కాప్‌–28లో భారత్‌ భూమిక కీలకం!

25 Nov, 2023 00:12 IST|Sakshi

విశ్లేషణ

వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్‌ సమావేశాలు నవంబర్‌ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్దేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకు రావాలని భారత్‌ కాంక్షిస్తోంది. ఆతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాప్‌–28 సమా వేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. దీనికి కేంద్రబిందువుగా భారత ప్రభుత్వపు లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌ (లైఫ్‌) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్‌ దోహదపడుతుంది.

గత వారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షంతో యుఏఈలో జనజీవితం స్తంభించిపోయింది. పాఠశాలలు బంద్‌ అయ్యాయి. పాఠాలు ఆన్‌లైన్‌ మార్గం పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితమయ్యారు. ఒక్కసారిగా ముంచెత్తిన వాన జోరుకు వీధుల్లో కార్లు పడవలయ్యాయి. పౌరుల భద్రతకు అధికార యంత్రాంగం నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే... యుఏఈ, సౌదీ, బెహ్రాయిన్‌ వంటి దేశాల ప్రజలు నిన్నమొన్నటివరకూ నింగి నుంచి నేలకు జారే వాన చినుకులు చూసేందుకు రుతుపవవాల సీజన్‌లో ముంబైకి వచ్చేవారు. కేవలం వాన హోరు, జోరులను ఆస్వాదించేందుకు వీరు నరీమన్‌  పాయింట్, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రాభిముఖంగా ఉన్న ఖరీదైన బంగళాలు, హోటళ్లలో దిగేవారు. 1970లలో బయటపడ్డ ముడిచమురు వారి ఈ విలాసానికి సాయపడేది. వాన చినుకులకు వారు ముఖం వాచిపోయి ఉండేవారు. అయితే అది గతం. ఇప్పుడు వారే భారీ వర్షాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూండటం వైచిత్రి.

గాలి మూటలు... నీటి రాతలు...
15 రోజులపాటు కొనసాగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌) 28వ సమావేశానికీ, వాతావరణ మార్పులపై జరిగే ఇతర సమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది! ధనిక దేశాలు అనేకం కాప్‌ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడతాయి. అలివికాని హామీలూ గుప్పిస్తాయి. సమావేశాల తరువాత అన్నింటినీ మరచిపోతూంటాయి. ఇప్పుడు ఆ దేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్య క్షంగా చవిచూస్తున్నాయి. అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మరికొన్ని దేశాలు అసలు సమస్యను కాకుండా, లక్షణాలపై ఎక్కువ దృష్టి పెడతాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ 2025 జనవరి నాటికి మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై అతడికి నమ్మకం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాలి. గత పాలకులు సంతకం చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకొనేలా చేసిన ఘనత ఆయనదే.

రెండేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కాప్‌–26 సందర్భంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కూడా పెద్ద హామీలిచ్చింది. వాతావరణ మార్పులకు మూల కారణాలను వెతికి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత ఏం జరిగిందన్నది వెనుదిరిగి చూసుకుంటే... స్వదేశంలో జరిగిన కాప్‌–26 సమావేశాలకు వైఫల్యం ముద్ర అంట కూడదనే యూకే అలా ప్రకటించి ఉండవచ్చునన్న అనుమానాలు బల పడుతున్నాయి. యూకేతోపాటు పారిశ్రామిక దిగ్గజ జీ–7 దేశాలన్నీ ఇలాంటి మాటలే మాట్లాడాయి. వాతావరణ మార్పుల సమస్యకు చేసింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి! కాప్‌–26లో ఇచ్చిన హామీల అమలును మాత్రమే కాదు... 2015 నాటి కాప్‌–21 అంటే చారిత్రాత్మక ప్యారిస్‌ ఒప్పందం విషయంలోనూ యూకే వెనకడుగు వేసింది. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్‌ ఒప్పందం మొట్టమొదటి అంతర్జాతీయంగా అమలు చేయదగ్గ చట్టంగా మారడం గమనార్హం. 

మొత్తం 196 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుత బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌... వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకయ్యే ఖర్చులతో బ్రిటిష్‌ ప్రజలపై పడే ఆర్థిక భారం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు యూఏఈ ఈ ఖర్చులను భరిస్తానని చెప్పడమే కాదు...
సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుబడుల ద్వారా ఇతర దేశాలకూ సాయం చేస్తామని ప్రకటించింది. 

సమస్యను పరిష్కరించే గాంధేయవాదం
2015 నాటి కాప్‌ 21 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వాతావరణ మార్పుల విషయంలో నిర్ణయాత్మకంగా మారింది. అప్పటివరకూ సమస్యగా భావించినదే పరిష్కారంలో భాగమైపోయింది. వాస్తవానికి భారత్, కాప్‌–28కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ రెండూ వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం విష యంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకే ఈ కాప్‌– 28 సమావేశాల్లో భారత్‌ పాత్ర కీలకం కానుంది. ప్రపంచ దేశాలన్నీ సమస్య పరిష్కారానికి ఒక్కమాటపై కదిలేలా చేసేందుకూ భారత్‌ గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది.  

ఈ ఏడాది జనవరిలో యూఏఈ పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత శాఖ మంత్రి సుల్తాన్‌  అహ్మద్‌ అల్‌ జబేర్‌ను కాప్‌–28 అధ్యక్ష స్థానం వరించింది. ఆ వెంటనే ఆయన మొదటగా భారత్‌ పర్యటనకు విచ్చేశారు. దీన్ని భారత్‌ మరచిపోలేదు. బెంగళూరులో మాట్లాడుతూ కాప్‌–28పై జబేర్‌ తన అంచనాలను వివరించారు. దశాబ్ద కాలంగా అల్‌ జబేర్‌ తరచూ భారత్‌కు వస్తూన్నారు. భారతీయ నేతలతో ఆయన సంబంధాలు బాగా తెలిసినవే. అల్‌ జబేర్‌ మంత్రి మాత్రమే కాకుండా, అబూదబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ గ్రూపు సీఈవో కూడా. యూఏఈతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రయ త్నిస్తున్న సమయంలో ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను  మార్చేయ డంలో అల్‌ జబేర్‌ కీలకపాత్ర పోషించారు. అబూదబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ ద్వారా భారత్‌ ఇంధన భద్రతకు గట్టి హామీ కూడా ఇచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ అంశం ప్రస్తుత సమావేశాల్లోనూ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కాప్‌–28 అధ్యక్షుడిగా అల్‌ జబేర్‌ మద్దతు ఉండటంతో అంత ర్జాతీయ వాతావరణ మార్పుల చర్చ దిశను నిర్ణయాత్మకంగా మార్చా లని భారత్‌ కూడా ఆశిస్తోంది. ఆయా దేశాలే కేంద్రంగా సాగుతున్న ప్రయత్నాలను సార్వజనీనం చేసేందుకు భారత్‌ ప్రయత్నించాలి. దీనికి కేంద్రబిందువుగా మోదీ  ప్రభుత్వపు లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరా
న్మెంట్‌ (లైఫ్‌) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అల వర్చుకునేందుకు లైఫ్‌ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి. ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి, వృథా వ్యవహారాలకు చెక్‌ పడుతుంది. వీటి కారణంగా భూమ్మీద వనరులు కరిగిపోతున్న విషయం తెలిసిందే. 

అబూదబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ సీఈవో అయిన అల్‌ జబేర్‌ ఆ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికీ కృషి చేస్తున్న విషయం చెప్పుకోవాలి. యూఏఈ రెన్యూవబుల్‌ ఎనర్జీ కంపెనీ మస్‌దార్‌కు ఆయన తొలి సీఈవోగా, తరువాతి కాలంలో చైర్మన్‌ గానూ పనిచేశారు. ఈ కంపెనీకి దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. కాప్‌–28లో పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం వైపు ప్రపంచం మళ్లేందుకు అల్‌ జబేర్‌ కాలుష్య కారక ముడిచమురు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యూఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చి మాసియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు యూఏఈ వద్ద పుష్కలం. ఈ నేపథ్యంలోనే 2015 నాటి ప్యారిస్‌ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్‌ సమావేశాలు మరింత ఫలప్రద మవుతాయని ఆశిద్దాం.

- కె.పి. నాయర్‌ 

వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
 

మరిన్ని వార్తలు