ప్రజా సంక్షేమం కోసమే కులగణన

19 Nov, 2023 01:36 IST|Sakshi
కులగణన –2023 సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నేతలు

గుంటూరు వెస్ట్‌: ప్రజల సంక్షేమానికి అవసరమైన పాలసీలను రూపొందించేందుకు కులగణన ఉపయోగపడుతుందని ప్రజల సంక్షేమం కోసమే కులగణన అని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఏపీ స్టేట్‌ కులగణన–2023 పై స్టేక్‌ హోల్డర్స్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 1931లో దేశంలో తొలిసారి బ్రిటిష్‌ కాలంలో కులగణన జరిగిందన్నారు. ఇటీవల బిహార్‌ రాష్ట్రంలో చేపట్టారన్నారు. అసంఖ్యాకంగా ఉన్న వెనుకబడ్డ తరగతుల వివరాలు, జనాభా ప్రకారం సంఖ్య తీసుకుని మరిన్ని మెరుగైన పాలసీలను రూపొందించేందుకు కులగణనకు ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఈ క్రమంలోనే కుల సంఘ నాయకులు, మేధావులతో సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. వారి సూచనలు, సలహాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి వారం రోజులపాటు కులగణన జరుగుతుందన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొనే సిబ్బందికి పూర్తి శిక్షణనిచ్చామన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేయలేని పనిని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వెనుకబడిన అనేక వర్గాలకు పదవులు లభించాయన్నారు.

గొప్ప ముందడుగు..

సమావేశానికి హాజరైన కుల సంఘాల నాయకులు, మేధావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ కులగణన–2023 గొప్ప ముందడుగన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొన్ని కులాలు ఎదిగాయని, మరికొన్ని కులాలు బాగా అణిచివేయబడ్డాయన్నారు. కులగణన ద్వారా జనాభా లెక్కతోపాటు హక్కులు కూడా సంక్రమిస్తాయని చెప్పారు. దీనిని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు తమ మద్దతుంటుందని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్‌ఓ చంద్రశేఖరరావు, ఆర్డీఓ పి.శ్రీకర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మధుసూధనరావు, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కోలా భవాని, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, టిడ్కో డైరెక్టర్‌ కె.నాగేశ్వరి, ఆర్‌అండ్‌బీ డైరెక్టర్‌ పిల్లిమేరి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

రెవెన్యూ కల్యాణమండపంలో

కులగణన – 2023 సదస్సు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు,

వివిధ కుల సంఘాల నేతలు

మరిన్ని వార్తలు