‘అప్పర్‌ భద్ర’తో అనంత ఎడారి!

17 May, 2022 11:56 IST|Sakshi

బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకకు చెందిన ‘అప్పర్‌ భద్ర’కు నీటి కేటాయింపులు లేకపోయినా, ఆగమేఘాల మీద సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, జాతీయ హోదా కల్పించి, నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందువల్ల అనంతపురం జిల్లా కనీసం తాగునీరు కూడా అందకుండా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ఎగువ భద్ర ప్రాజెక్టు పూర్తయితే, తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఉండదు. ఇందువల్ల కృష్ణా బేసిన్‌ ఆయకట్టు పరిస్థితి అటుంచితే... అనంతపురం జిల్లాకు ఏకైక నీటి ఆధారమైన హై లెవెల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సీ) ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుంది. 

తుంగభద్ర డ్యామ్‌ పైన 295 టీఎంసీలకు మించి కర్ణాటక నీటిని వాడుకోవడానికి వీలులేదని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎప్పుడో చెప్పింది. అయినా 325 టీఎంసీల వరకు వాడుకుంటున్నట్లు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. అంతేకాకుండా కృష్ణా బేసిన్‌ పరిధిలోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను బేఖాతరు చేసి, తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ... ‘మేం తుంగ, భద్ర, ప్రాజెక్టుల ఆధునికీకరణల వల్ల మిగిలిన నీటిని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కృష్ణా బేసిన్‌కు వచ్చే 20 టీఎంసీల నీటిని కలుపుకొని వాడుకోవడానికి అప్పర్‌ భద్రను నిర్మిస్తున్నామ’ని కాకమ్మ–గువ్వమ్మ కథలు చెబుతోంది కర్ణాటక. 

తెలుగు రాష్ట్రాల కళ్ళు కప్పి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే 40 ఏళ్ల అనుభవజ్ఞుడు, నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గుడ్డెద్దుకు గడ్డి వేస్తూ ఏమీ పట్టనట్లు కాలం గడిపేశారు. ఆ పాపం వల్లనే నేడు తుంగభద్ర డ్యామ్‌కు కనీసం నీరు కూడా చేరే పరిస్థితి లేకుండా పోయింది.  ప్రజలు రాజకీయాలకతీతంగా అప్పర్‌ భద్ర నిర్మాణాన్ని అడ్డుకోవడంలో భాగంగా ‘ఛలో అప్పర్‌ భద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 

– కె.వి.రమణ; బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్, అనంతపురం.

మరిన్ని వార్తలు