Kathi Mahesh : ఎన్నో వివాదాస్పద అంశాలు..అయినా బెదరలేదు

12 Jul, 2021 00:03 IST|Sakshi

నివాళి 

‘‘శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.’’ అప్పటికి మూడు పదులు కూడా నిండని కత్తి మహేష్‌– బ్లాగ్‌ పరిచయంలో తన చూపుని అట్లా ప్రకటించుకున్నాడు. ఎలాంటి కాలమది!. పత్రికలు, టీవీలని దాటి కొత్త మాధ్యమాలు అవతరిస్తున్నాయి. ఆర్కుట్‌ మూత పడుతూ బ్లాగులు కళకళ లాడుతున్నాయి. అప్పటివరకూ సాహిత్యం, సమాజం పట్ల నిబద్ధత కలిగిన మేధా సమూహాల రచనలకి దీటుగా సమస్త భావజాలాల మేలిమి ఆలోచనలతో బ్లాగ్‌ ప్రపంచం విస్తరించింది. 

2007 – 2012 కాలంలో తెలుగు బ్లాగుల్లో కుల మత, ప్రాంత, జెండర్‌ భావాల సైద్ధాంతికతని ఒంటిచేత్తో ప్రవేశ పెట్టినవాడు మహేష్‌. అతని ‘పర్ణశాల’ బ్లాగ్‌ – అర్ధ దశాబ్దపు విస్ఫోటనం. తమ అభిమాన హీరో మీద విమర్శ చేస్తేనో, తాము పూజించే దేవుడిని తార్కికంగా ప్రశ్నిస్తేనో అతను ఎదుర్కొన్న దాడులు ఇటీవలివి. ట్రోలింగ్‌ అన్నమాట సమాజానికి పూర్తిగా పరిచయం కాకముందే పలు ఆధిపత్య సమూహాల చేత ట్రోల్‌ చేయబడ్డాడు. వ్యభిచార చట్టబద్ధత, నగ్న దేవతలు, కుల గౌరవ హత్యలు, ప్రత్యేక తెలంగాణ, పశువధ – గొడ్డు మాంసం, భాష – భావం, వివాహానికి పూర్వం సెక్స్, వర్గీకరణ సమస్య, గే చట్టం, కశ్మీర్‌ అంశం మొదలుకుని అనేక వివాదాస్పద అంశాల్లో పది పద్నాలుగేళ్ళకి ముందే దాదాపు నాలుగైదు వందల పోస్టులు రాసాడు. మేధావులనబడేవారి పరిమిత వలయంలో తిరుగాడుతుండే అటువంటి అంశాలని, వాటిమీద తన ప్రశ్నలని మామూలు ప్రజల మధ్యకి తీసుకు వచ్చాడు. అందుకోసం ఆర్కుట్‌– బ్లాగ్‌– ఫేస్బుక్‌– ట్విట్టర్‌– ఇన్‌ స్టాగ్రామ్‌ మీదుగా విస్తరించుకుంటూ సినిమాలు, పార్లమెంటరీ రాజకీయాలు తన కార్యక్షేత్రాలుగా నిర్ణయించుకున్నాడు.
 
ప్రశ్నని నేర్చుకుంటే దానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతటిదో తెలిసాక కూడా ‘నువ్వు రాసింది చదివి, రావలసిన వారికి కోపం రాకపోతే, నీ మీద బెదిరింపులకు దిగకపోతే, నీ మీద హత్యా ప్రయత్నమైనా జరగకపోతే, నువ్వేం రాస్తున్నట్టు?‘ అనగలిగిన తెగువ మహేష్‌కి ఉంది. అవును అతను దళితుడు, కానీ అతనిది మాలిమి చేయడానికి అనువైన బాధిత స్వరం కాదు, అందరినీ దూరం పెట్టే ఒంటరి ధిక్కార స్వరమూ కాదు. మందిని కలుపుకు పోయే, అనేక వర్గాలతో చెలిమి చేయగల ప్రజాస్వామిక స్వరం. ఈ గొంతు దిక్కుల అంచుల వరకూ వినబడగలిగే శక్తి కలిగినది కాబట్టే అంతే తీవ్రతతో వ్యతిరేకత కూడా వచ్చింది.
 
కులం మతం వంటి సున్నితమైన అంశాల మీద మాట్లాడినపుడు, అతడి తర్కానికి జవాబు ఇవ్వడం తెలీని వారు, వ్యక్తిగత దూషణలకు దిగినా సంయమనం కోల్పోకుండా ఓపిగ్గా విషయాన్ని వివరించడానికి ప్రయత్నించేవాడే తప్ప మాట తూలేవాడు కాడు. అసలది అతని నైజమే కాదు. మహేష్‌ కంటే ముందే పురాణపాత్రలను విమర్శించిన వారెందరో ఉన్నారు. కేవలం అతని దళిత అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని అతని విమర్శలను అంగీకరించక విషం కక్కిన లోకానికి మహేష్‌ ఎన్నడూ జడవలేదు. తిరిగి విషమూ కక్కలేదు. తనదైన శైలిలో తన అభిప్రాయాలను చెపుతూనే ఉన్నాడు, మర్యాదగా విభేదించడం మహేష్‌ వద్ద చాలామంది మిత్రులు నేర్చుకున్న విషయం. బ్లాగుల్లో తనతో హోరాహోరీ వాదనలకు దిగిన వ్యక్తులు బయట కలిస్తే అత్యంత స్నేహపూరితంగా ఉండేవాడు. పరుషమైన మాటలతో వ్యక్తిగత దూషణలు చేసినవారు సైతం, అతని స్నేహస్వభావానికి కరిగి స్నేహితులుగా మారిపోయిన సందర్భాలు అనేకం. రాముడిని విమర్శించి నగర బహిష్కరణకు గురైన అతడు 2007 లోనే తన బ్లాగ్‌ పేరు ‘పర్ణశాల’గా పెట్టుకున్నాడు. ‘పర్ణశాల అంటే ఆకుల పందిరి. దానికింద కూచుని అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. చాయ్‌ ఉంటే ఇంకా... రాముడు కూడా అలాంటిది ఒకటి కట్టుకున్నాడన్నమాట‘ అనేవాడు సరదాగా.
 
వేలాది పేజీల తన రాతలు ఒక్క పుస్తకంగా కూడా వేసుకోలేదు మహేష్‌. అసలు ఆ ఆలోచన ఉన్నట్లు కూడా ఎపుడూ కనపడలేదు. నిలవ ఆలోచనల మీద ఘర్షణ, వ్యక్తుల్లో మానసిక విలువల పెంపుదల జరిగి మానవ సంస్కారంలో అవి ఇంకిపోతే చాలని అనుకునేవాడేమో! మనుషుల పట్ల ఇంత అక్కర ఉన్నవారు అత్యంత అరుదు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి పోరాటాలు వారివి, తలదూర్చితే తలనొప్పులని తప్పుకునే వారే ఎక్కువ. కానీ మహేష్‌కి అంతశక్తి ఎలా వచ్చేదో కానీ తిరిగి ఒకమాట అనలేని వారి పక్షాన, చర్చల్లో ఒంటరులైనవారు అలిసిపోయే సమయాన– వారి ప్రాతినిధ్య స్వరంగా నిలబడేవాడు. ఇది చాలామందికి అనుభవమైన విషయం. ఎవరనగలరు అతనికి మనుషుల మీద ద్వేషం ఉందని! ఉన్నదల్లా ప్రేమే. ఆ ప్రేమ వల్లనే నాకెందుకని ఊరుకోక ప్రతిసారీ ఓపిగ్గా చర్చకి దిగేవాడు, చర్చే నచ్చనివారికి అది వితండవాదం కావొచ్చు. కానీ సంభాషిస్తూనే ఉండడం ఒక అంబేడ్కరైట్‌ గా అతని ఆచరణ. మహేష్‌కీ అంబేడ్కర్‌కీ ఆచరణలో ఒక పోలిక కనపడుతుంది. వారిద్దరూ తాము ప్రాతినిధ్యం వహించిన పీడిత కులాల గురించి ఆలోచనలు చేసి వారి ఎదుగుదలకి పునాదులు సూచించి ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి మొత్తం నిర్మాణం కావాలని ఆశించారు. అందుకోసం అంబేడ్కర్‌ చేసిన కృషి ఆయన్ని జాతి మొత్తానికి నాయకుడిగా నిలిపింది. మహేష్‌ ఆయన మార్గంలో వడిగా సాగుతుండగా విషాదం సంభవించింది.
 
రచయిత, విమర్శకుడు, సినిమా నటుడు, గాయకుడు, సామాజిక వ్యాఖ్యాత, కార్యకర్త, రాజకీయ నాయకుడుగా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహేష్‌. మరి నాలుగైదు దశాబ్దాలు ఉండవలసిన మనిషి, అసమాన త్యాగాలతో నిండిన సామాజిక చైతన్యానికి కొత్త చేర్పుని, కొత్త రూపుని కనిపెట్టగల ఆధునిక ప్రజా కార్యకర్త – పరుగు పందాన్ని  అర్ధాంతరంగా ఆపి విశ్రాంతికై తన కలల పర్ణశాలకి మరలిపోయాడు. వేలాది పేజీలలో, వందలాది ఉపన్యాసాలలో అతను పొదిగిన ప్రశ్నలను అంది పుచ్చుకుని ఈ పరుగుని కొనసాగించడమే మనం చేయగలిగింది.  

కె.ఎన్‌. మల్లీశ్వరి, సుజాత వేల్పూరి
(నటుడు, సినీ, సాహిత్య, సామాజిక విమర్శకుడు 
కత్తి మహేష్‌కు నివాళిగా)

మరిన్ని వార్తలు