంది.

సీఆర్‌ రావు క్లాస్‌మేట్, ఎలెక్ట్రానిక్‌ డేటా ప్రొసెసింగ్‌లో పథగామి వక్కలంక ఆర్‌.రావు (ఈయనా తెలుగువాడే) 1976లో స్టాట్‌కమ్‌ 19వ సెషన్‌కు అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి డ్యూటీ స్టేషన్‌ వెలుపల స్టాట్‌కమ్‌ నిర్వహించిన ఏకైక సమావేశం ఇదే. ఇది న్యూఢి ల్లీలో జరిగింది. స్టాట్‌కమ్‌ 70వ వార్షిక సంబరాల కోసం రూపొందించిన బుక్‌లెట్‌ బ్యాక్‌ కవర్‌ పేజీపై, 1976 సెషన్‌ కోసం హాజరైనవారు తాజ్‌మహల్‌ ముందు నిల్చున్న చిత్రాన్ని పొందుపర్చారు.

భారత్‌కు ఉజ్వలమైన గణాంక శాస్త్రపు గతం ఉంది. మన దేశం స్టాట్‌కమ్‌కు గణనీయ స్థాయిలో తోడ్పాటును అందించింది. అంత ర్జాతీయ గణాంక రంగంలో భారత్‌ తన స్థానాన్ని తిరిగి పొందినట్ల యితే, అది ప్రశంసార్హమవుతుంది. భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. దీనికి మహలనోబిస్‌ గొప్ప ప్రయత్నం కారణం.

అంతేకాకుండా గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలా యించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఐక్య రాజ్యసమితి గణాంక కార్యకలాపాల ప్రధాన స్రవంతి వైపు భారత్‌ తిరిగి వెళ్లడం సరైన దిశగా వేసే ముందడుగు అవుతుంది.

అతనూ బిశ్వాస్‌ 
వ్యాసకర్త ప్రొఫెసర్, ఐఎస్‌ఐ, కోల్‌కతా
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు