మునుగోడు ఉప ఎన్నిక ఫలితం.. ప్రజల నాడికి నిదర్శనం

12 Nov, 2022 13:16 IST|Sakshi

అభిప్రాయం

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఆ దిశగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పచ్చ జెండా ఊపేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ ఆధ్వర్యంలో అభ్యర్థిని గెలిపించి ‘తెలంగాణ మోడల్‌’ను భారత దేశమంతా అమలు చేయమని ఆశీర్వదించారు. మేమంతా ఇప్పుడు ‘భారత్‌ రాష్ట్ర సమితి’ వెంటేనని తెలంగాణ మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను వివరించాల్సిన అవశ్యకత ఉంది. 


దేశంలో ఏ రాష్ట్రంలో లేని 64 ప్రత్యేక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, చేనేత బీమాలు తెలంగాణ సమాజంలో కేసీఆర్‌ మార్కును చూపిస్తున్నాయి. ఒక వైపు కాళే శ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో రాష్ట్రంలో సాగు లోకి వచ్చిన భూ విస్తీర్ణం అమాంతం పెరిగిపోయి గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, సర్కారే ధాన్యం కొనుగోలు చేయడం, గొర్రె పిల్లలు పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటివి కూడా గ్రామీణఆర్థిక వ్యవస్థను రోజురోజుకూ పటిష్టం చేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2018 ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీల్లో మెజారిటీ నెరవేర్చటం, మిగిలినవి ప్రగతిలో ఉండటం విశేషం. 


అన్నింటి కంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించే పని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో విజయవంతమై రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుండటం శుభ పరిణామం. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్, కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో నిరు పేదలు కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడి నుంచి పూర్తిగా తప్పించుకున్నారు. 

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ రూపాల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తే... కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఎక్కువ ఆదాయం పంపే రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన అసవరం ఉంది. ఇక దేశంలో సామాజిక పింఛన్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఎంతో ముందున్నది. (క్లిక్: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..)

కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలో వెనకబడిన, అణచివేతకు గురవుతున్న ప్రాంతాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవశ్యకత నేడు ఎంతో ఉంది. సహజ సంపదలు ఎన్ని ఉన్నా... వాటిని వినియోగించు కోలేని స్థితి పలు రాష్ట్రాల్లో పక్కాగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లకు సాకారమైన కాళేశ్వరం... నేడు తెలంగాణ ప్రగతిలో మేలి మలుపు అయింది. వివిధ నదుల కింద ప్రాజెక్ట్‌ల నిర్మాణం ద్వారా, అనేక పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచి సంపద సృష్టించి, ఆ సంపదను మళ్లీ ప్రజలకే పంచడం కేసీఆర్‌ ప్రత్యేకత. అందుకే మునుగోడు ఓటరు కేసీఆర్‌ని దీవించి భారత్‌ రాష్ట్ర సమితికి పచ్చాజెండా ఊపారు.


- డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు 
ఉభయ రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌

మరిన్ని వార్తలు